ఫుల్లు​పత్తి.. మెరిసిన తెల్లబంగారం..

by Sumithra |
ఫుల్లు​పత్తి.. మెరిసిన తెల్లబంగారం..
X

దిశ, వరంగల్‌ టౌన్ : ఈ సారి వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌కు సం‘పత్తి’ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తి దిగుబడి తగ్గుతుందని అంచనా వేసినా వరంగల్‌ మార్కెట్‌కు మాత్రం సరుకు వెలువెత్తుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి సీజన్‌ ప్రారంభం కాగా ఇప్పటికే 9లక్షల క్వింటాళ్ల పైచిలుకు సరుకు మార్కెట్‌ పరిధిలో వ్యాపారం సాగడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి 3 లక్ష క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. దాదాపు 6 లక్షల క్వింటాళ్ల వ్యత్యాసం ఉండడం వరంగల్‌ మార్కెట్‌కు పెరిగిన రాబడిని సూచిస్తోంది. గతేడాది డిసెంబర్‌ 18వ తేదీ నాటికి మార్కెట్‌ పరిధిలో 3,03,120 క్వింటాళ్ల పత్తి ఖరీదు జరిగింది. ఇందులో వ్యాపారస్తులు లూజు పత్తి కలుపుకుని 1,49,024 క్వింటాళ్లు, సీసీఐ 1,39,175 క్వింటాళ్ల మేర కొనుగోలు చేసింది.

ఈ ఏడాది డిసెంబర్‌ 18వ తేదీ నాటికి వ్యాపారస్తుల ద్వారా 1,93,260 క్వింటాళ్లు, సీసీఐ ద్వారా 7,45,580 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, మొత్తం ఇప్పటివరకు పత్తి కొనుగోళ్లు 9,38,841 క్వింటాళ్లకు చేరుకుంది. గత సీజన్‌లో పోలిస్తే ఈ సారి మూడు రెట్లు అధికంగా కొనుగోళ్లు జరిగాయి. ఇదిలా ఉండగా, గతేడాది సీజన్‌ పూర్తి నాటికి మార్కెట్‌ పరిధిలో మొత్తం కొనుగోళ్లు 9,22,268 క్వింటాళ్లుగా రికార్డులు చెబుతున్నాయి. అయితే, ఆ గణాంకాలను ఈ సారి సీజన్‌ రెండు నెలలు ముందుగానే అధిగమించింది. ఇప్పటికే 9,38,841 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌ పరిధిలో ఖరీదు చేపట్టగా, గత ఏడాది మొత్తం ఖరీదుతో పోలిస్తే దాదాపు 16వేల క్వింటాళ్లు అధికంగా కొనుగోళ్లు జరగడం మార్కెట్‌ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరో రెండు నెలలపాటు పత్తి సీజన్‌ ఉండడంతో ఈ సారి కొనుగోళ్లు మరింత రికార్డును సృష్టిస్తాయని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, మార్కెట్‌కు కూడా ఈసారి ఆదాయం రెట్టింపుగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed