పదవికి రాజీనామా చేస్తున్నా: మరిపెడ పీఏసీఎస్ వైస్ చైర్మన్ గండి మహేష్ గౌడ్

by Kalyani |
పదవికి రాజీనామా చేస్తున్నా: మరిపెడ పీఏసీఎస్ వైస్ చైర్మన్ గండి మహేష్ గౌడ్
X

దిశ, మరిపెడ: డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ పురపాలక కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ప్రొటోకాల్ వివాదం కలకలం రేపుతుంది. తనను వేదిక పైకి ఆహ్వానించలేదని మరిపెడ పీఏసీఎస్ వైస్ చైర్మన్ గండి మహేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పదవిలో ఉన్న నాయకులను వేదిక మీదికి పిలిచి తనను అగౌరపరిచారని ఆయన వాపోయారు. ఇటీవల కేసముద్రం వ్యవసాయ మార్కెట్ నూతన కార్యవర్గ నియామకం కార్యక్రమంలో తన అభిమాన ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడాన్ని గమనించి అక్కడే బైఠాయించి నిరసన తెలిపిన తనకు, నేడు ఎమ్మెల్యే రెడ్యానాయక్ సమక్షంలోనే అగౌరవం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏనాడు పదవుల కోసం లాలూచీ పడలేదని ఆత్మగౌరవంతో బతికానన్నారు. సర్పంచులను, ఎంపీటీసీలను గెలిపించుకున్నప్పటికీ రెడ్యానాయక్ పై అభిమానంతో టీడీపీ పార్టీ వదిలి రెడ్యానాయక్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నానని తెలిపారు. అనేక సందర్భాల్లో తనకు అవమానం జరిగిందని ఆవేదన చెందాడు. మంత్రి సత్యవతి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినందుకు ఇలా అవమానిస్తున్నారని ఆరోపించారు. ఆత్మగౌరవం లేనిచోట పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అన్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆ కేసు ఇంకా కొట్టేయలే..

తాను ఎప్పుడు రెడ్యానాయక్ అభిమానిగానే ఉన్నానని, ఒక సందర్భంలో ప్రస్తుత శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కారు అద్దాలు పగలగొట్టి ఆమెని ఘోరావ్ చేశామని ఆ కేసు ఇంకా నన్ను వెంటాడుతుందని, మరిపెడ మండలంలోని తన సొంత గ్రామం ఎల్లంపేటలో ప్రస్తుత సర్పంచ్ అవినీతికి పాల్పడుతున్నాడంటూ సమాచార హక్కు చట్టం ద్వారా జరిగిన అవినీతిని వెలికి తీస్తే తన పైన దాడి చేసి అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నేటి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మా మధ్య ఏ విభేదాలు, గొడవలు లేవన్నారు. కానీ తన మన అనే భేదాన్ని కొందరు పాటిస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed