మార్టిగేజ్ స్థలాలు ఖ‌తం..క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బండారం బట్టబయలు

by Jakkula Mamatha |
మార్టిగేజ్ స్థలాలు ఖ‌తం..క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బండారం బట్టబయలు
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో:గ్రేట‌ర్ వ‌రంగ‌ల్, కాక‌తీయ అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ప‌రిధిలో భూ బ‌కాసురులు రెచ్చిపోతున్నారు. మార్టిగేజ్ స్థలాల‌ను కూడా క‌బ్జాదారులు వ‌ద‌ల‌డంలేదు. కుడా, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్, రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలోని అధికారుల సాయంతో త‌నాఖా స్థలాల‌ను సైతం మింగేస్తున్నారు. దీనికి రాజ‌కీయ, అంగ‌బ‌లాల‌ను వినియోగిస్తూ రూ.కోట్ల విలువ చేసే స్థలాల‌ను తేర‌గా కొట్టేస్తున్నారు. వాస్తవానికి చాలా లే అవుట్లలో నిర్వాహాకులే బ‌డి, గుడి, పార్కుల‌కంటూ కుడా, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ పేరిట మార్టిగేజ్ చేసిన 10 శాతం భూముల‌ను సైతం స‌ర్వే నెంబ‌ర్ల పొజిష‌న్‌ను త‌ప్పుగా చూపుతూ రిజిస్ట్రేష‌న్లు జ‌రిగేలా చూస్తున్నారు. కాగితాల్లోనే మార్టిగేజ్ స్థలాలు ఉంటుండగా వాస్తవంలో మాత్రం క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 1969-70 నుంచి వ‌రంగ‌ల్ ప‌ట్టణంలో లే అవుట్లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. హ‌న్మకొండ‌ బాల‌స‌ముద్రంలోని రెడ్డికాల‌నీ, న‌యీంన‌గ‌ర్‌, హ‌న్మకొండ చౌర‌స్తా, భీమారం, వ‌రంగ‌ల్ చౌర‌స్తా, దేశాయిపేట‌లోని లే అవుట్లలో చాలా స్థలాలు క‌బ్జాకు గుర‌య్యాయి. గ్రీన్ ల్యాండ్స్ క‌బ్జా అవుతున్నాయ‌ని వ‌స్తున్న ఫిర్యాదుల‌పై టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారున్న విమ‌ర్శలున్నాయి.

నిబంధ‌న‌లు ఇలా..

నిబంధనల ప్రకారం..లేఅవుట్‌ ప్లాట్ల విక్రయాల సమయం లో సామాజిక అవసరాలకు కేటాయిస్తున్న 10 శాతం భూములను..ఆ తర్వాత కొన్నాళ్లకు కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అమ్మేస్తుండ‌టం గ‌మ‌నార్హం. వాస్తవానికి ఈ స్థలాలను కొనడానికి గానీ, అమ్మడం చేయ‌కూడ‌దు. రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు. అయితే కార్పొరేషన్‌, కాక‌తీయ అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీకి మార్టిగేజ్ చేసిన స్థలాలు సైతం కొంత‌మంది అధికారుల సాయంతో మింగేస్తున్నారు. ఆక్రమించుకుంటున్న దంద‌గాళ్లకు అధికారుల అండ‌దండ‌ల సాయంతో రిజిస్ట్రేష‌న్లు కూడా జ‌రిగిపోతున్నాయి.

కొనుగోలు దారుల‌కు తేరుకునేలోగానే..!

లేఅవుట్‌ వెంచర్‌లో ప్లాటు కొనుక్కున్నామన్న ఆనందిస్తున్న కొనుగోలుదారుల‌కు చివ‌ర‌కు నిరాశే మిగులుతోంది. పార్కు, బడి, గుడి, కమ్యూనిటీ హాల్​ వంటి సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు కనుమరుగ‌వుతున్న విష‌యాన్ని కొనుగోలుదారులు ఆల‌స్యంగా గుర్తిస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకునేలోగానే నిర్వాహకులు అమ్మేస్తున్నారు. ఈ విష‌యంపై పోరాటానికి ప్రయ‌త్నాలు మొద‌లుపెడుతున్నా అంతా స‌వ్యంగా ముందుకు సాగ‌డం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స‌మాచారం. అంతేకాకుండా ఆదిలోనే ఫిర్యాదుదారుల‌ను బెదిరింపుల‌కు పాల్పడుతుండ‌టంతో ఎందుకొచ్చిన గొడ‌వంటూ వెన‌క్కి త‌గ్గిపోతున్నారు. తనఖా స్థలాలను పరిరక్షించాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొన్నేళ్ల క్రితం కాక‌తీయ అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ నుంచి అప్రూవ్డ్ పొందిన వెంచ‌ర్ల జాబితా తీసి క్షేత్రస్థాయిలో త‌నిఖీలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తే ఈ మొత్తం వ్యవ‌హారంలో కోట్ల క‌బ్జాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని వ‌రంగ‌ల్ ప్రజ‌లు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed