కమిషన్ ముందుకు వెదిరె శ్రీరామ్..!

by Shiva |
కమిషన్ ముందుకు వెదిరె శ్రీరామ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సలహాదారు, నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరామ్ నుంచి జస్టిస్ పినాకి చంధ్రఘోష్ కమిషన్ కొన్ని వివరాలను తెలుసుకోవాలనుకుంటోంది. సాగు నీటిపారుదల రంగంలో అనుభవం ఉన్న ఆయన ఇటీవల వెల్లడించిన అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ఆయనను కోరింది. ఈ నెల 12న లేదా 15న కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా రిక్వెస్టు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులపై వివిధ రిపోర్టుల్లో ఇప్పటివరకు ఆయన వెల్లడించిన వివరాలతోపాటు ఆయన అభిప్రాయాలను అందజేయాలంటూ లేఖ రాసింది.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు పలు రకాల అనుమతులు ఇచ్చిన కేంద్ర జల సంఘం, ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనలో పాలుపంచుకున్న ‘వ్యాప్కోస్’ ప్రతినిధులను కూడా విచారించడానికి కమిషన్ సిద్ధమవుతున్నది. ఇంకా రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మాజీ కార్యదర్శులను కూడా కమిషన్ త్వరలో విచారణకు పిలవనున్నది. ప్లానింగ్ మొదలు డిజైనింగ్, విధాన నిర్ణయాలు, పర్యవేక్షణ తదితర పలు దశల్లో వీరు భాగస్వాములుగా ఉన్నందున ఆ వివరాలను వీరి నుంచి రాబట్టనున్నది. త్వరలోనే వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తొలుత ఎలా జరగాల్సి ఉన్నది, ఏం జరిగింది, ఇంకా ఏం జరిగితే బాగుండేది, అనుకున్న లక్ష్యాల్లో కానివేంటి, ఇప్పుడు చేయాల్సిందేంటి ఇలాంటి వివరాలన్నింటినీ వారి నుంచి కమిషన్ రాబట్టనున్నది.

అసంపూర్తిగా నిపుణుల కమిటీ నివేదిక

కమిషన్ నియమించుకున్న నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై జస్టిస్ పినాకి ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని వారికి సూచించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు కావాల్సిన వివరాలు లభ్యం కాకపోవడంతో వాటిని నివేదికలో పొందుపర్చలేకపోయినట్లు నిపుణుల కమిటీ కమిషన్ కు వివరించినట్లు తెలిసింది. అవసరమైన డాక్యుమెంట్లన్నింటినీ నిపుణుల కమిటీకి అందజేయాల్సిందిగా త్వరలోనే కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాయనున్నది.

కమిషన్ ముందుకు డీఈఈలు

మూడు బ్యారేజీలు, మూడు పంప్‌హౌజ్‌లకు సంబంధించిన టెక్నికల్ వివరాలను కమిషన్‌కు చెప్పేందుకు ఇరవై మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు మంళవారం జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో సమావేశమయ్యారు. వారు వెల్లడించిన వివరాలను అఫిడవిట్ల రూపంలో ఈ నెల 16 లోగా సమర్పించాలని కమిషన్ వారిని ఆదేశించింది. మూడు బ్యారేజీలకు జరిగిన నష్టాన్ని ఎంక్వయిరీ చేయడంలో భాగంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కూడా బుధవారం విచారణకు హాజరుకానున్నారు.

ఇంకా పలు అంశాలపై ఎంక్వయిరీ

కమిషన్ ఇప్పటివరకు చేసిన ఎంక్వయిరీలో భాగంగా మూడు బ్యారేజీల్లో ఒకదాన్ని నిర్మించిన కాంట్రాక్టు సంస్థలో అప్పటివరకూ పనిచేసి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో విభేదించి ఒక కీలకమైన వ్యక్తి బయటకు వెళ్లిపోయినట్లు కమిషన్ నిర్ధారణకు వచ్చింది. ఆయనతోపాటు కలిసి పనిచేసిన ఇతరులను కూడా ఇకపైన విచారణకు పిలిచే అవకాశమున్నది. కేంద్ర జల సంఘం, ‘వ్యాప్కోస్’ ప్రతినిధులతోపాటు ఎన్డీఎస్ఏ, పూణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చి స్టేషన్ నిపుణులను కూడా ఎంక్వయిరీ చేయనున్నది. టెక్నికల్ అంశాలపై దాదాపుగా ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చిన కమిషన్.. మూడు బ్యారేజీల నిర్మాణంలో కొందరు సబ్ కాంట్రాక్టర్లు చేరినట్లు గ్రహించింది. దానికి సంబంధించిన ఆధారాలను సైతం సేకరించింది.

ఆర్థిక అంశాలపై..

ఆర్థిక అంశాలపై విచారణను ప్రారంభించే సమయానికి దీనికి సంబంధించి ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి వివరాలను తీసుకోవడంతోపాటు ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు, జరిగిన పేమెంట్స్ తదితరాలపై కమిషన్ ఆరా తీయనున్నది. ఆ సమయంలో వివరాలు వెలుగులోకి రానిపక్షంలో ఈ సబ్ కాంట్రాక్టుల ఆధారాలను చూపించి వారిని కూడా ఎంక్వయిరీకి పిలిచే అవకాశమున్నది. ఇంకోవైపు కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులను కూడా కమిషన్ త్వరలో కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో వారికున్న సంబంధం తదితరాలపై ఆరా తీయనున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed