Sitarama project : 2026 నాటికి ప్రతి ఎకరానికి నీరు అందిస్తాం..ఇది చారిత్రాత్మక రోజు: మంత్రి ఉత్తమ్

by Ramesh N |   ( Updated:2024-08-11 09:58:51.0  )
Sitarama project : 2026 నాటికి ప్రతి ఎకరానికి నీరు అందిస్తాం..ఇది చారిత్రాత్మక రోజు: మంత్రి ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతులకు ప్రతి ఏడాది 6 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2026 ఆగస్టు 15 నాటికి ఆయకట్టులోని ప్రతి ఎకరానికి నీరు ఇస్తామని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామా ప్రాజెక్టు పంప్ హౌస్-2ను తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ స్విచ్ ఆన్ చేశారు. ట్రయల్ రన్ ప్రారంభం అయిన అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు లోని పుసుగూడెం పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతం అయిందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఈ ప్రాజెక్టుకు 60 టీఎంసీ నీటి కేటాయింపు జరిగందని స్పష్టం చేశారు.

సీతారామ ప్రాజెక్టుకు కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఎంత ఖర్చైనా ఈ ప్రాజెక్టు విషయంలో వెనకడుగు వేసేది లేదన్నారు. సీతారామ ప్రాజెక్టు వైరా ప్రాంత రైతులకు వరమన్నారు. గోదావరి జలాలు ఖమ్మం జిల్లాలో పారుతుంటే ఆనందంగా ఉందన్నారు. సీతారామ ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్ ఇరిగేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15న ప్రారంభిస్తారని వెల్లడించారు. మరోవైపు పంద్రాగస్టు రోజే రూ. 2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తామని స్పష్టంచేశారు.

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత పాలకులు రీడిజైన్ పేరుతో రూ. 8 వేల కోట్లు వృథా చేశారని విమర్శించారు. భద్రాచలం, దాని పరిసర ప్రాంత నియోజకవర్గం రైతులకు కూడా ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. పంప్ హౌస్‌ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తి అయితే పాలేరు వరకు గోదావరి జలాలు వస్తాయని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed