డస్ట్‌బిన్లలో సెల్‌ఫోన్ దాచాల్సిన అవసరమేంటి? : Raghunandan Rao

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-23 07:09:36.0  )
డస్ట్‌బిన్లలో సెల్‌ఫోన్ దాచాల్సిన అవసరమేంటి? : Raghunandan Rao
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఐటీ దాడులపై రాజకీయ కోణాన్ని ఆపాదించడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి ఆరోపించడం సరికాదన్నారు. దర్యాప్తు సంస్థలు తప్పు చేసిన వారికే నోటీసులు ఇస్తాయని అన్నారు. సాక్ష్యాల ఆధారంగానే ఐటీ అధికారులు విచారణ జరుపుతారన్నారు. కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరి ఇంటినైనా రైడ్ చేసే అధికారం ఉంటుందన్నారు. అంతేకానీ, వాటికి రాజకీయ కోణాలను ఆపాదించవద్దని మంత్రి మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు స్పష్టం చేస్తున్నట్లు రఘునందన్ రావు తెలిపారు. ఇక, తన కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. మంత్రి మల్లారెడ్డి దగ్గర ఉన్నవాళ్లే ఐటీకి కంప్లైంట్ చేసి ఉంటారని అన్నారు. మంత్రి మల్లారెడ్డి సెల్ ఫోన్లను డస్ట్‌బిన్‌లో దాచుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మల్లారెడ్డి ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని రఘునందన్ అభిప్రాయపడ్డారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందని... తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అధికారం అడ్డుపెట్టుకుని తప్పు చేసిన వారే భయపడతారన్నారు. మాకు నోటీసులు ఇస్తే మేం పోతున్నాం కదా అని అన్నారు. మరోవైపు ఫాంహౌస్ కేసు గురించి తాను ప్రస్తుతం మాట్లాడలేనని.. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో దాని గురించి చర్చించడం ఓ న్యాయవాదిగా సరికాదని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, కోర్టు ఇచ్చే తీర్పును బీజేపీ గౌరవిస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed