Difficult conversation : విషపూరిత సంభాషణ..! నచ్చకుంటే ఎలా ?

by Javid Pasha |
Difficult conversation : విషపూరిత సంభాషణ..! నచ్చకుంటే ఎలా ?
X

‘‘మంచి మాట చాలు మనసులో గాయంబు మాన్పజాలు గొప్ప మందువోలె’’ అంటారు పెద్దలు. చిన్న చిన్న మాటలే కాదు, సుదీర్ఘంగా సాగే సంభాషలోనూ అంతే.. కొందరితో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. మరికొందరితో మాట్లాడుతుంటే ఎప్పుడెప్పుడు ముగిస్తారా? అనిపిస్తుంది. ఇందుకు రకరకాల కారణాలు ఉండవచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం, ఆసక్తి, అభిప్రాయం, భేదాభిప్రాయం, బిహేవియర్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అంశాలు ఇలా ఏవైనా ముడిపడి ఉండవచ్చు. కారణాలేమైనా టాక్సిక్ కన్వర్జేషన్ గందరగోళానికి గురిచేస్తున్నప్పుడు దానిని ఎలా ముగించాలో తెలియక కొందరు ఇబ్బంది పడుతుంటారు. అయితే మీకు నచ్చని టాక్సిక్ కన్వర్జేషన్‌ను గౌరవ ప్రదంగా ముగించడానికి సులభమైన మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

బౌండరీస్ సెట్ చేసుకోండి

అవతలి వ్యక్తితో సంభాషణ కొనసాగించడం మీకు నచ్చనప్పుడు సూటిగా చెప్పలేకపోతే లేదా అలా చెప్పడంవల్ల గొడవలు అవుతాయని భావిస్తే మరో రూపంలో కూడా చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు ‘‘ఈ కన్వర్జేషన్ నాకు ప్రొడక్టివ్‌గా లేదు’’ అంటే చాలు మీ ఉద్దేశం అవతలి వ్యక్తికి అర్థమైపోతుంది. అలాగే మీ మధ్య చర్చవల్ల ఎవరికీ ఉపయోగడం ఉండదని మీరు భావిస్తున్నట్లు సున్నితంగానే తెలియజేయండి. దీంతో మీరు అవతలి వ్యక్తితో సంభాషణను ముగించాలని కోరుకుంటున్నట్లు గ్రహిస్తారు. ఎలాంటి గొడవలు లేకుండా విషపూరిత సంభాషణ నుంచి తప్పించుకునే సులువైన మార్గం ఇది.

మీ భావాలను వ్యక్త పరచండి

మీరు ఫుల్ డిస్కషన్‌లో ఉన్నారు. అవతలి వ్యక్తి మాటలు మీకు నచ్చడం లేదు అలాంటప్పుడు ‘‘ఈ డిస్కషన్ వల్ల నేను అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాను’’ అని చెప్పడం ద్వారా మీరు నిజాయితీగా, మీకు నచ్చని లేదా హాని కలిగించే విషపూరిత సంభాషణను వ్యతిరేకిస్తున్నట్లు అవతలి వ్యక్తికి అర్థం అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఎలాంటి గొడవ పడకుండానే, విసుక్కోకుండానే ఎంతో గౌరవ ప్రదంగా టాక్సిక్ కన్వర్జేషన్‌కు స్వస్తి పలకవచ్చు. తద్వారా సంభాషణ ముగించడం లేదా మీకు ఇష్టమైన విషయాలను మాట్లాడటం వంటివి కూడా చేయవచ్చు. కన్వర్జేషన్ వల్ల మీరు ఎలా ఫీలవుతున్నారరో చెప్పడం ద్వారా పరస్పరం అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మంచి కమ్యూనికేషన్‌కు, బలమైన సంబంధాలను పెంపొందించడానికి ఇది సహాయపడుతుంది.

విషయాన్ని డైవర్ట్ చేయండి

అవతలి వ్యక్తితో మీరు కొనసాగిస్తున్న సంభాషణ నచ్చనప్పుడు మధ్య మధ్యలో సబ్జెక్ట్‌పై డైవర్ట్ చేయడానికి ప్రయత్నించడం ద్వారా ముగింపు పలకవచ్చు. కొత్త విషయాన్ని ముందుకు తేవడం ద్వారా మీరు వద్దనుకుంటున్న అసలు విషయాన్ని పక్కదారి పట్టించవచ్చు అంటున్నారు నిపుణులు. మీకు నచ్చని సంభాషణ నుంచి నచ్చే సంభాషణలోకి మారడంతో ఇది సాధ్యం అవుతుంది. అలాగే ఆహ్లాదరకరమైన లేదా ఆశాజనకంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది మీకు, అవతలి వ్యక్తికి కూడా మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీరు సానుకూల విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నారని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది.

విరామం కావాలని అడగండి

మీరు సంభాషణ మధ్యలో ఉన్నప్పుడు ఇబ్బందిగా ఫీలవుతుంటారు. కానీ ఎలా ముగించాలో తెలియదు. నేరుగా చెబితే ఇబ్బందులు ఎదురు కావచ్చు కాబట్టి ‘‘మనం ఒక్క క్షణం బ్రేక్ తీసుకోవచ్చా’’ అనడం మీ అయిష్టతను తెలియజేసే సరైన మార్గం అంటున్నారు నిపుణులు. కాసేపు బ్రేక్ తీసుకోవడంవల్ల ప్రశాంతంగా అనిపించడమే కాకుండా కాస్త ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది. దీంతో టాక్సిక్ కన్వర్జేషన్ కాస్త పాజిటివ్ కన్వర్జేషన్‌గా మారవచ్చు. అంతేకాకుండా విరామ సమయం తర్వాత మీరొక క్లారిటీ మైండ్‌తో రావచ్చు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తీకరించవచ్చు.

మర్యాదగా నిష్క్రమించడం

మీకు సంభాషణ నచ్చనప్పుడు ‘‘ప్రస్తుతానికి నేను సిద్ధంగా లేను. తర్వాత మాట్లాడుకుందాం’’ అని చెప్పడం ద్వారా కూడా టాక్సిక్ కన్వర్జేషన్‌కు బ్రేక్ వేయవచ్చు. దీనివల్ల ఎలాంటి గొడవలు లేదా వాదనలకు అవకాశం ఉండదు. పైగా మీరు అవనసర వాదనకు దిగకుండా మర్యాదగా సంభాషణ ముగించాలనుకుంటున్నట్లు మెసేజ్ కూడా ఇచ్చినట్లు అవుతుంది. ఇలా మర్యాదగా నిష్క్రమించడం అనేది మీ గౌరవాన్ని పెంచుతుంది. అలాగే అవతి వ్యక్తితో వాదనలు, గొడవలకు అవకాశం కూడా ఉండదు. అనేక సందర్భాల్లో ఇది అపార్థాలు, బాధాకరమైన భావాలను నివారించడానికి సహాయపడుతుంది. మీ మధ్య కనెక్షన్‌ని ఉంచడంలోనూ సహాయపడుతుంది అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed