డివిజ‌న్ కేంద్రంగా ఏటూరునాగారం…ఎన్నిక‌ల ముందు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

by Kalyani |   ( Updated:2023-10-07 14:51:13.0  )
డివిజ‌న్ కేంద్రంగా ఏటూరునాగారం…ఎన్నిక‌ల ముందు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ములుగు జిల్లా ఏటూరునాగారంను డివిజ‌న్‌గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏటూరునాగారం, మంగ‌పేట‌, క‌న్నాయిగూడెం, నూగూరు వెంక‌టాపురం, వాజేడు, తాడ్వాయి మండ‌లాల‌తో ఏటూరునాగారంను డివిజ‌న్‌గా ఏర్పాటు చేసింది. ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రం రాష్ట్ర ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ న‌వీన్ మిత్త‌ల్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లా మొత్తంలో ములుగు డివిజ‌న్‌గా ఉండ‌గా, జిల్లా ఏర్ప‌డిన తొలి నుంచి ఏటూరునాగారాన్ని డివిజ‌న్‌గా ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ నెల‌కొంది. తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఏటూరునాగారం ప్రాంత ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ములుగుపై బీఆర్ ఎస్ స్పెష‌ల్ ఫోక‌స్‌

వాజేడు, నూగూరు రెండు మండ‌లాలు భ‌ద్రాచ‌లం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉండ‌గా మిగ‌తా ములుగు, మ‌ల్లంప‌ల్లి, గోవింద‌రావుపేట, తాడ్వాయి, రామ‌ప్ప‌ వెంక‌ట‌పూర్‌, ఏటూరునాగారం, క‌న్నాయిగూడెం మంగ‌పేట మండ‌లాలు ములుగు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నాయి. ములుగు నియోజ‌క‌వ‌ర్గంపై బీఆర్ఎస్ పార్టీ, ప్ర‌భుత్వం స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. ములుగు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌ను ఓడించాల‌ని ఆదివాసీ సామాజిక వ‌ర్గానికే చెందిన బ‌డే నాగ‌జ్యోతిని బ‌రిలోకి దింపింది.

అలాగే ఈ ప్రాంతంపై ప‌ట్టున్న బీఆర్ ఎస్ నేత‌, మంత్రి ఎర్ర‌బెల్లికి అత్యంత స‌న్నిహితుడైన ల‌క్ష్మ‌ణ్‌బాబును జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా నియ‌మించారు. బ‌డే నాగ‌జ్యోతి అభ్య‌ర్థిత్వం ఖ‌రారు చేసిన కొద్దిరోజుల్లోనే ఆయ‌న నియామ‌కం జ‌ర‌గ‌డంతో ములుగు జిల్లాలో బీఆర్ ఎస్ పార్టీ బ‌లం పుంజుకోవ‌డానికి దోహ‌దం చేసింద‌నే చెప్పాలి. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు, ప్ర‌జాడిమాండ్లు, పెండింగ్‌లోని అభివృద్ధి ప‌నులకు క్లియ‌రెన్స్‌తో పాటు కొత్త‌గా అభివృద్ధి ప‌నుల‌కు మంజూరీలు వంటి చ‌ర్య‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి సానుకూల‌త‌ల‌ను పెంచేందుకు బీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తోంది.

దీనికితోడు ఈ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుకు అప్ప‌గించిన‌ట్లుగా పార్టీ వ‌ర్గాల నుంచి స‌మాచారం. ఈనేప‌థ్యంలోనే మంత్రి ఎర్ర‌బెల్లి ములుగులో బీఆర్ ఎస్ జెండా ఎగుర‌వేసి, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాపై త‌న‌కున్న ప‌ట్టును నిరూపించుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా దీర్ఘ‌కాలంగా ప‌రిష్కారానికి నోచుకోని స‌మ‌స్య‌ల‌కు ఎన్నిక‌ల వేళ‌నైనా మోక్షం ల‌భించ‌డంపై ప్ర‌జ‌లు ఆనందం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story