Srinagar: 50 ఏళ్లలో డిసెంబర్ ఉష్ణోగ్రతల్లో అత్యల్పం.. శ్రీనగర్‌లో -8 డిగ్రీలు నమోదు

by vinod kumar |
Srinagar: 50 ఏళ్లలో డిసెంబర్ ఉష్ణోగ్రతల్లో అత్యల్పం.. శ్రీనగర్‌లో -8 డిగ్రీలు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir)లో 40 రోజులపాటు కొనసాగే అత్యంత తీవ్రమైన చలికాలం చిల్లై కలాన్ (Chillai kalan) శనివారం ప్రారంభమైంది. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. శ్రీనగర్‌లో (Srinagar) శుక్రవారం రాత్రి -6.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా శనివారం రోజు - 8.5 డిగ్రీలుగా నమోదైంది. ఇతర ప్రాంతాలలో కూడా కనిష్ట ఉష్ణోగ్రత ఘనీభవన స్థానం కంటే అనేక డిగ్రీల దిగువకు చేరుకుంది. గత 50 ఏళ్లలో శ్రీనగర్‌లో డిసెంబర్‌లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ శాఖ తెలిపింది. అంతకుముందు 1974 డిసెంబర్‌లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత -10.3 డిగ్రీల సెల్సియస్ కాగా.. ఆ తర్వాత 1934 డిసెంబర్13న కనిష్ట ఉష్ణోగ్రత-12.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

గడ్డకట్టిన దాల్ సరస్సు

తీవ్రమైన చలి కారణంగా దాల్ సరస్సులోని కొన్ని ప్రాంతాల్లో నీరు గడ్డకట్టింది. దక్షిణ కాశ్మీర్‌లోని టూరిస్ట్ రిసార్ట్ పహల్గామ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత - 8.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా.. గుల్‌మార్గ్‌లో - 6.2 డిగ్రీలకు చేరుకుంది. పాంపోర్ నగర శివార్లలోని కొనిబాల్‌లో కనిష్ట ఉష్ణోగ్రత -10.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఖాజిగుండ్‌లో - 8.2 డిగ్రీల సెల్సియస్, కుప్వారాలో -7.2 డిగ్రీల సెల్సియస్, కోకెర్‌నాగ్‌లో మైనస్ 5.8 డిగ్రీల సెల్సియస్ ఉంది. కాగా, కశ్మీర్‌లో చిల్లై-కలాన్ 40 రోజులు ఉంటుంది. ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఇది 2024 డిసెంబర్ 21 నుంచి ప్రారంభమై 2025 జనవరి 31న ముగుస్తుంది.

Advertisement

Next Story