- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓరుగల్లులో గుట్టలు గుట్టలుగా గంజాయి..!
దిశ, వరంగల్ బ్యూరో: గమ్మత్తులో ఓరుగల్లు యువత తేలియాడుతోంది. గంజాయి సేవనానికి అలవాటుపడిన అనేకమంది యువకులు జల్సాలకు నేరపూరిత చర్యలకు వెనకాడటం లేదు. ఈజీ మనీ వేట వైపు అడుగులు వేస్తున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాల్లోని వందలాది కాలనీలతో పాటు నగర శివారుల్లోని గ్రామాల్లోనూ విచ్చల విడిగా గంజాయి సేవనం జరుగుతోంది. గంజాయి సేవనం ఇప్పుడు సర్వసాధారణమైపోయిందన్న అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. సాయంత్రం వేళల్లో ములుగు రోడ్డు జంక్షన్, పెద్దమ్మగడ్డ, యాదవనగర్ ఏరియా, హనుమాన్ జంక్షన్, ఆరెపల్లి , పైడపల్లి, కేయూ క్రాస్ రోడ్స్, పెగడపల్లి, వంగపహాడ్, ప్రతిమ హాస్పిటల్ జంక్షన్ రింగ్ రోడ్డు, కాజీపేట సోమిడి, ఉర్సుగుట్ట, దూపకుంట, ఎనుమాముల మార్కెట్ ఏరియా, భట్టుపల్లి, కడిపికొండ, హైదరాబాద్ రూట్‌లో జాతీయ రహదారిపై ఉన్న మడికొండ నుంచి రాంపూర్ వరకు కూడా రాత్రివేళల్లో విచ్చలవిడిగా గంజాయి సేవనం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా డెన్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. సిగరెట్ చుట్టల్లోని పొగాకును తొలగించి ఎండు గంజాయి ఆకును నింపి సేవిస్తున్నారు. గంజాయి లభ్యత లేని సమయాల్లో వైట్‌నార్, ఫర్నీచర్ వార్నిష్‌ను సైతం కొంతమంది వాడుతుండటం గమనార్హం. దీంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కోరి తెచ్చుకుంటున్నారు.
క్రైంలో చిక్కుకుంటున్న యువత..!
నగరంలో జరుగుతున్న అనేక నేరాల్లో యువత పాత్ర కనిపిస్తోంది.ఇటీవల ఉర్సు గుట్టు ప్రాంతంలో ఓ వ్యక్తిపై ఇద్దరు కలిసి విచక్షణారహితంగా దాడి చేశారు. చూసి ఉమ్మాలని అన్నందుకు ఓ వ్యక్తి సదరు యువకుడిని కర్రలతో తీవ్రంగా కొట్టాడు. డాన్ కావాలనే లక్ష్యంతోనే ఈ దాడులకు పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడి కావడం గమనార్హం. గంజాయి కొనుగోలు, తాగుడు, జల్సాలకు గంజాయి సేవనం చేసే గ్యాంగులు ఎంతటికైనా తెగిస్తున్నాయి. బెదిరింపులకు, దొంగతనాలకు పాల్పడటమే కాకుండా.. అసాంఘిక శక్తులకు ఆయుధంగా మారుతున్నారు.
గుట్టలుగా పట్టుబడుతున్న ఆగని రవాణా..!
గంజాయి రవాణాతో పాటు సరఫరాదారులపై కఠిన చర్యలు చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన సరకు పట్టుబడుతోంది. కొద్ది రోజుల క్రితం హనుమకొండలో దాదాపు రూ.85 లక్షల విలువైన 338 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగాన ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారు.ఉమ్మడి వరంగల్‌లో గతేడాది రూ.4.14 కోట్ల విలువైన 20 క్వింటాళ్ల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని 103 కేసులు నమోదు చేశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.4.12 కోట్ల విలువైన 13 క్వింటాళ్ల గంజాయిని పట్టుకుని 157 కేసులు నమోదు చేశారు. అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్, మహబూబాబాద్ జిల్లాల్లోనే కేసులు నమోదయ్యాయి. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి రోడ్డు, రైలు మార్గంలో పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారు. పోలీసులు తనిఖీలు విస్తృతం కావడంతో అక్రమార్కులు ఏదో రూపంలో యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకి కొనుగోలు చేసి అనామకులతో రవాణా చేయిస్తూ బడా స్మగ్మర్లు కాసులు గడిస్తున్నారు.