- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
10 ఎకరాలు కావాలి.. సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సంగీత అకాడమీ ఏర్పాటుకు 10 ఎకరాల అనువైన స్థలాన్ని కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రాంతీయ సంగీత నాటక అకాడమీ నిర్మాణానికి సహకరించాలని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో 10 ఎకరాల భూమిని కేటాయించాలన్నారు. సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సంస్కృతుల వారసత్వాన్ని పరిరక్షించేందుకు ముందుకురావాలని ఆయన సూచించారు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్‌కు రాసిన లేఖ ద్వారా పేర్కొన్నారు. కాకతీయుల కాలంలో ఎంతో ప్రాభవాన్ని పొందిన పేరిణి శివతాండవం, గొల్ల సుద్దులు, ఒగ్గు కథలు, గోత్రాలు, చిందుభాగవతం వంటి సాంప్రదాయ కథా ప్రదర్శనలు వంటివి ఎంతో ప్రసిద్ధిగాంచాయని కిషన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో పెద్దఎత్తున ఉన్న గిరిజన ప్రజల మూలంగా గుసాడి, లంబాడీ, మయూరి, దింసా వంటి నృత్యరూపాలను ప్రదర్శించే అవకాశం కూడా లభించిందని గుర్తుచేశారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంగీత, నాటక అకాడమీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, దేశంలోని వివిధ కళలను ప్రదర్శించటంలో అత్యున్నత స్థానంలో ఉందన్నారు. సంగీతనాటక అకాడమీ ప్రస్తుతం ఇంఫాల్‌లో జవహర్ లాల్ నెహ్రూ మణిపూర్ డ్యాన్స్ అకాడమీ, ఢిల్లీలో కథక్ కేంద్రం అనే రెండు రాజ్యాంగ విభాగాలను కలిగి ఉందన్నారు.
ఈ రాజ్యాంగ విభాగాలు కాకుండా అకాడమీ ప్రస్తుతం 5 కేంద్రాలను కలిగి ఉన్నట్లు ఆయన లేఖలో ప్రస్తావించారు. కాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గొప్ప సాంస్కృతిక వారసత్వానికి మరింత ప్రచారం కల్పించటానికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌లో సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 10 ఎకరాల భూమిని గుర్తించి, కేటాయించాలని కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించారు.