న‌త్త‌న‌డ‌క‌న కేయూ భూ స‌ర్వే..ఐదు రోజులుగా కొన‌సాగ‌ని విజిలెన్స్ స‌ర్వే

by Aamani |
న‌త్త‌న‌డ‌క‌న కేయూ భూ స‌ర్వే..ఐదు రోజులుగా కొన‌సాగ‌ని విజిలెన్స్ స‌ర్వే
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : కాక‌తీయ యూనివ‌ర్సిటీలో సాగుతున్న‌ భూ స‌ర్వే స్లోగా సాగుతోంది. యూనివ‌ర్సిటీలో జ‌రిగిన భూ ఆక్ర‌మ‌ణ‌లు, అక్ర‌మాల లెక్క తేల్చేందుకు విజిలెన్స్ విచార‌ణ‌కు ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈనేప‌థ్యంలో కొద్ది రోజుల క్రితం విజిలెన్స్ ఇన్‌స్పెక్ట‌ర్ రాకేష్ ఆధ్వ‌ర్యంలో హ‌న్మ‌కొండ మండ‌ల స‌ర్వేయ‌ర్ రాజేష్‌, కేయూ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ వాసుదేవ‌రెడ్డితో పాటు జీడ‌బ్ల్యూఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు భూ స‌ర్వేలో పాల్గొంటున్నారు.

వ‌ర్సిటీ చుట్టూ హ‌ద్దులు ఏర్పాటు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఏర్పాటు చేసిన విజిలెన్స్ బృందం ఐదు రోజులుగా స‌ర్వేను ప‌క్క‌న పెట్టేసింది. 229 స‌ర్వే నెంబ‌ర్‌లో మాత్ర‌మే స‌ర్వేను పూర్తి చేసిన బృందం 214, 215, 216,235, 412 413, 414, 415 స‌హా మ‌రికొన్ని స‌ర్వే నెంబ‌ర్ల‌లో అక్ర‌మాల‌ను ప‌రిశీలించాల్సి ఉంది. ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించి మార్కింగ్ చేయాల్సి ఉంది. అయితే బృందంలో ప‌నిచేస్తున్న స‌ర్వే అధికారికి, టౌన్ ప్లానింగ్ అధికారుల‌కు, సిబ్బందికి ఇత‌ర విధులు కేటాయిస్తుండ‌టంతో కేయూలో జ‌రుగుతున్న భూ స‌ర్వేకు ప్ర‌ధాన ఆటంకంగా మారిన‌ట్లు స‌మాచారం.

229లో అక్ర‌మాల‌పై యాక్ష‌న్ స్టార్ట్‌..?!

229 స‌ర్వే నెంబ‌ర్‌లో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లుగా గుర్తించిన విజిలెన్స్ బృందం.. నిర్మాణాల‌కు మార్కింగ్ కూడా ఇచ్చారు. దాదాపు ఎక‌రం ప‌ది గుంట‌ల వ‌ర‌కు క‌బ్జా జ‌రిగిన‌ట్లుగా ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో స‌ర్వే బృందం హ‌న్మ‌కొండ‌ మండ‌ల త‌హ‌సీల్దార్ కార్యాల‌యానికి నివేదిక కూడా అంద‌జేశారు. త‌హ‌సీల్దార్ కార్యాల‌యం నుంచి యూనివ‌ర్సిటీ రిజిస్ట్రార్ కార్యాల‌యానికి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం రిపోర్టు చేరింది. ఈ రిపోర్టు ఆధారంగానే 229 స‌ర్వే నెంబ‌ర్‌లోని నిర్మాణాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా జీడ‌బ్ల్యూఎంసీ క‌మిష‌న‌ర్‌కు కేయూ రిజిస్ట్రార్ మ‌ల్లారెడ్డి లేఖ రాశారు. తాజా ప‌రిణామాల‌తో 229 స‌ర్వే నెంబ‌ర్‌లో అక్ర‌మ నిర్మాణాలుగా తేల్చిన వాటిని కూల్చే అవ‌కాశం ఉంది. త‌మ నిర్మాణాల‌ను కూల్చివేయ‌కుండా నిలుపుదల చేయాలంటూ హైకోర్టుకు వెళ్ల‌గా.. రిపోర్టు ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోవాలంటూ న్యాయ‌స్థానం కూడా స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో అక్ర‌మ నిర్మాణాల‌పై చ‌ర్య‌లు తీసుకుని.. కేయూ భూమిని ప‌రిర‌క్షించాల‌నే డిమాండ్ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేత‌లు, కేయూ అధికారులు, కేయూ అధ్యాప‌క సంఘాల నుంచి బ‌లంగా వినిపిస్తోంది.

క‌బ్జాల చెర విడిపించేందుకు జాప్య‌మెందుకు...?

వరంగల్‌లో కాకతీయ యూనివర్సిటీని 1976లో ఏర్పాటు చేశారు. అప్పుడు వర్సిటీ కోసం కుమారపల్లిలో 188.28ఎకరాలు, లష్కర్‌ సింగారంలో 309.20 ఎకరాలు, పలివేల్పుల శివారులో 175.14ఎకరాల చొప్పున 673.12 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే, ప్రధాన రహదారి వెంట మాత్రమే ప్రహరీ నిర్మించారు. వెనుక భాగంలో గోడ లేకపోవటంతో పలివేల్పుల, డబ్బాల ఏరియా, ముచ్చర్ల రోడ్డు వైపు ఉన్న భూముల్లో చాలా వరకు వర్సిటీ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, రౌడీషీటర్లు, పోలీసు అధికారులు దొరికినంత కబ్జాలు చేసుకున్నారు. సర్వే నంబరుకు బై నంబర్లు, వేరే అదనపు నంబర్లు వేసుకుని రికార్డుల్లో మార్పు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2021లో అప్పటి కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం(డీజీపీఎస్‌) ద్వారా వర్సిటీ భూములను సర్వే చేయించారు. అయితే 622.2 ఎకరాల భూములే లెక్కలోకి వస్తున్నాయి. సుమారు 51 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. ఇందులో 229, 234, 412, 413, 414 సర్వే నంబర్లతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో భూములు కబ్జా అయినట్టు తేలింది.

అయితే క‌బ్జాల ప‌ర్వంపై విచార‌ణ ద్వారా చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో మాత్రం జాప్యం జ‌రుగుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. గ‌తంలో జ‌రిగిన స‌ర్వే, విచార‌ణ‌లో కేయూ ఉద్యోగి అశోక్‌తో పాటు మరో ఇద్దరు, కొంతమంది పోలీసు అధికారులు, రౌడీషీటర్లు, రాజకీయ నాయకులు కలిసి మొత్తం 19 మంది అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. అయితే వీరికి నోటీసులు జారీ చేసి వ‌దిలేసిన వ‌ర్సిటీ అధికారులు.. నిర్మాణాల కూల్చివేత‌ల జోలికి మాత్రం వెళ్ల‌లేదు. తాజాగా మ‌రోసారి క‌బ్జాల వ్య‌వ‌హారంపై విద్యార్థి, కేయూ అధ్యాప‌క సంఘం నుంచి ఫిర్యాదులు వెళ్ల‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఉంది. ఈనేప‌థ్యంలో గ‌తంలో యూనివ‌ర్సిటీ ల్యాండ్ క‌మిటీ ఇచ్చిన రిపోర్టును కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూ విజిలెన్స్ టీం ముందుకెళ్తోంది. ఈ సారైనా చ‌ర్య‌లు తీసుకుంటారా..? లేదా అట‌కెక్కిస్తారో వేచి చూడాలి.

Next Story

Most Viewed