రాజయ్య vs కడియం శ్రీహరి.. స్టేషన్‌ఘన్‌పూర్‌‌లో పొలిటికల్ హీట్

by Mahesh |   ( Updated:2023-07-10 03:31:28.0  )
రాజయ్య vs కడియం శ్రీహరి.. స్టేషన్‌ఘన్‌పూర్‌‌లో పొలిటికల్ హీట్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రాజ‌కీయాల‌పై ఎదిగిన ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులైన క‌డియం, రాజ‌య్య‌ మ‌ధ్య డైలాగ్ వార్ తార స్థాయికి చేరుకుంది. ఇన్నాళ్లు ప‌రోక్షంగా ప్రచ్చన్నయుద్ధం సాగించిన నేత‌లు.. ఇప్పుడు ప్రత్యక్షంగా పేర్లు పెట్టి మ‌రీ ప‌ర‌స్పరం మాట‌ల‌ దాడి ఆరంభించుకున్నారు. ఎమ్మెల్సీ క‌డియం శ్రీహ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటిస్తూ క్యాడ‌ర్‌ను స‌మాయ‌త్తం చేసుకోవ‌డంపై రాజ‌య్య అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దీనికి తోడు కొద్దిరోజులుగా నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి, అక్రమాలు బాగా పెరిగిపోయాయంటూ, దీన్ని పెంచి పోషిస్తున్న వారికి ప్రజ‌ల నుంచి చీత్కరాలు త‌ప్పవంటూ కూడా ప‌రోక్షంగా రాజ‌య్య, ఆయ‌న వ‌ర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని క‌డియం మాట్లాడుతున్నారు.

స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కార్యక్రమాల‌ను ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా పాల్గొంటూ వ‌స్తున్నారు. ఆయ‌న వ‌ర్గం స‌ర్పంచులుగా, ఎంపీటీసీలుగా ఉన్న వారితో నిత్యం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు కార్యక్రమాల్లో పాల్గొంటూ మ‌మేక‌మ‌వుతూ వ‌స్తున్నారు. అయితే నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేనే బాస్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాకా కూడా ఇలా పొలిటిక‌ల్‌గా క‌డియం చిచ్చు పెట్టే ప్రయ‌త్నం చేస్తున్నార‌న్నది రాజ‌య్య వ‌ర్గీయుల ప్రధాన వాద‌న‌. ఎమ్మెల్యేను టార్గెట్‌గా చేసుకుని ఇష్టారీతిన కామెంట్లు చేస్తూ క్యాడ‌ర్‌ను గంద‌ర‌గోళంలో ప‌డేసే ప్రయ‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డుతున్నారు.

క‌డియం స్పీడ్.. గేర్ మార్చిన రాజ‌య్య

ఈసారి ఎలాగైనా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ టికెట్‌ను ద‌క్కించుకునేందుకు ఎమ్మెల్సీ క‌డియం శ్రీహ‌రి విశ్వ ప్రయ‌త్నం చేస్తున్నారంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది. అందుకు అనుగుణంగానే ఆయ‌న ప్రతీ మండ‌లంలో క్యాడ‌ర్‌ను స‌మాయ‌త్తం చేసుకుంటున్నారు. నిత్యం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటిస్తూ రాజ‌య్యపై అసంతృప్తితో ఉన్న నేత‌ల‌తో క‌లిసి మాట్లాడుతున్నట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే ఆత్మీయ ప‌ల‌క‌రింపులు, నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై చ‌ర్చ పేరుతో నేత‌ల‌ను క‌లుస్తూ వారిని ఆయ‌న వైపు తిప్పుకుంటున్నట్లుగా రాజ‌య్య వ‌ర్గం నేత‌లు ఆరోపిస్తున్నారు. పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్న వారిని, పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌వాళ్లంద‌రిని క‌డియం చేర‌దీయ‌డ‌మేంట‌న్న ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. రాజ‌య్య‌కు ఇబ్బందిక‌ర‌మైన రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను క‌ల్పించే కుట్ర జ‌రుగుతోంద‌ని బ‌లంగా వాదిస్తున్నారు.

అదే స‌మ‌యంలో రాజ‌య్యపై అవినీతి ఆరోప‌ణ‌లతోపాటు వ్యక్తిగ‌త విష‌యాల్లో తీవ్రమైన వివాదాలు, విమ‌ర్శల్లో నానుతుండ‌డంతో ఈసారి క‌డియంకే టికెట్ వ‌స్తుంద‌న్న ధీమాను ఆయ‌న అనుచ‌రులు గ్రౌండ్‌లో చెప్పుకుంటున్నారు. టికెట్ వ‌చ్చేది గెలిచేది క‌డియమేనంటూ హ‌ల్ చల్ చేస్తుండ‌డంతో రాజ‌య్య వ‌ర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే క‌డియంను ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యే రాజ‌య్య పొలిటిక‌ల్ గేర్ మార్చిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా రెండు రోజులుగా ఆయ‌న క‌డియంపై చేస్తున్న వ్యక్తిగ‌త దాడి ఈకోవ‌లోకే వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. క‌డియం దేవాదుల సృష్టిక‌ర్త కాదు.. ఎన్‌కౌంట‌ర్ల సృష్టిక‌ర్త అంటూ శ‌నివారం ఓ కార్యక్రమంలో సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. మ‌రుస‌టి రోజు ఆదివారం కూడా జ‌ఫ‌ర్‌గ‌డ్ మండ‌లం హిమ్మత్‌న‌గ‌ర్‌లో మాట‌ల దాడిని కొన‌సాగిస్తూ క‌డియం అవినీతి తిమింగ‌లం అంటూ విమ‌ర్శల దాడిని పెంచ‌డం విశేషం.

వేడెక్కిన రాజ‌కీయం...

ఎమ్మెల్యే రాజ‌య్య, ఎమ్మెల్సీ క‌డియం మ‌ధ్య జ‌రుగుతున్న రాజ‌కీయ వైరంతో స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రాజ‌కీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ నేత‌లు రెండు వ‌ర్గాలుగా చీలిపోయి సోష‌ల్ మీడియాలో వాగ్వాదానికి దిగుతున్నారు. టికెట్ మ‌ళ్లీ రాజ‌య్యకే అంటూ ఆయ‌న వ‌ర్గీయులు చెప్పుకుంటుండ‌గా, అంత సీన్ లేదు క‌డియంకే టికెట్ వ‌స్తుదంటూ ఆయ‌న అనుచ‌రులు కొట్టిపారేస్తుండ‌డం విశేషం. మ‌రి రాజ‌కీయ అంత‌ర్గత పోరును అధిష్ఠానం ఇద్దరు నేత‌ల‌కే వ‌దిలేస్తుందా..? చ‌ల్లర్చే ప‌ని ఏమైనా చేస్తుందా అన్నది వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed