వైద్య సేవలకు వేళాయే..నూతన ఆస్పత్రి, వైద్య కళాశాలను ప్రారంభించిన మంత్రులు

by Aamani |
వైద్య సేవలకు వేళాయే..నూతన ఆస్పత్రి, వైద్య కళాశాలను ప్రారంభించిన మంత్రులు
X

దిశ, వెబ్ డెస్క్: నర్సంపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా ఆస్పత్రి, మెడికల్ కాలేజీలను మంత్రులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జ్, మంత్రి రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, సహా ఉమ్మడి వరంగల్ జిల్లా శాసన సభ్యులు హాజరయ్యారు. నర్సంపేటకు హెలిప్యాడ్ ద్వారా చేరుకున్న మంత్రులకు కలెక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆహ్వానం పలికారు.

బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పొంగులేటి..

గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథ లో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రూ.46 వేల కోట్ల ఈ ప్రాజెక్టులో 15 వేల నుంచి 20 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథ పై సర్వే నిర్వహించగా 53 శాతం ఇండ్లకు మంచినీరు అందడం లేదని భయంకరమైన విషయాలు వెలుగు చూశాయన్నారు. గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయానికి బడ్జెట్ లో రూ.72 వేల కోట్లు కేటాయించిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. 27 రోజుల్లో 23 లక్షల మందికి రూ. 18 వేల కోట్ల రైతు రుణాలను రద్దు చేశామన్నారు.

సాంకేతిక కారణాలతో కొంత మంది రైతులకు రుణమాఫీ ప్రయోజనం అందలేదని వీలైనంత త్వరలో వాటిని పరిష్కరించి ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి రైతన్నకు రుణమాఫీ చేస్తామన్నారు. అన్న మాట ప్రకారం 31 వేల కోట్ల రూపాయలకి ఇంకా కావాలంటే రెండు మూడు వందల కోట్లు ఎక్కువైనా పర్వాలేదు అర్హులైన ప్రతి రైతన్న కు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రెండు లక్షల రూపాయలు వరకు రుణమాఫీ చేసి తీరుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు వేరు వేరుగా అందించబోతున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. మరి కొద్ది రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేయబోతున్నామన్నారు. ఈ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed