తోటి కోడళ్లు పరస్పర దాడి.. తీవ్ర గాయాలతో ఒకరి మృతి

by Kalyani |   ( Updated:2023-04-08 13:06:45.0  )
తోటి కోడళ్లు పరస్పర దాడి.. తీవ్ర గాయాలతో ఒకరి మృతి
X

దిశ, నెక్కొండ: తోటి కోడళ్ల మధ్య ఏర్పడిన ఘర్షణ ఒకరి మరణానికి దారి తీసింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పత్తిపాక గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తిపాక గ్రామానికి చెందిన తాళ్ల కమలమ్మ, తాళ్ల లచ్చమ్మ ఇద్దరు తోటికోడళ్లు. ఇదిలా ఉండగా వీరిరువురికి మొదటి నుంచే గొడవలున్నాయి. శనివారం లచ్చమ్మ తన ఇంటి పక్కనే ఉన్న వాళ్లతో గొడవ పడుతున్నది. ఈ క్రమంలో కమలమ్మ మధ్యలోకి వచ్చినట్లు సమాచారం. దీంతో లచ్చమ్మ, కమలమ్మల మధ్య గొడవ పెద్దదైంది.

ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మరింత ఆగ్రహానికి గురైన లచ్చమ్మ, కమలమ్మ గుడిసెలోకి వెళ్లి కర్రతో కమలమ్మను కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కిందపడిపోగా స్థానికులు నెక్కొండ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కమలమ్మ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట మార్చురీకి తరలించారు.

Advertisement

Next Story