Maoist Warning: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక.. పద్ధతి మార్చుకోకపోతే..

by Shiva |   ( Updated:2024-11-02 10:30:35.0  )
Maoist Warning: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక.. పద్ధతి మార్చుకోకపోతే..
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA)కు మావోయిస్టులు (Maoists) హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ (Gaddam Vinod), ఆయన పీఏ ప్రసాద్‌ (PA Prasad)కు వార్నింగ్ ఇస్తూ.. భారత మావోయిస్టు పార్టీ (మావోయిస్టు) సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ (Prabhath) పేరిట లేఖ విడుదలైంది. ఈ మేరకు ఆ లేఖలో బెల్లంపల్లి ఏరియాలో ఎమ్మెల్యే అతడి అనుచరులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు.

చెరువులు, కుంటలను కూడా వదలిపెట్టడం లేదని ఫైర్ అయ్యారు. అదేవిధంగా ఎమ్మెల్యే అనుచరుల అక్రమ వసూళ్లపై వారు సీరియస్ అయ్యారు. కబ్జాలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో పాటు పీఏ ప్రసాద్ కూడా బాధ్యత వహించాలని లేఖలో తెలిపారు. నాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కబ్జాలకు రుచి మరిగిన కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ అదే దందాకు తెర లేపారని ఆరోపించారు. అక్రమించిన భూములను పేద ప్రజలు, కార్మికులు, నిరుపేద రైతు కూలీలకు పంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని.. లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని మావోయిస్టులు (Maoists) వార్నింగ్ ఇచ్చారు.

కాగా, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టులు (Maoists) లేఖను విడుదల చేశారు. గత ప్రభుత్వం హయంలో దళిత బంధు (Dalith Bandhu) పేరిట ప్రజల సొమ్మును బీఆర్ఎస్ (BRS) నేతలు తినేశారని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామని రూ.లక్షల వసూలు చేశారని ఆరోపించారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి వారికి ఇవ్వకపోతే కఠిన శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది.

Advertisement

Next Story