దేశాయిపేట ఫిల్టర్‌ బెడ్లు అస్తవ్యస్తం.. అన్నీ రిపేర్లే!

by Shiva |
దేశాయిపేట ఫిల్టర్‌ బెడ్లు అస్తవ్యస్తం.. అన్నీ రిపేర్లే!
X

దిశ, వరంగల్‌‌ టౌన్: వరంగల్‌ మహా నగరంలోని దేశాయిపేట ఫిల్టర్‌ బెడ్‌ అందరికీ తెలిసిందే. ఇక్కడే నగరానికి అవసరమైన నీరంతా శుభ్రపరిచి సరఫరా చేస్తుంటారని అందరూ అనుకుంటున్నారు. నిజంగా జీడబ్ల్యూఎంసీ పరిధిలోని వరంగల్‌ రైల్వే గేట్‌ ఇవతలి ప్రాంతంతో పాటు 42 విలీన గ్రామాలకు ఇక్కడి నుంచే నల్లాల ద్వారా నీరు పంపిణీ చేస్తుంటారు. అయితే, ఆ నీరు పూర్తిస్థాయిలో శుభ్రం కావడం లేదనేది నగ్న సత్యం. 1984-85 కాలంలో నిర్మించిన ఈ ఫిల్టర్‌ బెడ్‌లో నెలకొన్న లోపాలు, జీడబ్ల్యూఎంసీ అస్తవ్యస్త పర్యవేక్షణ దుస్థితి ‘దిశ’ దినపత్రిక విజిట్‌లో వెలుగుచూశాయి.

పనిచేయని ఫిల్టర్లు..

1984-85లో రెండు వాటర్‌ టవర్లతో పాటు ఆరు ఫిల్టర్‌ బెడ్ల (ఓల్డ్‌)తో ఈ వ్యవస్థ ప్రారంభమైంది. ఆ తరువాత కాలంలో నగరం అవసరాలకు అనుగుణంగా మూడు ఒకసారి ‘అడుకో’ పేరుతో, మరో ఆరు ‘ఎన్‌సీసీ’ పేరుతో మరోసారి నిర్మించారు. ప్రస్తుతం 15 ఫిల్టర్‌ బెడ్లు దేశాయిపేట ఫిల్టర్‌ బెడ్‌ ఆవరణలో ఉన్నాయి. ఇందులో పనిచేసే బెడ్లు కొన్ని మాత్రమే. అవి కూడా నామమాత్రంగానే నీటిని శుద్ధి చేస్తున్నాయి. ఓల్డ్‌ బెడ్డులో వాటర్‌ టవర్లలో క్లీనింగ్‌ కోసం ఏర్పాటు చేసిన క్లారిఫై బ్రిడ్జీలు రెండింటికీ రెండూ పనిచేయడం లేదని తేటతెల్లమైంది. వాటిని సుమారు రూ.40 లక్షలతో గత ఆరేళ్ల కిందట అమర్చినట్లు తెలుస్తోంది. అయితే, అవి ఏర్పాటు చేసిన నాటి నుంచే పని చేయడం లేదని, విషయం తెలిసి కూడా అధికారులు ఊరుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుండగా క్లోరినేషన్‌ టవర్‌ కూడా కూలిపోయే దశకు చేరుకుంది. అలాగే అడుకో బెడ్‌లో ఆరు బెడ్లకు ఏర్పాటు చేసిన ఆరు కరెంట్ మోటార్లు కాలిపోయాయి. పనిచేయక రిపేరు దశలోనే ఉన్నట్లు స్పష్టమైంది. నీటి శుద్ధీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన మోటార్ల లక్ష్యాన్ని నీటికి వదిలారు. దీంతో అధిక భారం ఫిల్టర్లపై పడి ఆలంతో కలిసిన నీరే సంపులోకి నేరుగా వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఎన్‌సీసీ బెడ్డులోనూ ఇదే దుస్థితి నెలకొంది.

లాట్‌బుక్‌లో మాత్రం..

లాట్‌బుక్కులో ఫిల్టర్‌ బెడ్లను ఎప్పుడెప్పుడు క్లీనింగ్‌ చేస్తున్నారనేది నమోదు చేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేస్తున్న వివరాలు.. అక్కడి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉండడం విస్తుగొల్పుతోంది. కేవలం రికార్డుల కోసమే లాట్‌బుక్‌ నిర్వహిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.

12 ఏళ్లలో ఒక్కసారి కూడా..

ఓల్డ్‌ ఫిల్టర్‌ బెడ్‌కు అనుసంధానంగా ఒక సంప్‌ నిర్మించారు. అయితే ఆ సంప్‌ నేడు శిథిలావస్థకు చేరుకుంది. అది పనిచేయడం లేదని అందులో నుంచి మరో సంపులోకి నీటిని తరలిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నా నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇదే సంప్‌ పక్కన ఒక మోటార్‌ ఏర్పాటు చేశారు. ఈ మోటార్‌ 12 ఏళ్ల కింద పెట్టారట..! కానీ, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ మోటర్‌ పని చేసిన దాఖలాలు లేవని విశ్వసనీయ సమాచారం.

అడుగడుగునా సిబ్బంది నిర్లక్ష్యం..!

ఇక ఈ ఫిల్టర్‌ బెడ్‌ పర్యవేక్షణకు మూడు షిఫ్టుల్లో మొత్తం 24 మంది సిబ్బంది పని చేస్తున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక షిఫ్ట్‌కు 8 మంది విధుల్లో ఉండాల్సి ఉండగా, ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతా రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి సొంత పనులకు బయటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఫిల్టర్‌బెడ్లు రిపేరుకు చేరుకోవడంతో కేవలం ఆలం, క్లోరిన్‌ కలిపి నీటిని వదిలేస్తున్నారు. నామమాత్రంగా పని చేసే ఫిల్టర్‌ బెడ్ల ద్వారా అంతంతమాత్రంగానే శుద్ధి అవుతున్న నీటిని నగరానికి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు కూడా దీని నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసినట్లు సుస్పష్టంగా అర్థమవుతోంది. పైకి ఫిల్టర్‌ బెడ్లు అనుకుంటున్న ఈ వ్యవస్థ లోపలికి తొంగిచూస్తే గానీ అంతుచిక్కని రహస్యాలు బయటపడవు. మొత్తంగా అరకొరగా శుద్ధి చేస్తున్న ప్రతాపరుద్ర ఫిల్టర్‌బెడ్ల నిర్వహణను ఇప్పటికైనా జీడబ్ల్యూఎంసీ అధికారులు పట్టించుకుంటారా.. తాగిన వారే ఆసుపత్రుల పాలవుతారని మాకేంటని వదిలేస్తారా..? అనేది వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Next Story

Most Viewed