- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం అవ్వాలని మనం అనుకోవడం కాదు.. ప్రజలు అనుకోవాలి: మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్
దిశ, తెలంగాణ బ్యూరో : భవిష్యత్ లో ముఖ్యమంత్రి అవుతానా? లేదా? అనేది తనకు తెలియదని, తాను అనుకుంటే అది జరిగేది కాదని, ప్రజలు అనుకోవాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’కు ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. కాగా భవిష్యత్ లో ముఖ్యమంత్రిగా ఈటల రాజేందర్ ను ఊహించుకోవచ్చా? అనే జర్నలిస్టుల ప్రశ్నకు ఆయన ఈవిధంగా స్పందించారు. అంతేకాకుండా తెలంగాణలో బీజేపీ 12 సీట్లకు పైబడి గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
ఈటల నుంచి ఫైర్ కోరుకుంటున్నారు
ఈటల రాజేందర్ మాటల్లో ఫైర్ ఉండాలని చాలామంది కోరుకుంటున్నారని, ప్రస్తుతం మీడియాకు కూడా అవే అవసరమని, అలాంటి వార్తలే పేలుతాయని ఆయన చెప్పారు. అయితే హెడ్ లైన్లలో నిలవడం కోసం అవతలి వ్యక్తి గుండెకు తగిలేలా మాట్లాడాలని తాను కోరుకోనని, అలా చేసి వార్తల్లో నిలవాలని అనుకునే స్వభావం తనది కాదని ఈటల స్పష్టంచేశారు. తాను ఏదైనా అంశంపై ప్రశ్నిస్తాను తప్పితే.. వ్యక్తిగత దూషణలు కూడా తాను చేయబోనని పేర్కొన్నారు.
ఇన్నేండ్లలో కాంగ్రెస్ ఏం చేసింది?
దేశాన్ని 5 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పాలించిందని, స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ అని నేతలు ఢంకా బజాయించారని ఈటల విమర్శలు చేశారు. మరి ఇన్నేండ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని రాజేందర్ ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక ఎన్నో పనులు చేసిందని, ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిందని, కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయిందో సమాధానం చెప్పాలని ఈటల ప్రశ్నించారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దుచేసింది బీజేపీ అని, కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయిందని ఈటల నిలదీశారు.
రాష్ట్రం అప్పుల్లో ఉందని ముందు తెలియదా?
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రకరకాల డిక్లరేషన్లను కాంగ్రెస్ పెట్టిందని, ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కూడా ప్రకటించిందని, కానీ ఇప్పటి వరకు అమలుచేయలేదని ఈటల ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని చెప్పిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఎలా ఇచ్చిందని, వాటి అమలుకు నిధులు ఎలా తెస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఇచ్చారా? అవగాహన లేక హామీలు ఇచ్చారా.. అనేది ఆ పార్టీ నేతలు చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు.
మొన్న మోడీ బడే భాయ్.. ఇప్పుడు విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డి తీరు కేసీఆర్ లాగే ఉందని ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ కూడా గతంలో మోడీని మెచ్చుకున్నారని, కొన్ని రోజులకే.. ఉచ్ఛరించని పదజాలంతో దూషించారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే దారిలో వెళ్తున్నాడని మండిపడ్డారు. ఇటీవల సభలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మోడీని పెద్దన్న అని రేవంత్ పిలిచారని, ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ పూటకో మాట మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.
రేవంత్ కు ఎవరికీ వరించని అదృష్టం దక్కింది
రేవంత్ కు ఎవరికీ వరించని అదృష్టం దక్కిందని, ఏకంగా ముఖ్యమంత్రి పీఠం ఆయనకు దక్కిందని ఈటల అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక నమ్మి ఓటేసిన ప్రజలను ఆయన మోసం చేశారని విమర్శలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావొస్తోందని, ఇప్పటి వరకు ధరణి సమస్యలు అలాగే ఉన్నాయని రాజేందర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని, ఈ అంశాలపై సమగ్ర దృష్టి పెట్టి.. నీరు అందించేలా రైతులకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కేసీఆర్‌లాగే.. రేవంత్ కూడా..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవతల వ్యక్తులు ఏదైనా చెప్పాలని చూసినా మాట్లాడనివ్వకుండా చేసేవాడని, ఎవరికీ ఏమీ తెలియదన్నట్లుగా వ్యవహరించేవాడని, కించపరిచేవాడని ఈటల అన్నారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే చేస్తున్నాడని తనకు తెలిసిందని రాజేందర్ తెలిపారు. ఎవరైనా ఏదయినా చెప్పబోతే.. ఒంటి కాలిపై నిలుచుంటున్నారని తెలిసిందన్నారు. పగ పట్టినట్లు వ్యవహరిస్తున్నాడని చెబుతున్నారని ఈటల చెప్పుకొచ్చారు.
డిసెంబర్ 9 ఇంకా రాలేదా?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారని, మరి ఆయనకు ఇంకా డిసెంబర్ 9వ తేదీ రాలేదా? అని ఈటల ప్రశ్నించారు. రైతుబంధు కింద కేసీఆర్ ఇచ్చే రూ.10 వేలు కాదని, ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్నారని, అలాగే కౌలు రైతుకు రూ.12 వేలు ఇస్తామన్నారని, మరెందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని రాజేందర్ ప్రశ్నించారు.
రేవంత్.. అవమానాలు ఎదుర్కొన్నాడు
ముఖ్యమంత్రి అయ్యేందుకు రేవంత్ రెడ్డి అనేక కష్టాలు, గత ప్రభుత్వం నుంచి ఎన్నో అవమానాలకు గురయ్యాడని, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని కాపాడుకోవాలని ఈటల రాజేందర్ సీఎంకు సూచించారు. ఇదిలాఉండగా రాష్ట్రాన్ని నడిపేందుకు అప్పుల కోసం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఆశ్రయించారని, ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రిని కూడా కలిశారని ఈటల గుర్తుచేశారు. ఇప్పుడు ఆరు గ్యారెంటీల అమలుకు 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే రాహుల్ ప్రధాని అవుతారని, అప్పుడు అమలు చేస్తామని చెబుతున్నారని విమర్శలు చేశారు.
కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 60 సీట్లు దాటవు
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు 30 సీట్లు వస్తాయో.. 40 సీట్లు వస్తాయోనని ఈటల ఎద్దేవాచేశారు. వాటికి తెలంగాణలోని కాంగ్రెస్ గెలుస్తామని భావిస్తున్న 15 సీట్లను కలుపుకున్నా కనీసం 60 స్థానాలు కూడా దాటబోవని పేర్కొన్నారు. ఆ 60 సీట్లతో కూడా దాటవని, వాటితో అధికారంలోకి వచ్చేది కూడా లేదని సెటైర్లు వేశారు.
పొన్నాలను తిట్టారు.. కేకేను ఎలా తీసుకున్నారు
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన పొన్నాల లక్ష్మయ్యను చచ్చే వయస్సులో పార్టీ మారడమేంటని రేవంత్ విమర్శలు చేశారని, మరి కేశవరావును ఎలా చేర్చుకున్నారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని రాజేందర్ ప్రశ్నించారు. కడియం శ్రీవారి అసలు దళితుడే కాదని విమర్శలు చేసిన రేవంత్.. ఇప్పుడు ఎలా పార్టీలోకి తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కడియం రాజీనామా చేయకుండా పార్టీ మారారని, అలాంటి వ్యక్తిని ఎలా పార్టీలో చేర్చుకున్నారన్నారు. దళితుడే కాదన్న వారికి ఎంపీ టికెట్ ఎలా కేటాయించారని నిలదీశారు. పార్టీ ఫిరాయింపులపై రాజీవ్ గాంధీ యాంటీ డిఫెక్షన్ లా తెచ్చాడని, రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి.. పార్టీ మారేవారు రాజీనామా చేయకుండా వస్తే వేటు వేస్తామని తుక్కుగూడలో పెట్టిన మేనిఫెస్టోలో చెప్పారని, మరి పార్టీ మారిన ఎంతమంది.. రాజీనామా చేశారని ఈటల ప్రశ్నించారు.
మల్కాజిగిరికి, రేవంత్ కు ఏం సంబంధం?
బీజేపీ తనకు మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయమని ఆదేశించిందని, అయితే రేవంత్ రెడ్డి.. మల్కాజిగిరికి, ఈటలకు ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారని ఈటల అన్నారు. మరి మల్కాజిగిరికి, రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటో ముందు చెప్పి ఈ ప్రశ్న తనను అడగాలని ఆయన బదులిచ్చారు. తాను తెలంగాణ ఉద్యమనేతగా ప్రతి ఒక్కరికీ తెలుసని, ప్రతి ఒక్కరూ తనను అక్కన చేర్చుకుంటారని ఈటల వెల్లడించారు.
మల్కాజిగిరిలో డబ్బు ప్రవాహం
రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన స్థానం కావడంతో ఇతర సెగ్మెంట్లు రెండు ఓడిపోయినా పర్లేదు.. కానీ మల్కాజిగిరి గెలవాలని విస్తృతంగా రేవంత్ డబ్బులు ఖర్చు పెడుతున్నారన్నారని ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. కేసీఆర్ లాగే.. రేవంత్ కూడా నాయకులను, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను, వ్యాపారులను కొంటున్నారని, లేదంటే వ్యాపారాలు మూసివేస్తామని భయపెట్టి మభ్యపెడుతున్నారని ఈటల తెలిపారు. హుజురాబాద్ బైపోల్ లో కేసీఆర్ వందల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలు నన్ను గెలిపించారని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ బరిలో ఓటమి చవిచూడటం తన స్వయంకృతాపరాధంగా రాజేందర్ చెప్పుకొచ్చారు.
కేసీఆర్ పీడ విరగడ కావాలని కాంగ్రెస్ ను గెలిపించారు
కేసీఆర్ పీడ విరగడ కావాలని తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ కు నమ్మి ఓటేస్తే.. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ పాలననే రేవంత్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఈటల విమర్శలు చేశారు. ప్రజలు నమ్మి కాంగ్రెస్ ను గెలిపిస్తే.. నట్టేట ముంచుతోందని మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉండటం వల్ల కాంగ్రెస్ నేతల మాట చెల్లొచ్చేమో కానీ సమయం వచ్చినప్పుడు ప్రజలు హస్తం పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు.
ఐదేండ్లు రేవంత్ పాలన సాగించాలి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమతో 8 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటున్నారని, అలా అయితే.. తాము కూడా 60 మంది కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారని చెబుతామని ఈటల కౌంటర్ ఇచ్చారు. పాలనంటే ఇది కాదు కదా అంటూ మండిపడ్డారు. రేవంత్ ఐదేళ్ల పాటు.. పాలన సాగించాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
తప్పు చేయకుంటే కోర్టును ఆశ్రయించాలి
లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడని, కవిత కూడా అరెస్టయిందని, వారు ఎలాంటి తప్పు చేయకుంటే.. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చని ఈటల సూచించారు. అంతేకానీ కేజ్రీవాల్ సతీమణి సోనియాగాంధీ చెంతన ఎందుకు చేరిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈడీని ఉసిగొల్పి ఇతర పార్టీల నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనడం ఏమాత్రం సరికాదని ఆయన తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధితుడిని నేనే
బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధితుడిని తానేనని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తనతో పాటు తన కుటుంబసభ్యులు, డ్రైవర్, వంట మనుషుల నుంచి ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానివల్లే తాను ఈ పరిస్థితిలో ఉన్నట్లు చెప్పారు. కేసీఆర్ తన కేబినెట్ లోని 17 మంది మంత్రులను కూడా నమ్మలేదని, భార్య భర్తల సంభాషణలు కూడా విన్నారని పేర్కొన్నారు. ఇది స్యాడ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీగా పేర్కొన్నారు. ఈ ట్యాపింగ్ వల్ల కాపురాలు కూలిపోయాయని ఈటల చెప్పారు.
ప్రొటోకాల్ లేకుండా చేశారు
వారసత్వ రాజకీయాలకు పాతర వేసే పార్టీ బీజేపీ అని ఈటల అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలను కాదని.. ఓడిన ఎమ్మెల్యేలతో ప్రారంభోత్సవాలు జరిపించారని, తాను ఎమ్మెల్యేగా ఉన్నా.. ప్రోటోకాల్ లేకుండా చేశారని ఈటల వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
రేవంత్ ను ఓడించిన కుటుంబానికి టికెట్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో పట్నం నరేందర్ రెడ్డి ఓడించారని, అందుకే ఆయనకు ఇష్టమైన కుటుంబానికి చెందిన పట్నం సునీతారెడ్డికి రేవంత్ టికెట్ కేటాయించారని, తనపై బరిలో దింపాడని సెటైర్లు వేశారు.
బీజేపీ అక్కున చేర్చుకుంది
బీఆర్ఎస్ నుంచి తనను బర్తరఫ్ చేశాక, మెడలు పట్టి బయటకు పంపాక తనను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ అని ఈటల రాజేందర్ చెప్పారు. తనకు ఎన్నో పదవులు పొందినప్పుడు కూడా పెద్దగా ఏమీ అనిపించలేదని, కానీ.. తెలంగాణ ఏర్పాటుకు బిల్లు ఆమోదం లభించడంతోనే తన జీవితం ధన్యమైందని, తన జీవితానికి సార్థకత చేకూరిందని రాజేందర్ వెల్లడించారు. జర్నలిస్టులు గొప్పగా చదువుకున్న వాళ్ళని, కలాన్ని, గళాన్ని నమ్ముకున్నారని, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.