కేజ్రీవాల్ తీవ్రవాది కాదు.. బెయిలివ్వండి : హైకోర్టులో సింఘ్వీ వాదనలు

by Hajipasha |
కేజ్రీవాల్ తీవ్రవాది కాదు.. బెయిలివ్వండి : హైకోర్టులో సింఘ్వీ వాదనలు
X

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారించింది. న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం ఎదుట కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిందన్నారు. ఆ విధంగా అరెస్టు చేయడానికి కేజ్రీవాల్ ప్రకటిత నేరస్థుడు కానీ, తీవ్రవాది కానీ కాదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ సీఎంకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. అయితే కేజ్రీవాల్ వాదనలను సీబీఐ తరఫు న్యాయవాది డీపీ సింగ్ వ్యతిరేకించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై స్పందన తెలియజేస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది. కాగా, కేజ్రీవాల్‌పై ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో జూన్ 20న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఈడీ ఆశ్రయించడంతో మధ్యంతర స్టే విధించింది. ఈక్రమంలో ఢిల్లీలోని తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు జూన్ 26న అరెస్టు చేశారు. ఈడీ నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్‌కు జులై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ గత బుధవారం రోజు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Next Story