Minister Ponguleti : విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం..

by Aamani |
Minister Ponguleti : విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం..
X

దిశ, హనుమకొండ : హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రెండో పెద్ద నగరమైన వరంగల్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, అందుకే తనను ఈ జిల్లాకు ఇన్చార్జిగా బాధ్యతలను అప్పగించారని అన్నారు. అందుకే వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత నిస్తుందన్నారు.

ఎడ్యుకేషన్, హెల్త్ అనేవి రెండు కళ్ళలాంటివని పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం తో పాటు వరంగల్ నగరాభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించినట్లు పేర్కొన్నారు. నగర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులను కూడా విడుదలయ్యేందుకు కృషి చేస్తామన్నారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన వాటికి నిధులను కేటాయిస్తామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముప్పు నుండి ప్రజలను హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడినందుకు మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. పాత్రికేయులకు ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో తమ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తప్పకుండా ఇంటి స్థలాలను అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పాత్రికేయుల ఇంటి స్థలాల విషయంలో కాలయాపన చేసిందని పేర్కొన్నారు. అలా కాకుండా అర్హులైన వారి జాబితాను ఆయా కమిటీలు అందిస్తే ఇంటి స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందన్నారు. ఇంటి స్థలాల విషయంలో ఆయా యూనియన్లు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో ఒకసారి సమావేశమై చర్చించాలన్నారు.

ఇటీవలనే హైదరాబాదులో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించినట్లు పేర్కొన్నారు. నాలాలపై ఎలాంటి నిర్మాణాలు ఉన్న ఉపేక్షించవద్దని, ఎంతటి వారు ఉన్న వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కళాక్షేత్రం ప్రారంభోత్సవం కోసం వచ్చే నెల రెండవ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఉండనుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం మరిన్ని నిధులను కేటాయించాలని అన్నారు. స్మార్ట్ సిటీ పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. నాలాల ఆక్రమణ తొలగింపు విషయంలో కార్పొరేషన్ కు అనేక ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ, సాగునీటిపారుదల, ఇతర శాఖల అధికారులు సహకారం అందిస్తే నాలాల విస్తరణ పనులను పూర్తి చేయవచ్చునని తెలిపారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ నగరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్క్ స్థలాలు చాలా చోట్ల కబ్జాకు గురయ్యాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. విలువైన పార్క్ స్థలాల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ ఎంజీఎం అభివృద్ధికి, వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రిని కోరారు. ఆయా జిల్లాలకు సంబంధించిన, గ్రేటర్ వరంగల్ సంబంధించిన వివిధ అంశాలను గురించి కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్, కూడా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed