ఉపాధ్యాయుల బదిలీల్లో అనధికార రేషనలైజేషన్ ను ఆపండి : టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి

by Sumithra |
ఉపాధ్యాయుల బదిలీల్లో అనధికార రేషనలైజేషన్ ను ఆపండి : టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
X

దిశ, కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల మూతబడనీయమని, మూసేసిన వాటిని కూడా తెరిపిస్తామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు భిన్నంగా రాష్ట్ర విద్యాశాఖాధికారులు వ్యవరిస్తున్నారని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్జీటీ బదిలీల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో చాలా పాఠశాలల్లో ఖాళీలు చూపించడం లేదని, దీనికంటే ముందు జరిపిన పదోన్నతుల్లో కూడా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో పోస్టులను నింపలేదని, ఈ విధంగా ప్రభుత్వం దొంగచాటుగా రేషనలైజేషన్ కు పాల్పడటంతో గత 13 ఏళ్ల నుంచి ఎదురుచూసిన ఉపాధ్యాయులకు మళ్ళీ నిరాశే ఎదురవుతోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కమిషనర్ వివరణ..

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వివరణ ప్రకారం ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో తక్కువ మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, దీని వల్ల నాణ్యత ప్రమాణాలు తగ్గుతున్నాయని దీన్ని సరిచేయడం కోసం గతంలో జీవో నెంబర్ 17, తేదీ 27.6.2015, జీవో నెంబర్ 25 తేదీ 12.08.2021 ప్రకారం, సున్నా నుంచి పదిమంది వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు, 20 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను 60 నుంచి 90 వరకు ఉన్న పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులను ఉండే విధంగా ఆదేశాలు ఇచ్చారని, పాఠశాలకు విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఆదేశాలు విడుదల చేశారు.

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ప్రమాణాలు ఎంతవరకు సాధ్యం : ఉపాధ్యాయ సంఘాలు

రాష్ట్రస్థాయి విద్యాధికారులు ఇస్తున్న వివరణ ఏకోపాధ్యాయ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతోందని, అయితే ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధన చేసి విద్యార్థుల నుంచి అనుకున్న స్థాయిలో విద్యా ప్రమాణాలు సాధించడం కష్టమని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ప్రతి గ్రామానికి ప్రభుత్వ పాఠశాల ఉండాలి అని, మూతపడిన పాఠశాలలను తెరిపిస్తామని సీఎం ప్రకటిస్తే రాష్ట్ర విద్యాశాఖధికారులు మాత్రం దీనికి భిన్నంగా "పిల్లలు ఉంటేనే ఉపాధ్యాయులంటున్నారు.

అసలు ఉపాధ్యాయులు లేకుండా పిల్లలు ఎలా వస్తారన్నారు. గ్రామీణ ప్రాంతం పేద విద్యార్థులకు విద్యను దూరం చేసినట్లేనని, ఇది పురోగమనమా తిరోగమనమా అసలు తల్లితండ్రులకు విశ్వాసం కలిగించేలా పాఠశాలలను తయారు చేసినప్పుడు మాత్రమే పాఠశాలలకు పంపిస్తారన్నారు. రాష్ట్ర విద్యాశాఖాధికారుల విధానం వలన ఉన్న పాఠశాలలను మూత పడవేసి పరోక్షంగా ప్రయివేటు పాఠశాలలను ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతొందన్నారు. వెబ్ ఆప్షన్ ప్రక్రియ అర్ధరాత్రి విడుదల చేయడంతో ఆదివారం సెలవు దినం కావడంతో నెట్ సెంటర్లు అందుబాటులో ఉండని కారణంగా బదిలీల వెబ్ ఆప్షన్ ప్రక్రియను మరొక్క 24 గంటలు పొడిగించాలని కూడా డిమాండ్ చేస్తున్నామని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ అన్నారు.

Next Story

Most Viewed