12 దీవులతో ఉన్న లక్నవరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి : మంత్రి జూపల్లి

by Kalyani |
12 దీవులతో ఉన్న లక్నవరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి : మంత్రి జూపల్లి
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలోని లక్నవరం సరస్సులో గల మూడవ దీవిని పర్యాటకులకు ఆహ్లాదకరంగా, ఉల్లాసవంతంగా గడపడానికి అనువుగా రూ. 7 కోట్ల వ్య‌యంతో 3 ఎకరాల విస్తీర్ణంలో టీజీటీడీసీ, ఫ్రీకోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన మూడో ద్వీపాన్ని (ఐలాండ్ ను) మంత్రి జూపల్లి కృష్ణరావు, మంత్రి సీతక్క బుధవారం ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ పర్యాటక శాఖ కొత్త పుంతలు తొక్కుతోందని, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచలనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ములుగు జిల్లాలో రామప్ప, లక్నవరం లాంటి సరస్సులు ఉండటం పాటు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడి జిల్లాకు గుర్తింపు తెచ్చి పెడుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలను సుందరంగా తీర్చిదిద్దుతామని, పర్యాటకుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నామని, ఐలాండ్ అనుభూతి పొందేందుకు అండమాన్‌, మాల్దీవులు లాంటి సుదూర ప్రదేశాలకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా తెలంగాణలో కూడా ఇలాంటి ఓ అందమైన టూరిజం స్పాట్ ను ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులోకి తెచ్చామన్నారు.

ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన మాల్దీవులు, శిమ్లా, మున్నార్‌ వంటి ప్రాంతాలను తలపించేలా ఈ ద్వీపాన్ని సుందరకరించామని, చూసినంత దూరం నీరు, చుట్టూ పచ్చని కొండలు మధ్యలో 12 దీవులతో ప్రకృతి అందాలను కలబోసుకున్న లక్నవరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడి లేని విధంగా మన రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, ఇక్కడి ఐలాండ్ ప్రాంతాలు చెప్పు దగ్గవిగా ఉన్నాయని అన్నారు. లక్నవరం సరస్సులో 12 ద్వీపాలు ఉండగా ఇప్పటికే రెండు ద్వీపాలలో కాటేజ్ ల నిర్మాణం పూర్తి చేయగా మూడవ ద్వీపంలో చూడముచ్చటగా కాటేజ్ ల నిర్మాణం పూర్తి చేయగా దానిని నేడు అంకురార్పణ చేస్తున్నామని, ఫ్రీకోట్స్ సంస్థ మూడు ఎకరాల స్థలంలో అన్ని వసతులతో నిర్మాణ పనులు పూర్తి చేశారని, ఐదు సంవత్సరాల పాటు సంస్థ వారి ఆధ్వర్యంలో పర్యాటకులకు వసతులు కల్పిస్తారని అన్నారు.

వచ్చే ఆదాయంలో సంస్థ వారు పర్యాటక శాఖకు పదిహేను శాతం నిధులు ఇస్తారని, ఐదు కాటేజీల వద్ద కాటేజీల ముందు అనుసంధానం చేస్తూ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పర్యాటకులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి డబ్బులను వృధా ఖర్చు చేసుకోకుండా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి ఉల్లాసాన్ని పొంది తమ ఆయుష్షును పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వాని రూ. 250 కోట్ల కేటాయించాలని విన్నవించడం జరిగిందని, హైదరాబాద్ లో ముఖ్యమంత్రి మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్న విధంగానే రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సుందరీకరణ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితం చిన్నదని సంపాదనే ధ్యేయంగా కాకుండా ప్రకృతి అందాలను వీక్షించి మనసుకు ఉల్లాసం కలిగించాలని అన్నారు. లక్నవరం అటవీ ప్రాంతంతో కూడి ఉండటం తో పాటు గుట్టలు, ఎటు చూసినా నీటి ప్రాంతం నీటి ప్రాంతాల్లో ద్వీపాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయనన్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ...

ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి చొరవ చూపుతున్నారని, రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ 100 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యటించిన ప్రతి ఒక్కరికి 30 శాతం ఆయుష్ పెరుగుతుందని అన్నారు. పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పర్యాటకులు ఎవరు ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ శబరీష్, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed