కల్వకుంట్ల ఫ్యామిలీకి ఆస్కార్, నోబెల్ ఇవ్వొచ్చు.. కేసీఆర్‌ది దద్దమ్మ సర్కార్: Kishanreddy

by Satheesh |   ( Updated:2023-10-05 15:40:15.0  )
కల్వకుంట్ల ఫ్యామిలీకి ఆస్కార్, నోబెల్ ఇవ్వొచ్చు.. కేసీఆర్‌ది దద్దమ్మ సర్కార్: Kishanreddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అభద్రతా భావంలో పడిందని, ఆ కుటుంబం ప్రగతి భవన్‌లో ఉండేది కేవలం ఇంకో 2 నెలలు మాత్రమేనని, ఆ తర్వాత పూర్తిగా ఫాంహౌజ్‌కు వెళ్లాల్సిందేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా నది జలాలు, పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీపై ఒకేరోజు కేబినెట్‌లో ఆమోదం పొందడం సంతోషకరమని వెల్లడించారు. కానీ కొందరు దీన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. సమస్యలు పరిష్కరించాలని మోడీ ప్రయత్నిస్తున్నారని, అందుకే కేబినెట్‌లో ఒకేరోజులో వీటికి ఆమోద ముద్ర పడిందని వెల్లడించారు.

మోడీ తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవించి ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క, సారలమ్మ పేరును పెట్టారని తెలిపారు. అదే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా వారిని మోసం చేస్తోందన్నారు. గిరిజన వర్సిటీకి స్థలం కేటాయించకుండా తాత్సారం చేస్తోందని ధ్వజమెత్తారు. వాళ్ళు ఇవ్వకపోయినా త్వరగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోందని వెల్లడించారు. మరో 50 ఎకరాల స్థలానికి సంబంధించిన అంశం పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. అద్దాల మేడలో కూర్చుని రాళ్లను విసిరితే వారి అద్దాలే పగులుతాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. మాటలే తప్ప చేతకాని దద్దమ్మ సర్కార్ కేసీఆర్‌ది అని విరుచుకుపడ్డారు. అబద్దాలు ఆడటం.. ప్రజలను మభ్య పెట్టడంలో కల్వకుంట్ల కుటుంబం ఫస్ట్ ప్లేస్‌లో ఉందని, ఈ కుటుంబానికి ఆస్కార్, నోబెల్ ఇవ్వవచ్చని ఆయన ఎద్దేవా చేశారు.

కృష్ణా ట్రిబ్యునల్ మీద కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో కాళ్ళు బార్ల చాపుకుని కూర్చుంటారు తప్ప.. ప్రజలకు మంచి చేద్దామని లేదని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి అధికారం తలకెక్కిందని, మోడీ వచ్చి ఇక్కడ చేసేదేంటి? అని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్‌కు వచ్చారని, అక్కడికి రావడానికి కేసీఆర్‌కు 10 నిమిషాలు కూడా పట్టదని, కానీ ఆయన రాలేదన్నారు. మోడీ ఢిల్లీ నుంచి వచ్చినా కేసీఆర్ రాడని మండిపడ్డారు. బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై హామీ ఇచ్చింది బీఆర్ఎస్సేనని ఆయన వెల్లడించారు.

రూ.35 వేల కోట్లతో.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి, బీఆర్ఎస్ నిర్లక్ష్యం, అశ్రద్ధ కారణంగా, కమీషన్ల కోసం రూ.57 వేల కోట్లకు వ్యయం పెంచారని విమర్శించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు ఎన్ని నిధులు ఇచ్చారు.. ఆసిఫాబాద్‌కు, ఇతర మారుమూల ప్రాంతాలకు ఎంత కేటాయించారని ఆయన ఫైరయ్యారు. వంకర మనుషులు.. వంకరగానే.. మాట్లాడుతారని కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా కంటోన్మెంట్‌లో కాంగ్రెస్‌కు 10 ఎకరాల స్థలం కేటాయించారని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని చెప్పేందుకు ఈ చిన్న ఉదాహరణ చాలని, ఇలాంటివి చాలానే ఉన్నాయన్నారు.

రేపు బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్

బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్‌ను శుక్రవారం ఘట్ కేసర్‌‌లో నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఘట్ కేసర్ విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శుక్రవారం ఉదయం 9:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగాబీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నట్లు స్పష్టంచేశారు. చాలా ఏండ్ల తర్వాత కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మూలాల నుంచి సుమారు 1000 మంది ముఖ్య నాయకులు ఈ మీటింగ్‌కు వస్తున్నాన్నారు. జేపీ నడ్డా ఈ మీటింగును ప్రారంభిస్తారన్నారు. వచ్చే ఎన్నికలకు గాను పలు చర్చలు, తీర్మానాలు, అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణ రూపొందించుకోనున్నట్లు చెప్పారు.

స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ఎజెండాపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంచార్జీలతో భేటీ అయ్యామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 10వ తేదీన అమిత్ షా తెలంగాణకు వస్తున్నారని, ఆదిలాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో అగ్ర నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించే సభలపై నడ్డా సమక్షంలో చర్చించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణకు ముఖ్య నేతలంతా వస్తారని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షా 10, 27 తేదీల్లో వస్తారని, 10న ఆదిలాబాద్, 27న కుత్బుల్లాపూర్ లేదా రాజేంద్రనగర్‌లో నిర్వహించే సభలకు హాజరవుతారన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈనెల 20, 21 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారన్నారు.

హైదరాబాద్‌కు చేరుకున్న నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు చేరుకున్నారు. గురువారం రాత్రి చేరుకున్నారు. శంషాబాద్ నొవాటెల్ హోటల్ బస చేశారు. అనంతరం ఆయన కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్‌తో సమావేశమయ్యారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, మోడీ మీటింగ్ ఇంపాక్ట్, పార్టీ నేతల పనితీరు, ఎన్నికలకు రచించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఆయన శుక్రవారం వీబీఐటీ కళాశాలలో నిర్వహించే బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

అక్కడి నుంచే రాబోయే ఎన్నికల బ్లూ ప్రింట్ సిద్ధం చేయనున్నారు. అలాగే ఈ మీటింగులో గిరిజన వర్సిటీ, పసుపు బోర్డు, కృష్ణా నది జలాలపై అభినందన, రాజకీయ తీర్మానాలపై చర్చ, ఆపై ఆమోదించనున్నారు. అంతేకాకుండా ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధం చేయడంతో పాటు నేతలకు సమాయత్తంపై నడ్డా దిశా నిర్దేశం చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed