లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఛార్జ్‌షీట్.. సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసులో ఛార్జ్‌షీట్‌‌

by Hajipasha |
లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఛార్జ్‌షీట్..  సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసులో ఛార్జ్‌షీట్‌‌
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ముంబై నివాసంపై ఏప్రిల్ 14న దుండగులు కాల్పులు జరిపిన వ్యవహారంపై ముమ్మరంగా దర్యాప్తు చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు సోమవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 1,735 పేజీల ఛార్జ్‌షీట్‌‌తో పాటు కేసు ఆధారాలకు సంబంధించిన మూడు వాల్యూమ్‌ల డాక్యుమెంట్లను ముంబైలోని ప్రత్యేక మకోకా కోర్టులో పోలీసులు సమర్పించారు. కేసు విచారణలో భాగంగా సేకరించిన 46 మంది సాక్షుల వాంగ్మూలాలు, సీఆర్పీసీ సెక్షన్ 164 కింద నమోదు చేసిన స్టేట్‌మెంట్‌లు, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద సేకరించిన నేరాంగీకార వాంగ్మూలాలను ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు. 22 పంచనామాలు, సాంకేతిక ఆధారాల సమాచారం కూడా అందులో ఉంది.

ఇప్పటికే జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సహా తొమ్మిది మంది నిందితుల పేర్లను ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. వీరిలో ఆరుగురు నిందితులు ఇప్పటికే అరెస్టు కాగా, ముగ్గురు పరారీలో ఉన్నారు. కెనడాలో నివసిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ సూత్రధారిగా వ్యవహరించి సల్మాన్ ఖాన్ హత్యకు కుట్రపన్నాడని క్రైం బ్రాంచ్ పోలీసులు అంటున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరపడానికి ముందు.. ఆ గ్యాంగ్ సభ్యులకు అన్మోల్ బిష్ణోయ్ దాదాపు రూ.3 లక్షల దాకా సమకూర్చాడని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed