సిద్ధమ‌వుతున్న క‌ళ‌ల క్షేత్రం.. శ‌ర‌వేగంగా కాళోజీ స్మార‌క‌ నిర్మాణం

by Mahesh |
సిద్ధమ‌వుతున్న క‌ళ‌ల క్షేత్రం.. శ‌ర‌వేగంగా కాళోజీ స్మార‌క‌ నిర్మాణం
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ప్రజాక‌వి కాళోజీ క‌ళాక్షేత్రం నిర్మాణం శ‌ర‌వేగంగా సాగుతోంది. సెప్టెంబ‌ర్ 9న కాళోజీ జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు కుడా చైర్మన్ వెంక‌ట్రామ్​రెడ్డి, జిల్లా క‌లెక్టర్లు, యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప‌నుల‌ను వేగంగా పూర్తి చేసేందుకు ఇటీవ‌ల రూ.45కోట్లను కూడా ప్రభుత్వం విడుద‌ల చేసింది. దీంతో ప‌నుల్లో జాప్యానికి చెక్ ప‌డింది. కుడా వైస్ చైర్​పర్సన్​ అశ్విని తానాజితో పాటు హ‌న్మకొండ జిల్లా క‌లెక్టర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంక‌ట్రాంరెడ్డి నిరంత‌రం ప‌నుల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు. ఈనెల 20లోపు ప‌నుల‌ను పూర్తి చేయాల‌నే ల‌క్ష్యం ముందు నిర్ణయించుకున్నా.. ప‌నుల‌ను పూర్తి చేయ‌డానికి ఈనెలాఖరు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అప్పుడు డెడ్ స్లో.. ఇప్పుడు స్పీడ‌ప్‌..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 సెప్టెంబర్​ 9న ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా హనుమకొండలో ఆయన పేరున కళాక్షేత్రం నిర్మించేందుకు గత సర్కార్ అడుగులు వేసింది. ఈ మేరకు 2014 సెప్టెంబర్ 9న అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాప‌న జ‌రిగిన అయితే క‌ళాక్షేత్రం నిర్మాణ ప‌నుల్లో తీవ్ర ఆటంకాలు నెలకొన్నాయి. నిధుల కొర‌త ప్రధాన స‌మ‌స్యగా మారింది. దీంతో తొమ్మిద‌న్నరేళ్లుగా కొన‌సాగుతూ వ‌చ్చాయి. ఏడాదిలోగానే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామని శంకు స్థాప‌న స‌మ‌యంలో స్వయంగా కేసీఆర్ వెల్లడించినప్పటికి.. ఆ త‌ర్వాత కళాక్షేత్రం నిర్మాణంపై పెద్దగా ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శల‌ను మూట‌గ‌ట్టుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే కాళోజీ క‌ళాక్షేత్రం నిర్మాణం పూర్తిపై దృష్టి పెట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులు కొండా సురేఖ‌, ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డిలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కుడా ఆధ్వర్యంలో జ‌రుగుతున్నందున చైర్మన్ ఇనుగాల వెంక‌ట్రాంరెడ్డి పూర్తి స‌మ‌యాన్ని ప‌నుల ప‌ర్యవేక్షణ‌కే కేటాయిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఎలాగైనా సెప్టెంబర్ 9న సీఎం చేతుల మీదుగా క‌ళాక్షేత్రాన్ని ప్రారంభింప‌జేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

కళాక్షేత్రం నిర్మాణ స్వరూపం..!

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం 4.5 ఎకరాల విస్తీర్ణంలో 12,990 చ.మీ. (1,39,823 చ.అ) వైశాల్యంతో నిర్మిస్తున్నారు. జీ ప్లస్‌ 4 నిర్మిస్తున్న ఈ కళాక్షేత్రం మొదటి దశలో భవనం సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం, రెండో దశలో ఇంటీరియర్‌, మెకానికల్‌, ఎలక్ర్టికల్‌ పనులు, మూడో దశలో ల్యాండ్‌ స్కేపింగ్‌, పాథ్‌ వే, పార్కింగ్‌ ఇతరత్రా పనులు చేపట్టారు. మొదటి అంతస్తులో బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌ల్లో ఆర్ట్‌ గ్యాలరీ, ఆడిటోరియం, రిహార్సల్స్‌ రూం, గ్రీన్‌ రూం, లాబీ, మొదటి అంతస్తులో ఆర్టియం, ప్రీ ఫంక్షన్‌ ఏరియా, ఆఫీసు గదులు, ఫుడ్‌ కౌంటర్‌, స్టోర్‌ రూమ్స్‌, వాష్‌ రూమ్స్‌.రెండో అంతస్తులో గ్రంథాలయం, ఆఫీసు, స్టోర్స్‌, లాబీ, వాష్‌ రూములు, మూడు, నాలుగో అంతస్తుల్లో ప్రీ ఫంక్షన్‌ లాబీ, బాల్కనీ, టెర్రస్‌, క్యాట్‌వాక్‌ లాబీ ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు 1,000 మంది కూర్చునే సామర్థ్యంతో మూడు ఎకరాల స్థలంలో అత్యాధునిక ఆడిటోరియంతో కూడిన కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. కళలు, సాంస్కృతిక కళా ప్రదర్శలనకే కాకుండా వివాహాలు, ఇతర కార్యక్రమాలు, సమావేశాలకు కూడా ఉపయోగపడేలా నిర్మించారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రజలు దీనిని అద్దెకు తీసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు.

Advertisement

Next Story

Most Viewed