Kishan Reddy: తెలంగాణకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చాం

by GSrikanth |   ( Updated:2023-06-17 13:49:53.0  )
Kishan Reddy: తెలంగాణకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు కేటాయించాల్సిన నిధుల కంటే ఎక్కువ మొత్తమే ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ‘రిపోర్ట్ టు పీపుల్’ పేరిట శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. తొమ్మిదేండ్ల మోడీ పాలనలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులపై కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఇది మొదలు మాత్రమేనని పిక్చర్ అభీ బాకీ హై అంటూ బీఆర్ఎస్ సర్కార్‌ను హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా రిపోర్ట్ టు పీపుల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచారన్నారు. ఈ తొమ్మిదేండ్లలో కేంద్రం నుంచి.. రాష్ట్రానికి రూ.1.60 లక్షల కోట్లు అదనంగా అందించినట్లు స్పష్టం చేశారు. 2014 నుంచి వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.5 లక్షల కోట్లు రూపాయలు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక పెద్దపల్లి మినహా అన్ని జిల్లాలకు నేషనల్ హైవేల అనుసంధానం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వీటి కోసం రూ.1 లక్షా 8 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేసిందన్నారు. హైదరాబాద్‌కు గేమ్ ఛేంజర్‌గా కానున్న రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అనుమతించిందన్నారు. దీనికి సంబంధించిన భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు చేశారు. రైల్వేశాఖలో చూసుకుంటే ఇప్పటి వరకు తెలంగాణలో రూ.37 వేల కోట్లకు పైగా రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు చేసినట్లు చెప్పారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ఆలస్యమైందన్నారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీంతో 3వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

ఇదిలా ఉండగా భూ సేకరణ కారణంగా వరంగల్, కొత్తగూడెం విమానాశ్రయాల ఏర్పాటుకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. హైదారాబాద్‌లో సివిల్ ఏవియేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 11 ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రికిషన్ రెడ్డి తెలిపారు. రూ.1,998 కోట్లతో రామగుండంలో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇచ్చే ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇది పూర్తయితే రానున్న రోజుల్లో పైప్ లైన్ ద్వారా ఇంటికి గ్యాస్ వస్తుందన్నారు. రాష్ట్రానికి ఆవాస్ యోజన కింద 2 లక్షల ఇండ్లు మంజూరు చేసి వాటికి నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయలేదని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. మెట్రో మొదటి దశ పనులకు వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద రూ.1400 కోట్లు నిధులు కేటాయించామన్నారు. పీఎం కిసాన్ యోజన కింద తెలంగాణలో ఇప్పటి వరకు 39 లక్షల మంది రైతుల ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు బీబీనగర్ ఎయిమ్స్‌కు రూ.1,366 కోట్లు కేంద్రం మంజూరు చేసిందిన కిషన్ రెడ్డి తెలిపారు. ఈఎస్ఐ హాస్పిటల్స్ నిర్మాణానికి రూ.2,199 కోట్లు, ఫ్లోరోసిస్ నిర్మూలనకు రూ.796 కోట్లు, బస్తీ దవాఖానలకు రూ.902 కోట్లు విడుదల చేసిందన్నారు. రాష్ట్రంలో రూ.3,744 కోట్లతో 31 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసినట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు సైన్స్ సిటీని కేటాయించి దాని నిర్మాణానికి రూ.232 కోట్లు మంజూరు చేసినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం భూకేటాయింపులు చేపట్టలేదన్నారు. సైన్స్ సిటీకి 25 ఎకరాల స్థలం కావాలని తాను అనేక సార్లు నేను సీఎంకు లేఖలు రాశానని, అయినా పట్టించుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పు తీసుకుని ఆ భారాన్ని ప్రజలపై మోపుతోందని ఆయన ధ్వజమెత్తారు. 2020 నుంచి 2022 కరోనా కాలంలో రూ.6,950 కోట్ల రుణాన్ని కూడా కేంద్రమే భరించిందన్నారు. పీఎస్‌యూ ద్వారా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.58 వేల కోట్ల రుణాలు మంజూరుచేశామని కిషన్ రెడ్డి తెలిపారు. నాబార్డ్ ద్వారా రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని, తిరిగి చెల్లించని ర్యాంకుల్లో మాత్రం మొదటిస్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రానికి ఎటువంటి వివక్ష లేదని ఆయన చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed