IND-W vs SA-W : సమమా?.. సమర్పణమా?.. నేడు సౌతాఫ్రికాతో హర్మన్‌ప్రీత్ సేన తాడోపేడో

by Harish |
IND-W vs SA-W : సమమా?.. సమర్పణమా?.. నేడు సౌతాఫ్రికాతో హర్మన్‌ప్రీత్ సేన తాడోపేడో
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో నేడు చెన్నయ్ వేదికగా ఆఖరి టీ20 జరగనుంది. తొలి మ్యాచ్‌లో సఫారీలు నెగ్గగా.. రెండో టీ20 వర్షం కారణంగా రద్దైంది. దీంతో సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉండగా.. ఆఖరి మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓడితే సిరీస్ కోల్పోతుంది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ జట్టు ఆఖరి మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ సమం చేయాలని పంతంతో ఉన్నది. మరోవైపు, వన్డే సిరీస్, ఏకైక టెస్టు కోల్పోయి సఫారీలు టీ20 సిరీస్‌తోనైనా ఇంటికి వెళ్లాలని భావిస్తున్నారు.

బలాబలాల పరంగా ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఎంఏ చిదంబరం స్టేడియం బ్యాటర్లకు అనుకూలంగా ఉంది. బ్యాటింగ్ పరంగా టీమిండియా బలంగా ఉంది. స్మృతి మంధాన, రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లోనే లోపాలను అధిగమించాల్సి ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికాను భారత బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేయలేకపోయారు. కీలకమైన మూడో టీ20లో బౌలర్లు రాణించడంపై భారత్ విజయం ఆధారపడి ఉంది. సౌతాఫ్రికాలో తాజ్‌మిన్ బ్రిట్స్ దూకుడుకు కళ్లెం వేయాల్సి ఉంది. అలాగే, కెప్టెన్ వొల్వార్డ్ట్, మారిజన్నే కాప్, అన్నేకే బోష్‌ ఫామ్‌లో ఉన్నారు. మరి, టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేస్తుందా? లేదంటే ఓడి సిరీస్‌ను సమర్పిస్తుందా? చూడాలి.

Advertisement

Next Story

Most Viewed