అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2023-10-13 17:35:05.0  )
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లోనూ అంబర్ పేటను వదలబోనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ సారి.. అక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు శుక్రవారం అంబర్ పేట నియోజకవర్గ బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల సమాయత్తంపై ఆయన వారితో చర్చించారు. కాగా వచ్చే ఎన్నికల్లో తాను అంబర్ పేట నుంచి పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. అంబర్ పేట నియోజకవర్గ బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, ముఖ్య నేతలతోనే కాకుండా ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న ఆశావహులతోనూ కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ అయ్యారు.

ఎవరికి సీటు వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కిషన్ రెడ్డి అక్కడి నేతలను కోరారు. దీంతో ముషీరాబాద్ నుంచి లక్ష్మణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోరనే సంకేతాలు ఇచ్చారని కమలనాథులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా దాదాపు 70 స్థానాలకు చెందిన అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Next Story

Most Viewed