రైతులకు భూ న్యాయ శిబిరం..నిపుణుల సలహాలు,సూచనలు

by Aamani |
రైతులకు భూ న్యాయ శిబిరం..నిపుణుల సలహాలు,సూచనలు
X

దిశ,వెబ్ డెస్క్ : తెలంగాణలోని ప్రతి పల్లెలో వందల కుటుంబాలు భూ సమస్యల చిక్కుల్లో పడి సతమతమవుతున్నారు. భూమి ఉన్న, పట్టా కాకున్నా, ధరణిలో ఎక్కకనో నిషేదిత జాబితా వలలో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న తరుణంలో రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించడానికి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం, చిన్నవంగర గ్రామంలో తెలంగాణ సోషల్ మీడియా ఫోరమ్, గ్రామీణ న్యాయ పీఠం మరియు లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో భూ న్యాయ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భూ చట్ట నిపుణులు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భూమి సునీల్ కుమార్ మాట్లాడుతూ ధరణి లేదా ఇతర భూమి సమస్యలు ఉన్న రైతులకు భూ న్యాయ శిబిరాలతో బాధితులకు, రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చని అన్నారు.

భూ సమస్యలు ఉన్న రైతులు వాటి పరిష్కారం ఎలాగో తెలియక గందరగోళంలో ఉన్నవారికి భూ న్యాయ శిబిరం ద్వారా సలహాలు, సూచనలు అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని తెలంగాణ రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని, రైతు శ్రేయస్సు కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రైతాంగం చేదోడువాదోడుగా నిలవాలని కోరారు. ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూ సమస్యలు లేని గ్రామాలే లక్ష్యంగా రైతులకు భూమి హక్కుల పరీక్షలు చేసి క్షేత్ర స్థాయిలో ఉన్న భూ సమస్యలపై అధ్యయనం, పరిష్కార మార్గాలను అన్వేషించాలనే సంకల్పంతో భూ న్యాయ శిబిరాలకు శ్రీకారం చుట్టారన్నారు. గత ప్రభుత్వం గ్రామ స్థాయిలో పరిష్కారమయ్యే పనిని రాష్ట్ర స్థాయి అధికారులకు అప్పగించిందని విమర్శించారు. ధరణి సమస్యలు అన్నీ ఇన్నీ కావని, వాటి పరిష్కార మార్గాలను వెతకడానికే తాజాగా కమిటీని నియమించిందన్నారు.

త్వరలోనే కమిటీ రిపోర్ట్ ఆధారంగా మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్యలు, సవరణలపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. అయితే రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం భూమి సునీల్ కుమార్ ఎన్నో యేండ్లుగా శ్రమిస్తున్నారన్నారు. గ్రామ పరిధిలో లీఫ్స్ సంస్థ నిర్వహిస్తున్న భూ న్యాయ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లీఫ్స్ సంస్థ సలహాదారుడు కరుణాకర్ దేశాయ్, ఉపాధ్యక్షులు జీవన్ రెడ్డి, న్యాయవాదులు మల్లేశం, ప్రవీణ్, శ్రీకాంత్, తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ కరుణాకర్ రెడ్డి దేశాయ్, తహసీల్దార్ మహేందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed