కొమ్మాల అక్రమ వెంచ‌ర్‌పై చ‌ర్యలేవి..?

by Kalyani |
కొమ్మాల అక్రమ వెంచ‌ర్‌పై చ‌ర్యలేవి..?
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: వ‌రంగ‌ల్ జిల్లా గీసుగొండ మండ‌లం కొమ్మాల గ్రామంలో వెలిసిన అక్రమ వెంచ‌ర్‌పై కాక‌తీయ అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్ అధికారులు ఉదాసీన‌త‌గా వ్యవ‌హ‌రిస్తుండ‌టంపై అనుమానాల‌కు తావిస్తోంది. కొమ్మాల జాత‌ర‌కు అత్యంత స‌మీపంలో సుమారు నాలుగున్నర ఎక‌రాల విస్తీర్ణంలో వెలిసిన ఈ వెంచ‌ర్‌లో అధికార పార్టీకి చెందిన నేత‌లు, ప్రజాప్రతినిధులు భాగ‌స్వాములుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్రమ వెంచ‌ర్‌పై మార్చి 30వ తేదీన ‘దిశ‌’లో క‌థ‌నం ప్రచురితమైంది. ఇదే విష‌యాన్ని కుడా, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జ‌రిగింది. ఎలాంటి అనుమ‌తుల్లేకుండా కొన‌సాగుతున్న వెంచ‌ర్‌పై అధికారులు చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇందులో అధికార పార్టీ నేత‌ల భాగ‌స్వామ్యం ఉండ‌టంతోనే అధికారులు స‌హ‌క‌రిస్తున్నట్లుగా తెలుస్తోంది. పొలిటిక‌ల్ రియ‌ల్టర్లతో కాక‌తీయ అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీలోని క్షేత్రస్థాయి అధికారులు మిలాఖ‌త్ అయిన‌ట్లుగా అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఇక రెవెన్యూ అధికారుల‌కు క‌ళ్ల ముందే క‌న‌బ‌డుతున్నా క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం విశేషం. నిబంధ‌న‌లు సామాన్యుల‌కేనా..? పొలిటిక‌ల్ రియ‌ల్టర్లకు వ‌ర్తించ‌వా..? అంటూ కుడా అధికారుల తీరుపై విమ‌ర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. ఇప్పటికైనా కుడా అధికారులు అక్రమ వెంచ‌ర్‌పై చ‌ర్యలు చేప‌డుతారో లేదో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed