Alleti Maheshwar Reddy: అసెంబ్లీ సాక్షిగా ఎన్నో అవినీతి ఆరోపణలు చేశా

by Gantepaka Srikanth |
Alleti Maheshwar Reddy: అసెంబ్లీ సాక్షిగా ఎన్నో అవినీతి ఆరోపణలు చేశా
X

దిశ, వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ(BJLP) నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాయలంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై స్వయంగా తాను ఎన్నో ఆరోపణలు చేశానని అన్నారు. ఆధారాలతో సహా కళ్లకు కట్టినట్లు చూపించానని అన్నారు. బీజేపీ తరుపున ఎప్పటికప్పుడు ప్రభుత్వ అవినీతిని ప్రజల దృష్టికి తీసుకొచ్చానని అన్నారు. కానీ కేటీఆర్.. బీజేపీ ఏం చేయనట్లుగా.. ఆయనే ఏదో కొత్తగా ఆరోపణలు చేసినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఇప్పుడు కండ్లు తెరుచుకుని ఏదో రెండు మాటలు మాట్లాడి బీఆర్ఎస్ బతికే ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

తాను అసెంబ్లీ సాక్షిగా ఎన్నో అవినీతి ఆరోపణలు చేశాను.. అప్పుడు ఎన్నడూ స్పందించని కేటీఆర్.. ఇప్పుడు నా పేరు ప్రస్తావించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే నేను సైలెంట్ అయ్యానని మాట్లాడుతున్నారు.. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. బీజేపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పారు. అసలు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ అని సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్, హరీశ్ రావు.. ఢిల్లీకి వెళ్లి కేసీ వేణుగోపాల్‌తో ఏం ఒప్పందం చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని చెప్పింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సివిల్ సప్లయ్ శాఖపై ముందు తానే మాట్లాడానని.. ఆ తర్వాత మీరు మొక్కుబడిగా మాట్లాడారని అన్నారు.

తానే స్వయంగా కేంద్ర సివిల్ సప్లయ్ మంత్రికి కలిసి లెటర్ ఇచ్చానని గుర్తుచేశారు. దీనిపై విజిలెన్స్ కమిటీ కచ్చితంగా రాబోతోందని అన్నారు. ‘ఆర్, ఆర్ఆర్, ట్రిపుల్ ఆర్, బీ-ట్యాక్స్ వంటి అన్ని అంశాలపై తాను మాట్లాడాను.. స్వయంగా మోడీ కూడా దీన్ని ప్రస్తావించారు. సుంకిశాల, యూరో ఎక్సిమ్ బ్యాంక్, అమృత్ అవినీతిపై కూడా మాట్లాడాను’ అని అన్నారు. రాష్ట్రంలో ధనబలంతో రాజకీయం సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లు తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను.. ఇదంతా వాస్తవం కాదని ఒప్పుకోండి. లేదంటే ఎంక్వైరీకి సిద్ధమవండి అని ఏలేటి సవాల్ చేశారు. కేటీఆర్, పొంగులేటి మభ్యపెట్టే రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని కోరారు.

Next Story

Most Viewed