తండాలో తాగునీటి తంటాలు.. వాన కాలంలో నీటి కష్టాలు

by Aamani |
తండాలో తాగునీటి తంటాలు.. వాన కాలంలో నీటి కష్టాలు
X

దిశ,డోర్నకల్ : వానాకాలంలోనూ ఆ తండా వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు.నడి వేసవిని తలపించేలా మంచినీటి ట్యాంకర్ వద్ద నెట్టుకుంటూ నీటిని తెచ్చుకుంటున్నారు. మున్సిపాలిటీలోని ట్రంకు తండాలో నీటికష్టాలు తీవ్రమయ్యాయి.తండాలో మిషన్‌ భగీరథ నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది.బోరు బావి నుంచి సక్రమంగా నీళ్లు రాకపోవడంతో గత కొద్ది రోజులుగా తాగునీటి కోసం తండావాసులు తంటాలు పడుతున్నారు.ఇళ్లలో బోరు లేని వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.కేవలం పుర ట్యాంకర్ ద్వారా సరఫరా చేసే నీటిపైనే తండావాసులు ఆధారపడి ఉన్నారు.ప్రతి ఇంటి ముందు రోడ్డుపై పెద్ద పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములు ట్యాంకర్ నీళ్ల కోసం ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటే పరిస్థితి తీవ్రతను అద్దం పడుతుంది.

త్రాగునీటికి ఎదురుచూపులు : తండా వాసి తరుణ్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రం,మున్సిపాలిటీ పరిధి ట్రంకు తండాలో తాగునీటి తిప్పలు తప్పడం లేదు.ఏండ్ల తరబడి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం.మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు.బోరులో నీరు లభ్యత అంతంత మాత్రంగానే ఉంది.ఇటీవల ఆ నీరు సైతం రావడం లేదు.అధికారులు వస్తు పోతున్నారే తప్ప సమస్య పరిష్కారం జరగడం లేదు.గత ఏడాది అప్పటి ఎమ్మెల్యే రెడ్యానాయక్ పర్యటనను అడ్డుకొని తమ నీటి కష్టాలను వెల్ల బుచ్చుకున్నాం. దీంతో బోరు వేయించారు.దాంట్లో కొంచెం నీళ్లే వస్తుండడంతో తండాకు సరిపోవడం లేదు.నీటి కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నాం.సొంత బోరు ఉంటే సరే.. లేదంటే ఇక ట్యాంకర్ల కోసం ఎదురు చూడాల్సిందే. మున్సిపల్ కమిషనర్ కు మూడు రోజులగా మొరపెట్టగా ట్యాంకర్ పంపించారు. తండావాసులకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

కనీస అవసరాలకు చుక్కనీరు లేదు : గిరిజన మహిళ అచ్చమ్మ

గత 30 ఏళ్లుగా తండావాసుల నీటి బాధలు వర్ణనాతీతం.మిషన్ భగీరథ నీటిపై ఆధారపడి జీవిస్తున్నాం.నెల రోజుల్లో పది రోజులు మాత్రమే మిషన్‌ భగీరథ నీరు వస్తుంది.గతంలో మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తండా పర్యటనలో మహిళలందరం అడ్డుకోవడంతో బోరు మంజూరు చేశారు.అందులో అంతంత మాత్రం నీళ్లు వస్తున్నాయి.అవి ఒక బజారు కూడా సరిపోవడ లేదని వాపోయారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న నాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ఉదయం పదైన ముఖం శుభ్రపరచుకొనుటకు చుక్క నీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రోజుల తరబడి అధికారులకు మొరపెడితే వాటర్ ట్యాంకర్ పంపించారని తెలిపారు.

నీటి కోసం బిందెలతో కుస్తీ పట్టవలసి వస్తుందని ఆవేదన చెందారు.తమ కష్టాలు తీర్చే నాధుడే కరువయ్యాడని వాపోయారు.మున్సిపల్ అధికారులకు ఇంటి పన్నులు కట్టించుకొనుటలో ఉన్న శ్రద్ధ తాగునీటి కష్టాలు తీర్చడంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధిత అధికారులు స్పందించి మిషన్‌ భగీరథ త్రాగునీటిని సరఫరాను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ గిరిజన మహిళల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకున్నారు.

నీళ్లు లేక దాటుడు పండక్కి వెళ్లలేదు : గిరిజన మహిళలు

చిన్నప్పటి నుంచి తాగునీటి కష్టాలు పడుతూనే ఉన్నాం.బంధువుల ఇళ్లల్లో గిరిజన సాంప్రదాయ పండుగ దాటుడు కు వెళ్దామంటే నీళ్లు లేక వెళ్లలేకపోయామని వాపోయారు. అధికారులు మురికి కాలువలను నెలల తరబడి శుభ్రం చేయించడం లేదని ఆరోపించారు. దోమలతో జబ్బుల బారిన పడుతున్నట్లు వాపోయారు.సరైన రోడ్లు,మురికి కాలువలు లేవని అన్నారు.వృద్ధులకు కనీస అవసరాలకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నట్లు తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే రామచంద్రనాయక్ తమ తాగునీటి కష్టాలు తీర్చి పుణ్యం కట్టుకోవాలని చేతులెత్తి వేడుకున్నారు.

తాగునీటి పునరుద్ధరణకు చర్యలు : పురపాలక కమిషనర్ నరేష్ రెడ్డి

మున్సిపాలిటీలోని ట్రంకు తండాలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.మిషన్ భగీరథ నీటి పునరుద్ధరణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తండా దాహార్తి తీర్చే బోరు మోటర్ రిపేర్ జరుగుతుంది.వేసవికాలంలో సైతం ప్రజలకు త్రాగునీటి ఎద్దడి లేకుండా అందించాం.నీటి సమస్య తీర్చనున్నట్లు తెలిపారు.

Next Story