అక్కడ ఫ్లైఓవర్లు వేసి అభివృద్ధి అంటే ఎలా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Vinod kumar |
అక్కడ ఫ్లైఓవర్లు వేసి అభివృద్ధి అంటే ఎలా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీలో రోడ్లు, ఫ్లైఓవర్లు వేసి అభివృద్ధి అనుకుంటే ఎలా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అసలైన హైదరాబాద్ ను ఎప్పుడు డెవలప్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. అసలైన హైదరాబాద్ అంటే నల్లకుంట, అంబర్ పేట, గౌలిపుర, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్ బస్తీలు అని ఆయన వెల్లడించారు. అంబర్ పేట నల్లకుంటలోని పాత రామాలయం బస్తీలో జరుగుతున్న నాలా పనులను ఆయన ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నిధులు లేక హైదరాబాద్ బస్తీల్లోని పనులు కుంటు పడుతున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి లక్షల కోట్ల ఆదాయం వస్తున్నా బడ్జెట్ లో కేవలం రూ.30 కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. దీనివల్ల బస్తీల్లో మౌలిక వసతుల కల్పన కుంటుపడుతోందని ధ్వజమెత్తారు. మూసీలో కలిసే నాలా వర్షాకాలంలో ఓవర్ ఫ్లో అవ్వడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.


తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు, స్లాబ్ వేయించానని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. భవిష్యత్తులో వర్షాలు ఎక్కువగా పడితే బస్తీలో చిన్న లైన్స్ వల్ల ఇళ్లల్లోకి నీరు చేరిపోయే ప్రమాదముందని, దీనికి ప్రత్యామ్నాయంగా మెయిన్ రోడ్డు వెంట డ్రైనేజీ తీసుకెళ్లి మూసీలో కలపాలని అనేకసార్లు కోరినా జీహెచ్ఎంసీలో నిధులు లేక పనులు ఆలస్యమవుతున్నట్లుగా చెప్పారు. హైదరాబాద్ లో చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం చేరుకుందని ధ్వజమెత్తారు.

అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్ పేట, సికింద్రాబాద్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహారాష్ట్రలో శిథిలమైన శివాజీ కోటలను బాగు చేయాలని అక్కడి సీఎం షిండేను ఆయన కోరారు. అందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ప్రధాని మోడీ సైతం ఆదేశించారని వెల్లడించారు.

నేటి నుంచి 'ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ'..

యువతలో క్రీడా స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా ఖేలో తెలంగాణ, జీతో తెలంగాణ పేరుతో వారం రోజుల పాటు జరిగే క్రీడా పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నిజాం కాలేజీలో గ్రాండ్ లో సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించనున్నారు. క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ప్రారంభోత్సవానికి తరలిరానున్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో సాగే ఈ పోటీల్లో 578 టీమ్ లు పోటీ పడనున్నాయి. స్త్రీ, పురుషుల విభాగాల్లో కబడ్డీ, క్రికెట్, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్ వంటి పోటీలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ప్రారంభోత్సవానికి గెస్ట్ ఆఫ్ హానర్ గా ఇండియన్ వెయిట్ లిఫ్టర్, అర్జున్ అవార్డు గ్రహీత కరణం మల్లీశ్వరి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, సినీ ఇండస్ట్రీ నుంచి నటులు సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, నటి శ్రీలీలా హాజరుకానున్నారు.

Advertisement

Next Story