పరీక్షల మాయ

by Shiva |
పరీక్షల మాయ
X

నిరుద్యోగికి భారంగా... “కంప్యూటర్ బేస్డ్ టెస్ట్’’...!

పరీక్ష అనేది అభ్యాసకుని సామర్థ్యం, విషయ పరిజ్ఞానం తెలుసుకునేందుకు దోహదం చేసే ఓ కారకం. పూర్వం గురుకులాల్లో నేరుగా, వ్యక్తిగతంగా పరీక్షలు జరిగేవి. కాలక్రమేణా మార్పులొచ్చాయి. గదిలో పరీక్షలు రాయించి వాటిని మూల్యాంకనం చేయడం, మధ్యకాలంలో ఆప్టికల్ మార్క్ రీడర్లతో చేసేవారు. ఇప్పుడు సౌలభ్యం, కట్టుదిట్టం, పారదర్శకం పేరిట ‘కంప్యూటర్ ఆధారిత పరీక్షలు’ జరుగుతున్నాయి. అయితే... పరీక్షించడం ఎలాగైనా అది విద్యార్థి ప్రయోజనాలు దెబ్బతీయకుండా. వారిలోని ప్రతిభను నిక్కచ్చిగా గుర్తించేలా ఉండాలన్న చిన్న అంశాన్ని ఇవి విస్మరిస్తున్నాయి. కొత్త కొత్త అర్థాలతో ఈ పరీక్షలు అందరినీ అనేక అంశాల్లో ‘పరీక్ష’కు గురిచేస్తున్నాయి. పేపర్ లీకేజీలతో గత ప్రభుత్వ నిర్వహణా వైఫల్యంపై వెగటు పుట్టిస్తున్నాయి. నిరుద్యోగులకు అదనపు ఆర్థిక భారాన్ని కల్గజేస్తున్నాయి.

కంప్యూటరు ఆధారిత పరీక్ష ..

ఇది మెరుగైన విధానంతో పనిచేస్తూ ర్యాండమైజ్డ్ క్వశ్చన్ ఆర్డర్, టైమర్ కంట్రోల్స్, టెస్ట్ డేటా ఎన్క్రిప్షన్ వంటి అధునాతన భద్రతాచర్యలను ఉపయోగించుకుంటుంది. వీటిని నెలకొల్పడం, నిర్వహించడం ఖర్చుతో కూడుకున్న పని అయినా, గత సాంప్రదాయ పరీక్షా పద్ధతులతో సంబంధం ఉన్న కాగితం ఆధారిత పరీక్షల ముద్రణ, పంపిణీ, నిర్వహణ కూడా ఆర్థికభారం అయ్యేవి. సీబీటీలు పరీక్షా సామగ్రిని భౌతికంగా నిల్వ చేయాల్సిన అవసరాన్ని కూడా తగ్గిస్తాయి. కొన్ని సీబీటీ సిస్టమ్స్ ‘అడాప్టివ్ టెస్టింగ్ అల్గారిథమ్స్’ ను కూడా ఉపయోగిస్తాయి, ఇందులో డిజిటల్ వేదికలు టెక్స్ట్-టు-స్పీచ్, స్క్రీన్ మాగ్నిఫికేషన్, కస్టమైజబుల్ కాంట్రాస్ట్ సెట్టింగ్స్ వంటి యాక్సెసబిలిటీ ఫీచర్లను పొందుపరచవచ్చు.

తద్వారా టెస్ట్ డేటా సేకరణ, నిల్వ, విశ్లేషణను ఇవి క్రమబద్ధీకరిస్తాయి. కాలక్రమేణా టెస్ట్-టేకర్(పరీక్షార్థి) పనితీరును సులభంగా గుర్తించేలా చేయడానికి, విద్య, సంస్థాగత విధానాలలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వీలు కలుగుతుంది. అందుకోసమే మూల్యాంకనాలను సమర్థవంతంగా, సురక్షితంగా, సమ్మిళితంగా నిర్వహించడానికి విద్యా సంస్థలు, సర్టిఫికేషన్ సంస్థలు వీటిని ఎంపిక చేసుకుంటాయి. ప్రభుత్వాలు సైతం వివిధ ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు వీటిపై ఆధారపడుతున్నాయి.

లక్షల జీవితాలతో చెలగాటం ..

గత ప్రభుత్వం రెండులక్షల ఉద్యోగాల భర్తీ పేరుతో పదేళ్ళ కాలయాపన అనంతరం చివరిదశగా నామమాత్రపు నోటిఫికేషన్లు విడుదల చేసి, కోట్ల రూపాయల ఫీజులను దండుకుని రకరకాల పరిస్థితులను సృష్టించి తప్పుకుంది. గత ప్రభుత్వం ఎన్నికలొచ్చినపుడల్లా ఉద్యోగ ప్రకటనలంటూ లక్షలాదిమంది నిరుద్యోగులకు ఊరించే శుష్కవాగ్దానాలు చేస్తూ..ఉద్యోగాల భర్తీకి ‘జాబ్ క్యాలెండర్’ రూపకల్పన చేసి ప్రకటనలు విడుదల చేయకుండా కేవలం మాటలతో పబ్బం గడిపింది.

ఏళ్లుగా ఎదురుచూపులు చూసేలా ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందే కాకుండా..త్వరలో అర్హులైన వారికి ప్రతి నెలా రూ.3016 ‘నిరుద్యోగ భృతి’ చెల్లిస్తామని ప్రకటించి ఆశలు రేకెత్తించి కొత్త కోణానికి తెరలేపింది. పదేళ్లుగా నిరుద్యోగులకు నిరీక్షణ తప్పలేదు, పథక రూపకల్పన జరగలేదు, పైసా ఇవ్వలేదు. చివరికి అందరూ భావించినట్టుగానే కేవలం నూతన రాష్ట్ర ఏర్పాటు అనంతరం జోన్ల ఏర్పాటుకు, టీఎస్పీఎస్సీ ద్వారా ప్రకటనలకే పరిమితమైన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ... న్యాయపరమైన చిక్కులతో, వాయిదాలతో, ప్రశ్నపత్రాల లీకేజీలతో, పరీక్షల రద్దుతో ముగిసిపోయింది.

లీకేజీల పర్యవసానమే..

పరీక్షల రద్దు అనేది ప్రభుత్వానికి తేలికైన విషయమే అయినా అది లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూయించిందనేది విదితమే. అయితే జీవితాలతో చెలగాటం ఆడినవారిని పట్టుకోవడానికి వేసిన దర్యాప్తు కమిషన్ల నివేదికల్లో పారదర్శకత లేదు. అసలైన దోషులను పట్టుకుని శిక్షించే విధానాలు కంటితుడుపు చర్యల్లాగే మారిపోయాయని, మరుగున పడేశారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.లీకేజీలకు పాల్పడ్డారని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఛైర్మన్, సభ్యులు, ఇతర ఉద్యోగుల విచారణలు లేకుండానే పదవుల నుండి తప్పించేసి, దోషులకు శిక్షల్లేకుండానే, కావాలనే కేసులను నిర్వీర్యం చేశారనే ఆరోపణలు కోకొల్లలు. ప్రభుత్వ నిర్వహణ వైఫల్యానికి అమాయక నిరుపేద నిరుద్యోగులు బలవుతున్నారు. ఏళ్లుగా కష్టపడి చదివి పరీక్షలు రాసి, పేపర్ లీకేజీలతో భరించలేని తీవ్ర మానసిక క్షోభకు గురైన వారు లక్షలాదిమంది అయితే అందులో కొందరు కోలుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు.

ప్రస్తుత ప్రభుత్వం అనేక సంస్కరణల అనంతరం నూతన విధివిధానాల రూపకల్పనలో భాగంగా యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ద్వారా వివిధ పోటీ పరీక్షలను నిర్వహించే ‘కంప్యూటరు ఆధారిత పరీక్ష’ విధానాన్ని మనరాష్ట్రంలో తెరపైకి తెచ్చింది. ఈవిధానంలో పరీక్షను నిర్వహించడానికి కేటాయించబడ్డ నిర్ణీత సౌకర్యాలున్న కేంద్రాలకు ప్రభుత్వం అదనపు భత్యాలు, రుసుములు చెల్లించాల్సి వుంటుంది. దీనికయ్యే ఖర్చులను నిరుద్యోగ అభ్యర్థులనుండి అదనపు ఫీజుల పెంపు రూపంలో వసూలుచేస్తూ నిర్వహిస్తోంది.

నార్మలైజేషన్ పారదర్శకమేనా..!

నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్న ఒకేరకమైన ఉద్యోగాల ఎంపిక కోసం వరుసగా వివిధ రోజుల్లో భిన్నమైన ప్రశ్నపత్రాలతో నిర్వహిస్తున్న కంప్యూటరు ఆధారిత పరీక్షల్లో పారదర్శకత ఎంతో అధికారులకే తెలియాలి. కష్టపడి చదివిన వారిలో కొందరికి సులువు అయితే మరికొందరికి కష్టతరంగా రూపొందించిన ప్రశ్నపత్రాలు, ‘కీ’ పేపర్లలో లొసుగులు చివరికి నార్మలైజేషన్ పేరుతో భిన్నమైన మార్కుల కేటాయింపు లాంటి సందేహాస్పదమైన ప్రశ్నలు ఉద్భవించినా..చివరికి చేసేదేమీ లేక వచ్చిన మార్కులు, ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుని కొందరు తిరిగి ప్రశ్నించలేక గందరగోళంతో సరిపుచ్చుకోవడం పరిపాటిగా మారిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

((వినడానికి తేలికే..మోయడం భారమే..

అనేక సంస్కరణల అనంతరం జరిగిన పరీక్ష విధానాల నిర్వహణ మార్పుతో కంప్యూటరు ఆధారిత పరీక్ష (సీబీటి) ద్వారా నిర్వహించబడే వివిధ ఉద్యోగాలకోసం పెంచిన వేల రూపాయల అదనపు భారంతో తిరిగి దరఖాస్తు చేసుకున్న వారికి రాష్రంలోని జిల్లా కేంద్రాల్లో, పట్టణాలలో కంప్యూటరు కేంద్రాలు అందుబాటులోలేని కారణంగా దరఖాస్తుదారులందరినీ మొత్తంగా వందలాది కిలో మీటర్ల దూరంలో కేవలం హైదరాబాద్ పరిసర పట్టణాలలో కేటాయిస్తున్నారు.

వివిధ ఉద్యోగ పరీక్షలకోసం దూరంగా కేటాయింపపబడిన పరీక్ష కేంద్రాలకు ఉదయాన్నే సమయానికి చేరుకోవడానికి కుదరదని ఒకరోజు ముందుగానే వివిధ గ్రామాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల నుండి బస్సుల్లో, ఇతర వాహనాల్లో హైదరాబాద్‌కు చేరుకున్నదే తడవుగా రాత్రిళ్లు లాడ్జీలు, హోటళ్లలో బసచేసి మర్నాడు ఉదయాన్నే అక్కడి నుండి క్యాబ్‌లలో, ఆటోరిక్షాలలో, సిటీబస్సులలో ప్రయాణం చేసి గమ్యం చేరుకోవడానికి, పరీక్ష(లు) కొన్ని రోజులపాటు కొనసాగితే అక్కడే బసచేసి, అనంతరం తిరిగి తమ ఇళ్లకు చేరుకోవడానికి పడే పాట్లతోపాటు వేల రూపాయల అదనపు ఖర్చుభారం తడిసి మోపెడవుతుంది. తప్పని పరిస్థితుల్లో ఆడపిల్లలను, పిల్లల తల్లులను అంతదూరం ఒంటరిగా పంపలేక వెంట వెళ్తున్న తల్లిదండ్రులకు ఈభారం రెట్టింపవుతోంది. మొత్తానికి గతిలేక అందరూ కోట్ల రూపాయల అదనపు ఆర్థికభారాన్ని భరిస్తున్నారు.))

ఉచితంగా పరీక్షల నిర్వహణకై బడ్జెట్లో కేటాయింపులు..

నిరుపేద నిరుద్యోగుల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని, దీనిని ‘ప్రధాన సమస్య’గా భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణీత సమయంలో ఉద్యోగాల ప్రకటనలకు, వెనువెంటనే నియామకాలకు సంబంధించి నమ్మకాన్ని పెంచే ‘జాబ్ క్యాలెండర్’ను త్వరగా విడుదల చేసి, ప్రతి ఏడాది లక్షలాదిమంది వివిధ పోటీపరీక్షలు ఉచితంగా రాసేందుకు, వాటి నిర్వహణకు వారిపై అదనపు ఆర్థికభారం మోపకుండా, లక్షల కోట్ల బడ్జెట్లో ‘నిరుద్యోగుల సంక్షేమనిధి’ పేరిట ప్రత్యేకంగా నిధులను కేటాయించి, రాష్ట్రవ్యాప్తంగా వారందరికీ అందుబాటులో వివిధ జిల్లా కేంద్రాలలో, పట్టణాలలో కంప్యూటరు ఆధారిత పరీక్షాకేంద్రాల ఏర్పాటుకు అవసరమైన చర్యలపై ప్రత్యేకదృష్టి సారించాలి.

నంగె శ్రీనివాస్

ప్రిన్సిపాల్, విద్యా విశ్లేషకులు

94419 09191

Advertisement

Next Story