Dargah : అన్నారం షరీఫ్ దర్గాలో అడ్డగోలు వసూళ్లు!

by Nagam Mallesh |
Dargah : అన్నారం షరీఫ్ దర్గాలో అడ్డగోలు వసూళ్లు!
X

దిశ, పర్వతగిరి: అన్నారం షరీఫ్ యాకూబ్‌బాబా దర్గాలో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. టెండర్​దారులు సొంత రశీదు టిక్కెట్ల ముద్రించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. భక్తులు కందూరుచేసుకోవాలంటే రూ.2వేలకు పైగానే చెల్లించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇదంతా వక్ఫ్​బోర్డు ఇన్​స్పెక్టర్​కనుసన్నల్లో జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్గాలో హుండీలను ఏర్పాటు చేసి భక్తుల నుంచి బలవంతంగా కానుకల పేరిట వసూలు చేస్తున్నారని, ప్రశ్నిస్తే దుర్భాషలాడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దర్గాలో జరగుతున్న అక్రమాలపై అధికారులు దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. 2024 మార్చి 06న పాత టెండరు ముగిసింది. 2024 మార్చి 21న కొత్త టెండర్లు ఆహ్వానించారు. ఈ టెండర్ ఎస్ షబ్బీర్ కు వచ్చింది అయితే అప్పటి నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రశీదులలో ఒకటి...వసూలు మరొకటి..

టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక దర్గా నిర్వహణ వక్ఫ్‌బోర్డు ఆధీనంలో నుంచి టెండర్ దారుడు ఆధీనంలోకి వెళ్తుంది. దీనిని ఆసరా చేసుకుని ఇక్కడి టెండర్ దర్గా సిబ్బంది కొత్త దందాకు తెరలేపారు. వివిధ మొక్కులకు సంబంధించి మేక ఫాతియాకు రూ.300, కోడి ఫాతియాకు రూ.100 ధర నిర్ణయించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. గతంలో మేక ఫాతియాకు రూ.200 ఉండగా ఇప్పుడు రూ.300 చేశారని పలు గ్రామాలకు చెందిన భక్తులు పేర్కొంటున్నారు. ప్రశ్నిస్తే ‘గతంలో అన్నారం దర్గా కాంట్రాక్టు లక్షల్లో ఉండేది ఇప్పుడు కోట్లలో అయ్యింది. అందుకే టికెట్ల ధరలు పెంచాం’ అంటూ సమాధానం ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వక్ఫ్​బోర్డ్ అధికారి కనుసైగల్లో దందా...

అన్నారంలో అక్రమ వసూల్ల దందా వక్ఫ్​బోర్డ్ అధికారి కనుసైగల్లోనే నడుస్తుందని, ప్రతీ విషయం కూడా ఇన్​స్పెక్టర్ స్థాయి అధికారి దృష్టిలో ఉంటుందని, ఇక్కడ జరిగేది అధికారుల దృష్టికి తీసుకువెళ్లరని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దర్గా నిర్వాహకులపై, అక్రమ వసూలు చేసే సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed