Destruction : గుట్ట‌లు గుల్ల‌.. అనుమతులకు మించి తవ్వకాలు.. నేలకొరుగుతున్న వేలాది చెట్లు

by Aamani |
Destruction : గుట్ట‌లు గుల్ల‌.. అనుమతులకు మించి తవ్వకాలు.. నేలకొరుగుతున్న వేలాది చెట్లు
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : అనుమ‌తుల మాటున కొండ‌ల‌ను కొల్ల‌గొడుతున్నారు. గుట్ట‌ల‌ను గుల్ల చేస్తున్నారు. ప్ర‌భుత్వ భూముల్లో విధ్వంసం జ‌రుగుతోంది. ఎన్నో ఏళ్లుగా అడ‌విలా అల్లుకున్న ప్ర‌భుత్వ భూముల్లో మ‌ట్టి, మొరం త‌వ్వ‌కాల‌కు రెవెన్యూ, మైనింగ్ అధికారులు నిబంధ‌న‌ల‌కు పాత‌రేస్తూ అనుమ‌తులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. వ‌న్య‌ప్రాణుల‌కు ఆవాసం లేకుండా చేయ‌డంతోపాటు అక్ర‌మంగా సాగుతున్న మొరం త‌వ్వ‌కాల‌కు కాంట్రాక్టు సంస్థ‌కు స‌హ‌క‌రిస్తున్నారు. శ్రీ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేటు లిమిటెడ్ కాంట్రాక్టు సంస్థ అనుమ‌తుల మాటునా ఇష్టారాజ్యంగా మొరం త‌వ్వ‌కాలు సాగిస్తోంది.

ఈ సంస్థ వ‌రంగ‌ల్ జిల్లా వెంక‌టాపురం నుంచి ఖ‌మ్మం జిల్లా వ‌ర‌కు హైవే నిర్మాణ ప‌నులను ద‌క్కించుకుంది. ఇప్ప‌టికే కొంతమేర ప‌నులు పూర్తి చేస్తూ వ‌స్తున్న స‌ద‌రు సంస్థ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోంది. చెరువుల్లో ఇష్టారాజ్యంగా మ‌ట్టి త‌వ్వ‌కాలు చేప‌ట్టి పెద్దఎత్తున అక్ర‌మాలకు పాల్ప‌డింది. ఈ విష‌యంపై దిశ వ‌రుస‌గా క‌థ‌నాలు ప్ర‌చురిస్తున్న విష‌యం పాఠ‌కుల‌కు విధిత‌మే. అయితే తాజాగా మైనింగ్ ప‌ర్మిష‌న్లు, త‌వ్వ‌కాలు జ‌రిగిన ప్రాంతాల‌ను దిశ క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించగా విస్త‌ుపోయే నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. మొరం త‌వ్వ‌కాల‌కు అనుమ‌తులు పొందిన స‌ద‌రు గుత్తేదారు సంస్థ‌ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అనుమ‌తులు గోరంత త‌వ్వ‌కాలు కొండంత అన్న చందంగా మారింది. గుట్ట‌ల‌ను గుల్ల చేస్తున్నా అధికారులు క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తున్నారే త‌ప్పా ఆపే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు.

ఈ ప్రాంతాల్లో అనుమ‌తులు..!

