సీఎం కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి పోటీ.. తేల్చేసిన విజయశాంతి

by Javid Pasha |   ( Updated:2023-10-18 05:09:20.0  )
సీఎం కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి పోటీ.. తేల్చేసిన విజయశాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ నేతలందరూ పోటీకి సిద్దమవుతున్నారు. ఒక పార్టీలో సీటు దక్కకపోతే వేరే పార్టీలో చేరి మరీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తోన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బరిలోకి దిగాలనే ఆలోచనలో ఆశావాహులు ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ 55 మందితో తొలి జాబితాను ప్రకటించగా.. త్వరలోనే రెండు జాబితాను కూడా విడుదల చేయనుంది. ఇక బీజేపీ కూడా అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టింది.

బీజేపీలో సీనియర్ నాయకురాలిగా ఉన్న విజయశాంతి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ క్రమంలో పోటీపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తన ఉద్దేశం కానప్పటికీ వ్యూహాత్మక నిర్ణయాలు ఎన్నడైనా పార్టీ నిర్దేశితమే అన్నది సత్యమైన వాస్తవమని ట్విట్టర్‌లో తెలిపారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేయాలని తనను కార్యకర్తలు అడగడం తప్పు కాదని అన్నారు.

బీఆర్ఎస్‌పై పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కి తగ్గదనేది కార్యకర్తల విశ్వాసమని విజయశాంతి ట్వీట్ చేశారు. నేడు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుండగా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల అభ్యర్థుల ప్రకటనపై నిర్ణయం తీసుకోనుంది. అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఖరారు చేయగా.. ఇవాళ ఆమోదం తెలపనున్నారు. దీంతో బుధవారం రాత్రి లేదా గురువారం తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నారని తెలుస్తోంది. దాదాపు 40 సీట్లు మహిళలకు కేటాయించాలని బీజేపీ చూస్తోంది. ఈ క్రమంలో విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed