వ‌రంగ‌ల్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూముల గుర్తింపు

by Mahesh |
వ‌రంగ‌ల్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూముల గుర్తింపు
X

దిశ, వరంగల్ బ్యూరో: అధికారుల నిర్లక్ష్యం వ‌రంగ‌ల్‌లో చిన్న, మ‌ధ్య త‌ర‌గ‌తి భూ య‌జ‌మానుల‌కు శాపంగా మారింది. 200 ఫీట్ల రోడ్డు నిర్మించేందుకని ఐదు ద‌శాబ్దాల కింద నోటిఫై చేసిన భూముల‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎటు తేల్చడం లేదు. భూముల‌ను అమ్ముకోనివ్వకుండా నోటిఫై జాబితాలో చేర్చింది. అలా అని భూసేక‌ర‌ణ చేప‌ట్టి ప‌రిహారం అంద‌జేయ‌డం లేదు. వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆస్తుల‌ను అమ్ముకోలేక‌.. ఆస్తులు ఉండి కూడా నిష్ప్రయోజ‌నంగా మారుతోంది. ద‌శాబ్దాలుగా ఎదురు చూస్తున్న వంద‌లాది మంది భూ య‌జ‌మానుల‌కు న్యాయం జరగడం లేదు. జిల్లా క‌లెక్టర్‌, కుడా అధికారులు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా తమ బాధ‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భూ య‌జ‌మానులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ జ‌రిగింది..

వ‌రంగ‌ల్‌ ఎనుమాముల నుంచి ములుగు రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్ వ‌ర‌కు 200 ఫీట్లతో బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేప‌ట్టాల‌ని 1970 వ‌రంగ‌ల్ మాస్టర్ ప్లాన్‌లో అప్పటి ప్రభుత్వం చేర్చింది. ఈ ప్లాన్‌లో పేర్కొన్న మేర‌కు ఎలైన్‌మెంట్ కూడా సిద్ధం చేశారు. దాదాపు 7కిలోమీట‌ర్ల మేర ఎలైన్‌మెంట్ ప్రకారం మార్కింగ్ చేశారు. అయితే భూ సేక‌ర‌ణ మాత్రం చేప‌ట్టలేదు. ఎలైన్‌మెంట్ ప్రకారం సుమారు 300 ఎక‌రాల భూములు రోడ్డు నిర్మాణానికి సేక‌రించాల్సి ఉంటుంద‌ని గుర్తించారు. అయితే ప్లాన్‌లో చేర్చడ‌మైతే చేశారు గాని ప‌నులు మాత్రం కార్యరూపం దాల్చలేదు. 1970 కుడా మాస్టర్ ప్లాన్ అప్‌గ్రేడ్ కాలేదు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాద‌న‌లు అలానే కొన‌సాగుతూ వ‌చ్చాయి.

ఇక అవ‌స‌రం లేన‌ట్లే..!

వ‌రంగ‌ల్ ఇన్నర్ రింగ్ రోడ్డు ప‌ట్టాలెక్కుతుండ‌డంతో కేవ‌లం రెండున్నర కిలోమీట‌ర్ల ప‌రిధిలోనే మ‌రో 200ఫీట్ల రోడ్డు అవ‌స‌రం లేకుండా పోయింది. దీంతో ఎనుమాముల టు ఇస్కాన్ టెంపుల్ వ‌ర‌కు నిర్మించ త‌ల‌పెట్టిన బైపాస్ రోడ్డు ప్రతిపాద‌న‌లు వీగిపోయిన‌ట్లేన‌ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే గ‌తంలో నోటిఫై చేసిన భూముల‌ను ఢీ నోటిఫై చేసే అంశం మాత్రం త‌మ ప‌రిధిలో లేద‌ని కుడా అధికారులు స్పష్టం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యాన్ని తాము కూడా అంత‌ర్గతంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు.

భూ య‌జ‌మానుల అరిగోస‌..

నోటిఫై చేసిన భూముల‌ను అమ్ముకోవడానికి వీల్లేకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. స‌ద‌రు భూముల్లో ఎలాంటి నిర్మాణాల‌కు అనుమ‌తులు ఇవ్వడం లేదు. పూర్వీకుల నుంచి వచ్చిన ప‌ట్టాదారు భూములు కూడా ద‌శాబ్దాలుగా నిషేధిత జాబితాలో కొన‌సాగుతుండ‌డంపై వార‌సులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. త‌మ భూముల‌ను డీ నోటిఫై చేయాలని లేదంటే ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న ధ‌ర‌ను నిర్ణయించి భూ సేక‌ర‌ణ చేప‌ట్టయినా త‌మ‌కు న్యాయం చేయాల‌ని బాధిత భూ య‌జ‌మానులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ‌త ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తే న్యాయం జ‌ర‌గ‌లేద‌ని, క‌నీసం ఈ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులైన త‌మ‌కు న్యాయం చేయాల‌ని వేడుకుంటున్నారు.

Advertisement

Next Story