మ‌హ‌బూబాబాద్ మండ‌లంలోని మాధ‌వ‌పురం గ్రామ ప‌రిధిలోని స‌ర్వే నంబ‌ర్ 306/బీ/1/3ల‌లో 1.180హెక్టార్ల విస్తీర్ణంలో 14వేల మెట్రిక్ ట‌న్నుల మొరం త‌వ్వ‌కాల‌కు శ్రీ ఇన్ ఫాటెక్ కాంట్రాక్ట్ సంస్థ‌కు మైనింగ్ శాఖ ఏడీ అనుమ‌తి ఇచ్చింది. అలాగే ఇదే గ్రామంలో 307/ఏ/1/4, 303/A/3/5, 306/పీ స‌ర్వే నంబ‌ర్ల నుంచి 9.950హెక్టార్ల‌లో 15600 మెట్రిక్ ట‌న్నుల‌ మొరం త‌వ్వ‌కాల‌కు అనుమ‌తి ఇచ్చారు. కుర‌వి మండ‌లంలోని అయ్య‌గారిప‌ల్లి గ్రామ స‌ర్వే నంబ‌ర్ 231/పీలో 0.400హెక్టార్ల విస్తీర్ణంలో 12వేల మెట్రిక్ ట‌న్నులు ఇదే మండ‌లంలోని నేర‌డ గ్రామ స‌ర్వే నంబ‌ర్ 546/పీ, 548/పీలో 2.000 హెక్టార్ల విస్తీర్ణంలో 10వేల మెట్రిక్ ట‌న్నుల త‌వ్వ‌కాల‌కు అనుమ‌తిచ్చారు. నెల్లికుదురు మండ‌లంలోని వావిలాల గ్రామ రెవెన్యూ స‌ర్వే నంబ‌ర్ 283/పీలో 0.390 హెక్టార్ల విస్తీర్ణంలో 23400 మెట్రిక్ ట‌న్నులు, ఇదే మండ‌లంలోని న‌ర్సింహుల‌గూడెం గ్రామ రెవెన్యూ స‌ర్వే నంబ‌ర్‌ 172/1/పీలో 1.450హెక్టార్ల‌లో 20వేల మెట్రిక్ ట‌న్నుల త‌వ్వ‌కాల‌కు అనుమ‌తిచ్చారు. కేస‌ముద్రం మండ‌లంలోని క‌ల్వ‌ల గ్రామ రెవెన్యూ స‌ర్వే నంబ‌ర్ 610/1/పీలో 2.830 హెక్టార్ల విస్తీర్ణంలో 9వేల మెట్రిక్ ట‌న్నులు, ఇదే మండ‌లంలోని కోమ‌టిప‌ల్లి గ్రామ స‌ర్వే నంబ‌ర్ 311/పీలో 2.830హెక్టార్ల‌లో 22500 మెట్రిక్ ట‌న్నుల మొరం త‌వ్వ‌కాల‌కు మ‌హబూబాబాద్ మైనింగ్ ఏడీ వెంక‌టర‌మ‌ణ అనుమ‌తులు జారీ చేశారు.

ప‌దిరెట్లు అధికంగా త‌వ్వ‌కాలు..!

అనుమ‌తులకు ప‌దిరెట్లు మించిన తోల‌కాలు జ‌రుగుతున్నా ప‌ర్య‌వేక్షించాల్సిన మైనింగ్‌, రెవెన్యూ అధికారులు ప‌ట్ట‌న‌ట్లుగా ఉంటున్నారు. అనుమ‌తుల‌కు మించిన త‌వ్వ‌కాలు, సామ‌ర్థ్యానికి మించి వాహ‌నాల్లో ర‌వాణా వెరిసి అటు గుట్ట‌లు, కొండ‌లు క‌రిగిపోవ‌డంతో పాటు ఆయా గ్రామాల రోడ్లు చిద్ర‌మ‌వుతున్నాయి. డ‌బ్బు ఆశ జూపి మైనింగ్, రెవెన్యూ అధికారుల‌ను గుప్పిట ప‌ట్టిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. తాత్కాలిక అనుమతి ఇచ్చిన మైనింగ్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నిర్వాహకులు యథేచ్ఛగా గ్రావెల్‌ దందాకు పాల్పడుతున్నారు. అక్రమ గ్రావెల్‌ దందాను అరికట్టాల్సిన రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడం వెనుక పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిమితికి మించి టిప్పర్లకు నిండుగా గ్రావెల్‌ నింపి తరలిస్తుండడంతో ప్రధాన రహదారులు, గ్రామాల్లోని అంతర్గత రోడ్లు కూడా ధ్వంసమవుతున్నాయి. ఇదేమిటని ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడుతున్నారన్న భయంతో ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందడుగు వేయడం లేదు.

వ‌న్య‌ప్రాణులు చెల్లాచెదురు..

మైనింగ్ ప‌ర్మిష‌న్లు జారీ చేసిన ప్రాంతాలన్నీ కూడా కొండ‌లే కావ‌డంతో వన్య‌ ప్రాణులకు హాని క‌లుగుతోంది. ఆవాసాలుగా మార్చుకున్న అనేక చెట్లు నేల‌కూలుతున్నాయి. అడవి పందులు, కుందేళ్లు, కొండ చిలువలు, కనుసులు, దుప్పులు, నెమళ్లు, వివిధ జాతుల పక్షులతోపాటు, ఇతర వన్యప్రాణులు కొండల‌ను తవ్వే క్రమంలో కొన్ని బయట ప్రాంతాలకు పారిపోగా, మరికొన్ని వేట‌గాళ్ల‌కు చిక్కుతున్నాయి. ఇంత జరుగుతున్నా మట్టి, మొరం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తికూడా చూడడం లేదు. చెరువుల్లో మట్టి తవ్వకాలను అడ్డుకోవాల్సిన నీటిపారుదల శాఖాధికారులు, కొండల తవ్వకాలను అరికట్టాల్సిన మైనింగ్‌ అధికారులు నియంత్రించడం లేదు. అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సంబంధిత అధికారుల చేతులు తడుపుతుండడంతోనే మట్టి దొంగల అక్రమ రవాణాకు అధికారులు అండగా ఉంటున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed