దేవుని పడకల్ లో 50 పడకల ఆసుపత్రి ప్రారంభం..

by Sumithra |
దేవుని పడకల్ లో 50 పడకల ఆసుపత్రి ప్రారంభం..
X

దిశ, తలకొండపల్లి : ఒక రాజు కుటుంబంలో జన్మించిన మాధవన్ జీ గ్రామీణ ప్రాంతాలలోని రూరల్ డెవలప్మెంట్ కోసం బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి ఉచితంగా వైద్యం అందించాలనే తన ధృడ సంకల్పంతో సుమారు 40 సంవత్సరాల క్రితం నుండి ఆవేర్ మాధవన్ పేరుపైన స్వచ్ఛందంగా ఆసుపత్రులు నెలకొల్పారని డైరెక్టర్ జనరల్ రాజవర్ధన్ రెడ్డి అన్నారు. ఇలా సేవలు చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని ఆయన అన్నారు. ఉంటే మండలంలోని దేవుని పడకల్ గ్రామంలో శుక్రవారం కార్పొరేట్ స్థాయిలో 50 పడకల ఆసుపత్రిని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ జనరల్ రాజ వర్ధన్ రెడ్డి, తరుణ్, నాగేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేణుగోపాలరావు, చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ పవర్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుమ్మరి శంకర్, మాజీ సర్పంచ్ శ్రీశైలంలు హాజరై 50 పడకల ఆసుపత్రిని ఘనంగా ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిజి రాజవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఒక మారుమూల పల్లెటూరులో హైదరాబాద్ నగరంలో ఉండే కార్పొరేట్ స్థాయిని తలదన్నే విధంగా అన్ని హంగులతో 50 పడకల ఆసుపత్రి నెలకొల్పడం అంటే అంత ఆషామాషీ కాదని అన్నారు. చాలా డబ్బులతో కూడుకున్న వ్యవహారం అని, తెలిసి కూడా ఇక్కడి ప్రాంత ప్రజలకు అతి తక్కువ ధరలకు వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవడం మాటల్లో వర్ణించలేమని ఆయన అన్నారు. దేవుని పడకల్ గ్రామంలో 1977 సంవత్సరంలోనే ఇక్కడ మాధవన్ పేరుపైన ఆస్పత్రి నెలకొల్పారన్నారు. అదే ఆసుపత్రిని అంచలంచలుగా అభివృద్ధి చేయడంలో భాగంగా నేడు 50 పడకల ఆసుపత్రిగా మారడం ఇక్కడి ప్రజల అదృష్టంగా భావించాలని, స్థానిక నేతలందరూ సహకరించి ఆసుపత్రిని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం అందరి పై ఉందని ఆయన గుర్తు చేశారు. అనంతరం చీప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ పవార్ మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి మహానగరంలో నెలకొల్పితే రోజుకు లక్షల రూపాయల ఫీజులు తీసుకొని సంపాదించుకునే అవకాశం ఉందన్నారు.

అయినా కూడా అతను ఇక్కడి పేద, బడుగు బలహీన వర్గాలకు మానవత్వంతో కూడిన వైద్య సేవలు అందించడం కోసమే మాధవన్ జీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇక్కడి ప్రాంత పేద ప్రజల అదృష్టమని డాక్టర్ జగదీష్ పవర్ అన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లాంటి నగరానికి వెళ్లాలంటే చాలా డబ్బులతో కూడుకునే వ్యవహారమని, అన్ని రకాల వైద్య ప్రకారాలను ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మాధవన్ జీకి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేమని భావోద్వేగంతో మాట్లాడారు. 50 పడకల ఆసుపత్రిలో ఎక్స్రే, ఈసీజీ ఆల్ట్రా సౌండ్, స్కానింగ్, ల్యాబ్, గర్భిణీలకు డెలివరీ సమయంలో ఆపరేషన్ థియేటర్, ఐసీయూ లాంటి ఎన్నో రకాల సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పడకల్ మాజీ ఎంపీటీసీ రమేష్, మాజీ సర్పంచ్ శంకర్, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ కిషన్ నాయక్, రావిచేడు మాజీ సర్పంచ్ విట్టలయ్య గౌడ్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి, నాయకులు మల్లేష్, భగవతీపురం సూపర్వైజర్ వెంకన్న, లీగల్ అడ్వైజర్ నాగేశ్వరరావు, ఆయా గ్రామాల ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున అదరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed