- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష చేపడతాం: కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవటానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణ మళ్లీ అదే అంధకారమనే పరిస్థితి వచ్చిందని, ఒక్క వర్గం కాదు...సంపన్న వర్గాల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరూ బాధపడుతున్నారని అన్నారు. అందుకే దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొంది...కలిసి కట్టుగా ప్రభుత్వంపై పోరాడాల్సి ఉందని పిలుపు నిచ్చారు. తెలంగాణ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి...తెలంగాణ ఉద్యమ చరిత్ర పై కేసీఆర్ అనే చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు కేసీఆర్ అని వెల్లడించారు. నవంబర్ 29, 2009 న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజన్నారు. స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం అని పేర్కొన్నారు.
ఆనాడు కేసీఆర్ సచ్చుడో...తెలంగాణ తెచ్చుడో అని తెగువ కనబరిచిన నాయకుడికి 3 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో అండగా నిలబడ్డారన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి...కులాలకు మతాలకు అతీతంగా అందరిని కలిపిన సందర్భం దీక్షా దివస్ అన్నారు. అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఈ రోజు అవే పరిస్థితులు కనిపిస్తున్నాని, అవే నిర్భంధాలు... అవే అణచివేతలు... అవే దుర్భర పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనిపిస్తున్నాయని అన్నారు. ఆనాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో నేడు మళ్లీ రెండు జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన పరిస్థితి ప్రతి పౌరుడిపై ఉన్నదన్నారు. జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ముందుకుసాగుదామని పిలుపు నిచ్చారు. దీక్షా దివాస్‌లో కేసీఆర్ పాల్గొనడం లేదని వెల్లడించారు.
స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని, ఆ నాటి పాలనను కోరుకుంటున్నారని దాని కోసం పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన సందర్భం అని పేర్కొన్నారు. ఈనెల 29న 33 జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ పై కేసీఆర్ ఏ విధంగా చెరగని ముద్ర వేశారో మళ్లీ గుర్తు చేసుకుంటూ...రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు కదం తొక్కుతాం అని స్పష్టం చేశారు. అన్ని జిల్లాలకు దీక్షా దివాస్ నిర్వహణకు సీనియర్ నాయకులను ఇన్ చార్జులుగా నియమించామన్నారు. ఈ నెల 26 న అన్ని జిల్లాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తామని, 27, 28 తేదీల్లోనూ దివాస్ కు పార్టీ కార్యచరణ రూపొందిస్తామన్నారు. కేసీఆర్ తన దీక్షను ముగించిన డిసెంబర్ 9న మేడ్చల్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. పార్టీ నాయకులంతా ఆరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతామన్నారు.
కేసీఆర్ దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా శ్లాఘనీయ మైందని వెల్లడించారు. ఆ రోజు నిమ్స్ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిందన్నారు. అందుకే డిసెంబర్ 9న నిమ్స్ హాస్పిటల్ లో అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. దీక్షా దివస్ తో పాటు తెలంగాణ తల్లి విగ్రహా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గులాబీ కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆనాటి కార్యక్రమాలు, ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చే విధంగా మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించే విధంగా దీక్షా దివాస్ ను చేపడుతున్నామని, ఈ దుర్మార్గ కాంగ్రెస్, బీజేపీలకు బుద్ది చెప్పాలనే సంకల్పంతోనే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పద్మారావుగౌడ్, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ,ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్ పాల్గొన్నారు.