ఆ టీచర్లకు నో టైమింగ్స్..! హైస్కూల్ ఉపాధ్యాయుల అప్ అండ్ డౌన్

by Shiva |
ఆ టీచర్లకు నో టైమింగ్స్..! హైస్కూల్ ఉపాధ్యాయుల అప్ అండ్ డౌన్
X

దిశ, మంగపేట: మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులు పని దినాల్లో హన్మకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వంటి ప్రాంతాల నుంచి వెళ్లి వస్తూ.. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. మండలంలోని మంగపేట, కమలాపురం, తిమ్మంపేట, మల్లూరు, నర్సింహాసాగర్, రాజుపేట జడ్పీ పాఠశాలతో పాటు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన కొందరు ఉపాధ్యాయులు పాఠశాల పని దినాల్లో అప్ అండ్ డౌన్ చేయడంతో విద్యార్థులకు సిలబస్ పూర్తికాక ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెల వరకు జరగాల్సిన నిర్మాణాత్మక మూల్యాంకనం (ఫార్మెటివ్ అసెస్‌మెంట్) 1వ, 2వ దశ పరీక్షలు సైతం పూర్తికాక ఆందోళన చెందుతున్నారు.

25 నుంచి 30 మంది అప్ అండ్ డౌన్..

మండలంలోని 6 జిల్లా పరిషత్ పాఠశాలల్లో సుమారు 75 మంది వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానికంగా ఉంటూ పాఠశాలలకు ఉదయం 9 గంటలకు హాజరై సాయంత్రం 4.15 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంది. అందుకు గాను ప్రభుత్వం ఆయా ఉపాధ్యాయులకు ఏజెన్సీ అలవెన్స్ కింద బేసిక్ సాలరీని బట్టి ఒక్కో ఉపాధ్యాయుడికి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తుంది. ఏజెన్సీ అలవెన్స్ పొందుతున్న ఉపాధ్యాయులు పాఠశాల పని దినాల్లో నిబంధనలు తుంగలో తొక్కి ఆర్టీసీ బస్, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలు చేస్తుండడంతో విద్యార్థుల సిలబస్ పూర్తి కావడం లేదు. అప్ అండ్​డౌన్ చేస్తున్న ఉపాధ్యాయులు ఉదయం 10 గంటలకు పాఠశాలకు వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.

ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్..

ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీంతో మహిళా ఉపాధ్యాయులు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం ఎదురుచూస్తూ విధులకు ఆలస్యంగా హాజరవుతున్నట్లు ఆరోపణలున్నాయి. అదే సమయంలో ఉపాధ్యాయులు సైతం హన్మకొండ, ములుగు, మణుగూరు ప్రాంతాల నుంచి ప్రైవేటు కార్లను కిరాయిలు తీసుకుని విధులకు హాజరవుతున్నారు. ముఖ్యంగా కమలాపురం, మంగపేట, మల్లూరు, తిమ్మంపేట, రాజుపేట జెడ్పీ స్కూళ్ల నుంచి పనిచేస్తున్న ఉపాధ్యాయులు అప్​అండ్​డౌన్​చేస్తున్నారు. బోధన పట్ల ఆసక్తి చూపకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారనే ఆరోపణలున్నాయి.

కాంప్లెక్స్ హెచ్ఎంలు, హెచ్ఎంలు దృష్టి సారించాలి..

అప్ అండ్ డౌన్ ఉపాధ్యాయుల పనితీరుపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దృష్టి సారించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు తమ సిలబస్ ఎంత వరకు పూర్తి చేశారో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

సంఘాల నాయకుల మద్దతు..

అప్ అండ్ డౌన్ ఉపాధ్యాయులకు ఆయా సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. ఈ విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసి వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్న తరుణంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు అధికారులపై ఒత్తిడి తేవడంతో వారికి మద్దతు పలుకున్నట్లు సమాచారం. విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకుంటున్న ఉపాధ్యాయులకు సంఘాల నాయకులు వంతపాడడం ఏంటని తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్ అండ్ డౌన్ ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ప్రతినెలా ట్రీట్ ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అప్అండ్ డౌన్ ప్రయాణాలు నిజమే: ఫణి, డీఈవో, ములుగు

మండలంలోని మెజార్టీ ఉపాధ్యాయులు అప్ అండ్ డౌన్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఈ విషయమై చాలా సార్లు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, హెచ్​ఎంలు మౌఖిక ఆదేశాలిచ్చాం. ములుగు వెలుగు యాప్ తీసేసిన తర్వాత ఉపాధ్యాయులు విధులకు తరుచూ గైర్హాజరవుతుట్లు నా దృష్టికి వచ్చింది. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ములుగు వెలుగు తరహా యాప్ తెచ్చి విద్యాశాఖలో సమూల మార్పులు తెస్తాం.

Advertisement

Next Story

Most Viewed