వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ దివాకర

by Sumithra |
వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ దివాకర
X

దిశ, ములుగు ప్రతినిధి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని బొగత జలపాతం, లక్నవరం, రామప్ప సరస్సులు తదితర పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు ప్రజలు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు రాకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. జిల్లాలో మూడు రోజులు భారీ వర్షాల కారణంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా చేపల వేటకి వెళ్లరాదని తెలిపారు. భారీ వర్షాల సూచన ప్రకారం చేపల వేట నిషేధించారని, ఎవరు కూడా చెరువులు, వాగులు, కాలువుల దగ్గరకు చేపల వేటకి వెళ్లకూడదని, సరదాగా ఈత కొట్టడానికి గాని వెళ్లకూడదని అన్నారు.

చెరువులు, కుంటల దగ్గర చేపల కోసం జాలీలు, వలలు అమరిస్తే తక్షణమే వాటిని తొలగించవలసిందిగా కలెక్టర్ సూచించారు. దీన్ని పాటించని యెడల మత్స్యకారుల లైసెన్సు, సంఘాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారని తెలిపారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర మేడారం వెళ్లే దారిలో మెట్లగూడెం సమీపంలో ఉన్న బాంబుల ఒర్రె, నార్లాపూర్ కాల్వపల్లి మధ్యలో ఉన్న జంపన్నవాగు ఉధృతంగా పొంగి పోర్లిపోవడంతో, రాకపోకలకు వాహనదారులకు అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వరద సహాయార్థం ఐటీడీఏ ఏటూర్ నాగారం, ములుగులలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులలో 18004257109,6309842395,08717-293246 నెంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు.

Advertisement

Next Story