డ్రైపోర్టుపై కేంద్రంలో కదలిక..? డోర్నకల్‌లో సాధ్యాసాధ్యాలపై ఫోకస్

by Shiva |
డ్రైపోర్టుపై కేంద్రంలో కదలిక..? డోర్నకల్‌లో సాధ్యాసాధ్యాలపై ఫోకస్
X

దిశ, డోర్నకల్: ఇతర దేశాల నుంచి ఎగుమతి, దిగుమతులకు వినియోగించే డ్రైపోర్టు ఏర్పాటుపై కేంద్రంలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన హామీలో పొందుపర్చిన విధంగా తెలంగాణకు డ్రైపోర్టు మంజూరు చేయాల్సి ఉంది. అందులో భాగంగానే గత ప్రభుత్వం డ్రైపోర్టు ఏర్పాటుకు నల్లగొండ ప్రాంతంలోని చిట్యాలను పరిశీలించారు. కానీ, పోర్టు ఏరియాకు దూరంగా ఉండటం, ఒకే ఒక జాతీయ రహదారి అనుసంధానం ఉండడం, వందల ఎకరాల భూ సేకరణ వంటి సమస్యలు ఉత్పన్నమవడంతో అక్కడ డ్రైపోర్టు అంశం మరుగునపడింది. అయితే, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ నుంచి రైలు మార్గం ద్వారా అన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయం ఉండటం, మూడు జాతీయ రహదారులు అనుసంధానం కావడం, కాకినాడ పోర్టు ఏరియాకు అన్ని విధాల రోడ్డు మార్గం ఉండడంతో డోర్నకల్ డ్రైపోర్టు ఏర్పాటుపై కేంద్రం సాధ్యాసాధ్యాలను చర్చించినట్లుగా తెలుస్తోంది.

మౌలిక వసతులు, కనీస సౌకర్యాలపై దృష్టి

డ్రైపోర్టు ఏర్పాటుకు కనెక్టివిటీతో పాటుగా స్థానికంగా వందల ఎకరాల ప్రభుత్వం స్థలం, ఉద్యోగులకు స్థానికంగా మౌలిక వసతులు, కనీస సౌకర్యాలు ఉండాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా గూడ్స్ రవాణా జరిగే ప్రాంతం కావడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన కస్టమ్స్ అధికారులు ఇక్కడ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డోర్నకల్ జంక్షన్ అందుకు అనువుగా ఉందా లేదా అన్నది పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే, డోర్నకల్ పట్టణం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ అయిన ప్రభుత్వం చొరవ తీసుకుంటే సౌకర్యాల కల్పన కూడా త్వరితగతిన జరిగే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. అంతే కాకుండా ఖమ్మం పట్టణం, మహబూబాబాద్ పట్టణాలకు కేవలం 35 కి.మీ దూరం మాత్రమే ఉండటంతో అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని స్థానిక ప్రజాప్రతినిధులు తెలుపుతున్నారు.

డ్రైపోర్టుతో జిల్లా మరింత అభివృద్ధి

డోర్నకల్ రైల్వే జంక్షన్‌లో డ్రైపోర్టు ఏర్పాటు చేస్తే యువతకు ఉద్యోగాలతో పాటుగా, కొత్తగా వ్యాపారాలు నిర్వహించే వారికి సైతం ఉపాధి లభిస్తుంది. అంతే కాకుండా కార్పొరేట్ సంస్థలు సైతం జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపుతారని తద్వారా డోర్నకల్ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. గిరిజన, వెనుకబడిన ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి పోర్టు ఏర్పాటుతో మరిన్ని పరిశ్రమలు ఆ ప్రాంతానికి తరలివస్తాయి. దీనిపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు కేంద్రానికి నివేదించి జిల్లా, డోర్నకల్ ప్రాంతం అభివృద్ధికి పాటు పడాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అదే విధంగా వివిధ దేశాలతో ప్రత్యక్షంగా అనుసంధానం ఏర్పడుతుండటంతో భాషా పరంగా, కమ్యూనిటీ కనెక్టివిటీ పరంగా ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జగనుంది. భవిష్యత్తు తరాలకు కూడా విద్య, వైద్యం, నైపుణ్యం వంటి అంశాలపై స్థానిక పిల్లలకు ప్రోత్సాహం పెరుగుతుంది.

కేంద్రం చొరవ చూపాలి: రామచంద్రనాయక్, ప్రభుత్వ విప్

డోర్నకల్ రైల్వే జంక్షన్ ఉత్తర, దక్షిణ తెలంగాణ రైల్వే మార్గాలతో అనుసంధానమైంది. హైవే రహదారులకు దగ్గరగా ఉంది. నిజాం కాలంలో ఏర్పాటైన రైల్వే జంక్షన్‌గా పేరుగాంచింది. డ్రైపోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. విభజన చట్టంలో సూచించిన విధంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ, డ్రైపోర్టు ఏర్పాటుకు తెలంగాణ కేంద్ర మంత్రులు చొరవ చూపాలి. డోర్నకల్ డ్రైపోర్టు ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉపాధి దొరకనుంది. డోర్నకల్ అభివృద్ధికి, డ్రైపోర్టు ఏర్పాటుకు అన్ని విధాల కృషి చేస్తా.

కేంద్రానికి నివేదిస్తా: పోరిక బలరాం నాయక్, ఎంపీ

డోర్నకల్ రైల్వే జంక్షన్ వసతులు, సదుపాయాలు కల్పనకు కృషి చేస్తా. డ్రైపోర్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించి నా వంతు భూమిక పోషిస్తా. స్థానిక ఎమ్మెల్యే లెటర్‌హెడ్ కూడా అవసరం అవుతుంది. డోర్నకల్ రైల్వే జంక్షన్ అన్ని విధాల అభివృద్ధి చేయుటకు కృత నిశ్చయంతో ఉన్నా. స్థానిక నాయకులు వినతి రూపంలో అందిస్తే 100 శాతం చేసి చూపుతా.

డ్రైపోర్టుకు అంతా కృషి చేయాలి: సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి

డోర్నకల్ రైల్వే జంక్షన్ పరంగా గతంలో గొప్ప పేరుంది. పూర్వవైభవం తీసుకురావల్సిన అవసరం ఉంది. కొత్త లైన్ల ఏర్పాటు కూడా జరుగుతుంది. ఇప్పటికైనా డోర్నకల్ అభివృద్ధికి, డ్రైపోర్ట్ ఏర్పాటుకు అందరూ కృషి చేయాలి. దీంతో డోర్నకల్ దశ మారుతుంది. స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అందుకు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed