New Ration Cards:కొత్త రేషన్‌ కార్డుల కోసం తప్పని ఎదురుచూపులు!

by Jakkula Mamatha |
New Ration Cards:కొత్త రేషన్‌ కార్డుల కోసం తప్పని ఎదురుచూపులు!
X

దిశ,నర్సంపేట:నూతన రేషన్ కార్డుల జారీపై ఉత్కంఠ నెలకొంది. గడచిన పదేళ్లుగా నిరుపేదలు ఏ పథకానికి నోచుకోలేదు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన ప్రతి దానికి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడంతో ప్రజలు పలు పథకాలకు అర్హత సాధించలేకపోయారు. దీంతో కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డు లేకపోవడం నిరుపేద కుటుంబాలకు శాపంగా మారింది. గత ప్రభుత్వం కొత్త కార్డులు అందించకపోగా కార్డుల్లో చేర్పులు, మార్పులకు కూడా నోచుకోని పరిస్థితి. దాదాపు ఆరేళ్లుగా రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అనేక మంది పేదలు సర్కారు సాయానికి ఏళ్లుగా దూరం అవుతూనే ఉన్నారు. గత ప్రభుత్వానికి రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. తాజాగా అధికారంలోని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీకి సిద్ధమైంది.

అన్నింటికి అదే ప్రామాణికం..!

పేదలకు చౌక ధరలకు సరుకులు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో రేషన్ కార్డుదారులు లబ్ధి పొందుతున్నారు. ఇదే నిబంధన అన్ని పథకాలకు ప్రామాణికంగా మారింది. ప్రజా పంపిణీ బియ్యం కావాలన్నా , పింఛన్ కావాలన్నా, రుణ మాఫీ జరగాలన్నా, ఇందిరమ్మ ఇండ్లకు సైతం రేషన్ కార్డు ఉండాల్సిందే. ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలకు రేషన్ కార్డు దారులే అర్హులు. పదేళ్లుగా రేషన్ కార్డుల జారీ లేకపోవడంతో పేద ప్రజలు అనేక పథకాలకు దూరం అయ్యారు. తాజాగా మంత్రివర్గ ఉప సంఘం తీసుకున్న నిర్ణయంతో పేదల నిరీక్షణకు తెర పడినట్లు అయింది. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల రేష‌న్ కార్డులు క‌లిపి 11.14 లక్షల కార్డులు ఉన్నాయి.

జాప్యంతో ప‌థ‌కాల ల‌బ్ధికి దూరం..

కొన్నేళ్లుగా కొత్త కార్డుల జారీ నిలిచిపోగా ఉన్న కార్డుల్లో మార్పులకు అవకాశం లేకుండా పోయింది. అయినా మీసేవాలో సభ్యులను జత చేసేలా ఆన్​లైన్​లో వెసులుబాటును గడచిన పదేళ్లలో ఐదారుసార్లు కల్పించారు. కొత్త కార్డు వస్తుందన్న ఆశతో ఉమ్మడి కుటుంబంలోని తమ కార్డు నుంచి పేర్లను తొలగించారు కొందరు. మరికొందరు కొత్తగా పెళ్లికావడంతో అత్తింట్లో పేరును జత చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. పేరు తొలగించుకున్న వారికి అటు పుట్టింట్లో బియ్యం రాక, కొత్త కార్డులో పేరు నమోదు కాక నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోపక్క ఎదిగిన పిల్లలకు స్కాలర్ షిప్ ల విషయంలో, ఆస్పత్రులకు వెళ్లే విషయంలో సమస్య ఎదురవుతోంది. ఆరోగ్యశ్రీ పథకానికి ప్రస్తుతం ఆధార్ కార్డును ప్రామాణికం చేసినప్పటికీ మొన్నటి వరకు కేవలం రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాల అమలుకు ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో కొత్త కార్డులు ఎప్పుడిస్తారని యువ జంటలు ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సైతం ఆమోదం తెలపడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పౌరసరఫరా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కొత్త రేషన్‌ కార్డుల ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు చెప్పడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. మళ్లీ కొత్త రేషన్‌ కార్డులు ఎప్పుడు జారీ చేస్తారోనని ఎదురు చూపులు మొదలయ్యాయి.

2016 లో దరఖాస్తు చేసిన ..

భార్య, పిల్లల పేర్లు నమోదు కోసం 2016 లో దరఖాస్తు చేసిన. ఇప్పటివరకు రాలే. పిల్లల చదువులకు ఇబ్బంది ఎదురవుతుంది. మొన్నటి వరకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స కోసమని ఆసుపత్రికి వెళ్తే రేషన్ కార్డు లేక అప్పు చేసి చికిత్స చేసుకోవాల్సి వచ్చింది. పోలోజు లక్ష్మణాచారి, చలపర్తి గ్రామం, దుగ్గొండి మండలం

ప‌థ‌కాల‌కు దూర‌మ‌వుతున్నా..

నర్సంపేటలో కిరాయి ఇంట్లో ఉంటున్న సెపరేట్ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న పలుమార్లు మీసేవ చుట్టూ తిరిగిన లాభం లేకుండా పోయింది. రేషన్ కార్డు లేకపోవడంతో గృహ జ్యోతి పథకంలో జీరో బిల్లు రావడం లేదు. గ్యాస్ సిలిండర్ బిల్లు కూడా రావట్లేదు. ప్రభుత్వ పథకాల లబ్ధి అందడం లేదు.

Advertisement

Next Story