లేఖ రాయకపోతే అవినీతిని ఒప్పుకున్నట్లే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
లేఖ రాయకపోతే అవినీతిని ఒప్పుకున్నట్లే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చే ఒక సదుద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘అమృత్ పథకం(Amrut Scheme)’ను ప్రవేశపెడితే.. గత బీఆర్ఎస్(BRS), ప్రస్తుత కాంగ్రెస్(Congress) ప్రభుత్వాలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతూ ఈ పథకం ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ పథకంలో అవినీతి జరిగిందని ఈ రెండూ పార్టీలు(కాంగ్రెస్, బీఆర్ఎస్) ఒకదానిపై మరొకటి ఆరోపణలు గుప్పించుకుంటూ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడి తమకు కావాల్సిన వాళ్లకే కాంట్రాక్టులు కట్టబెట్టిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే... గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపణలు చేయడం దొందుదొందే అన్న చందంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ రెండు పార్టీలు పొలిటికల్ డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.

దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కమీషన్లు కొట్టేశారన్నది వాస్తవం అని చెప్పారు. ఈ పథకంలో జరిగిన అవినీతిని వెలికితీయాలన్నా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపణల్లో నిజానిజాలు బయటకు రావాలన్నా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందుకు ‘అమృత్ పథకం’లో జరిగిన అవినీతిపై విచారణ కోరుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు లేఖ రాయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే దీనిపై విచారణ జరిపేందుకు సీవీసీని ఒప్పించేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో తాను వ్యక్తిగతంగా చొరవ చూపుతానని వెల్లడించారు.

తెలంగాణలో ‘అమృత్ పథకం’ సక్రమంగా అమలవుతుందని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని, కాంట్రాక్టు కట్టబెట్టడంలో పక్షపాతం చూపలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే తక్షణమే సీవీసీకి లేఖ రాయాలి. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్టు భావించాల్సి వస్తుందని అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం, హైడ్రా కూల్చివేతల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘అమృత్’ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని స్పష్టమవుతోంది.

Next Story

Most Viewed