కంచనపల్లి పీఎసీఎస్‌లో రూ.25 ల‌క్ష‌ల స్కాం

by Javid Pasha |   ( Updated:2023-03-10 14:55:53.0  )
కంచనపల్లి పీఎసీఎస్‌లో రూ.25 ల‌క్ష‌ల స్కాం
X

దిశ, జనగామ : రైతు సంక్షేమం కోసం ఏర్పాటైన సహకార బ్యాంకులో భారీ అవినీతి జ‌రిగింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రూ.25 లక్షల పైగా రైతుల సొమ్ము ఇష్టారాజ్యంగా డ్రా చేసి సొంతానికి వాడుకున్న‌ట్లుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. లెక్క పత్రం లేకుండా డీసీసీ బ్యాంకు నుంచి చెక్కుల ద్వారా ఏకంగా రూ.25 లక్షలకు పైగా డ్రా చేసి మింగేశారు. జిల్లా అధికారుల అలసత్వం, బ్యాంకు డైరెక్టర్ల నిర్లక్ష్యం మూలంగా రైతులకు చెందాల్సిన నగదు మాయమైంది.

ఇంత జరిగినా సంబంధిత అధికార యంత్రాంగం ఏమి పట్టనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా బ్యాంకు డైరెక్టర్లు సైతం క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కాకపోవడం మూలంగానే ఈ అవినీతి చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. కంచనపల్లి సహకార సంఘంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై జాఫర గూడెం గ్రామానికి చెందిన గుగులోతు కొమురెల్లి సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించగా, ఇష్టారాజంగా బ్యాంకు నుండి డబ్బులు డ్రా అయినట్లు బయటపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు డైరెక్టర్లు ఆందోళనకు దిగడంతో అవినీతి బట్టబయలైంది.

అస‌లేం జ‌రిగిందంటే..?

కంచనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో బ్యాంకు చైర్మన్ తో పాటు మొత్తం 13 మంది డైరెక్టర్లు, ఒక కార్యదర్శి, ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులు ఉన్నారు. అయితే మూడేళ్లుగా ఈ బ్యాంకులో ఆడిట్ కరువైంది. జిల్లా ఉన్నతాధికారుల ఉదాసీన‌త వైఖరి కూడా ఇందుకు కారణమ‌నే చెప్పాలి. ప్రతి ఏటా ఈ సహకార బ్యాంకు పరిధిలో ఆరు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు సంవత్సరాలుగా ప్రతి యేటా సంవత్సరానికి రెండు సార్లు కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన సొమ్ముకు సంబంధించిన పైకాన్ని ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేయకుండా. జిల్లా డీసీవో ఖాతాలో జమ చేస్తూ వ‌స్తోంది. ఇలా జమ చేసిన మొత్తాన్ని ఆయా బ్యాంకులకు డీసీవో కేటాయిస్తారు. ఇలా మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి వచ్చిన మొత్తం నగదును రైతులకు చెల్లించలేదు.

బ్యాంకుకు కమిషన్ రూపంలో ఇప్పటివరకు రూ.1.10 కోట్లు వ‌చ్చాయి. ఇలా వచ్చిన క‌మీష‌న్ సొమ్ములో రూ.53 లక్షలు వేతనాలు, సహకార స్థలం ప్రహరీ ప్రాంగణ నిర్మాణం, భూమి రిజిస్ట్రేషన్ ఇతరత్రా ఖర్చుల కోసం కేటాయించినట్లు సీఈవో శ్రీనివాస్ లెక్కలు చూపుతున్నాడు. కానీ, అసలు తిరకాసు అంతా ఇక్కడ ఉంది. అయితే, రూ.1.10 కోట్ల నగదు బ్యాంకు ఖాతాలో జమ కాగా, రూ. 80 లక్షల పైగా డ్రా చేసినట్లు తెలుస్తోంది. పది రోజుల క్రితం జరిగిన సమావేశంలో సీఈవో చూపిన లెక్కలను పరిశీలిస్తే రూ. 53లక్షలకు మించడం లేదు. మరి డ్రా చేసిన సొమ్మంతా ఎటు వెళ్లినట్లు? ఇప్పటివరకు అసలు ఎంత డ్రా చేశారు? మిగతా నగదు ఎక్కడ పోయిందో? ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో బ్యాంకు డైరెక్టర్లు చైర్మన్,కార్యదర్శుల్లో స్పష్టత లేదు. ఇంతకీ ఖాతాలో జమైన సొమ్ము ఎటు వెళ్లినట్లు వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

నగదు విత్‌డ్రా ఇలా..!

సహకార బ్యాంకులో జమైన సొమ్మును విడిపించాలంటే బ్యాంకు చైర్మన్, సీఈవో ఇద్దరి కో సిగ్నేచర్ అవసరం ఉంటుంది. అది కూడా చెక్కు రూపంలో మాత్రమే తీసే వీలుంటుంది. అలాంటప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కార్యదర్శి చైర్మన్లు ఇద్దరు కలిసి అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు అయిత జయరాములు సహా ఏడుగురు వారం రోజుల క్రితం బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. చైర్మన్ చీమలపాటి రవీందర్, కార్యదర్శి వంగ శ్రీనివాస్ ల ప్రమేయం లేకుండా బ్యాంకులో చిల్లిగవ్వ తీసే అవకాశం లేదని మండిపడ్డారు. బ్యాంకు నుండి విత్డ్రా చేసిన సొమ్ము ఎటు వెళ్లిందో చెప్పాలంటూ అంటూ కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లు, నాయకులు పట్టుపట్టారు.

చైర్మన్, సీఈవోల‌పై తీరుపై అనుమానాలు

బ్యాంకు చైర్మన్ రవీందర్, సీఈవో శ్రీనివాసుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరి కో సిగ్నేచర్ తో మాత్రమే డబ్బులు విడిపించే అవకాశం ఉన్నప్పటికీ. కాకుండా డబ్బులు బ్యాంకు నుండి డ్రా అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులో నుంచి నేరుగా నగదును చైర్మన్ విడిపించాడా? సీఈవో విడిపించాడా? అనే కోణంలో అధికారులు విచారణ చేపడితే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. అలా కాకుండా జిల్లా ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో సీరియస్ గా తీసుకోకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.

జిల్లా ఉన్నతాధికారుల ప్రమేయం మేరకే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా అయ్యాయా? అసలు డబ్బులు డ్రా చేసింది ఎవరు? అనే కోణంలో ఇప్పటివరకు కూడా అధికారులు విచారణ చేపట్టక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో డీసీసీ బ్యాంక్ ఉన్నతాధికారులు, చైర్మన్, సీఈఓల తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కంచనపల్లి సహకార బ్యాంకులో రూ. 50 లక్షలకు పైగా అవినీతి చోటుచేసుకుందని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య కు కాంగ్రెస్ పార్టీకి చెందిన గొంగళ్ళ పృద్వి ఫిర్యాదు చేశాడు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు.

స్పందించని సీఈవో

కంచనపల్లి సహకార సంఘంలో జరిగిన అవినీతిపై సీఈవో శ్రీనివాసును దిశ ప్రతినిధి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. అయితే, బ్యాంకులో ఏ లావాదేవీల కైనా తానే బాధ్యుడిని, ఇటీవల జరిగిన డైరెక్టర్ల సమావేశంలో కార్యదర్శి చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయనకు తెలిసే ఇదంతా జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నా సంతకం ఫోర్జర్ చేశారు : కంచనపల్లి సహకార సంఘం చైర్మన్ చీమలపాటి రవీందర్

నా సంతకం ఫోర్జర్ చేశారు. బ్యాంకులో నుంచి నా ప్రమేయం లేకుండానే డబ్బులు డ్రా అయ్యాయి. సీఈవో తీరుపై అనుమానాలు ఉన్నాయి. దీనికి పూర్తి బాధ్యత కార్యదర్శిదే. నా సంతకాన్ని సీఈవో ఫోర్జర్ చేశాడని,10 రోజుల క్రితం డీసీవో కిరణ్ కుమార్ కు కూడా ఫిర్యాదు చేశాను. అంతేకాదు పోలీస్ స్టేషన్లో కూడా సీఈఓ తీరుపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

విచారణ చేపడతాం : డీసీఓ కిరణ్ కుమార్

కంచనపల్లి సహకార సంఘంలో జరిగిన రూ.25 లక్షల అవినీతి, అక్రమాలపై డి.సి.ఓ కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం దిశ ప్రతినిధి ఆయనను కంచనపల్లి సహకార సంఘంలో జరిగిన అవినీతిపై సంప్రదించగా నాలుగు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. దీనిపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 11న ( శనివారం) కంచనపల్లి బ్యాంకులో విచారణ చేపట్టనున్నట్లు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed