Wimbledon 2024 : మూడో రౌండ్‌ను కష్టంగా దాటిన అల్కరాజ్.. ప్రీక్వార్టర్స్‌కు అర్హత

by Harish |
Wimbledon 2024 : మూడో రౌండ్‌ను కష్టంగా దాటిన అల్కరాజ్.. ప్రీక్వార్టర్స్‌కు అర్హత
X

దిశ, స్పోర్ట్స్ : వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ జోరు కొనసాగుతోంది. ఈ డిఫెండింగ్ చాంపియన్ మెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. అయితే, మూడో రౌండ్‌ను అతను కష్టంగా దాటాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో అల్కరాజ్ 5-7, 6-2, 4-6, 7-6(7-2), 6-2 తేడాతో అమెరికా ప్లేయర్ ఫ్రాన్సిస్ టియాఫోపై పోరాడి గెలిచాడు. మూడు గంటల 50 నిమిషాలపాటు మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. అల్కరాజ్‌కు టియాఫో నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి మూడు సెట్లలో ఒక్కటి మాత్రమే నెగ్గి వెనుకడిన అల్కరాజ్ ఆ తర్వాత బలంగా పుంజుకున్నాడు. నాలుగో సెట్‌ను పోరాడి నెగ్గాడు. ప్రత్యర్థి సైతం తగ్గకపోవడంతో ఆ సెట్‌ను టై బ్రేకర్‌కు తీసుకెళ్లి మరి సొంతం చేసుకున్నాడు. ఇక, నిర్ణయాత్మక ఐదో సెట్‌లో అల్కరాజ్ పూర్తి ఆధిపత్యం చాటి మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. 4వ సీడ్ జ్వెరెవ్(జర్మనీ) మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్ అతను 6-2, 6-1, 6-4 తేడాతో మార్కోస్ గిరాన్(అమెరికా)పై విజయం సాధించాడు.

గాఫ్ జోరు

ఉమెన్స్ సింగిల్స్‌లో అమెరికా క్రీడాకారిణి, 2వ సీడ్ కోకో గాఫ్ ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. మూడో రౌండ్‌లో గాఫ్ 6-4, 6-0 తేడాతో సోనయ్ కర్తాల్(ఇంగ్లాండ్)ను చిత్తు చేసింది. మరోవైపు, ఇంగ్లాండ్ యువ సంచలనం ఎమ్మా రాడుకాను 9వ సీడ్ మరియా సక్కారి(గ్రీస్)కు షాకిచ్చింది. దూకుడుగా ఆడిన రాడుకను 6-2, 6-3 తేడాతో సక్కారిపై నెగ్గింది. ఆరు డబుల్ ఫౌల్ట్స్, 31 అనవసర తప్పిదాలతో సక్కారి మూల్యం చెల్లించుకుంది. 7వ సీడ్ జాస్మిన్ పావోలిని(ఇటలీ) 7-6(7-4), 6-1 తేడాతో ఆండ్రీస్కు(కెనడా)ను ఓడించి నాలుగో రౌండ్‌కు చేరుకుంది.

Next Story