విశ్రాంతులకు పెన్షనే జీవిగంజి..దుర్భరంగా రిటైర్డ్ కార్మికుల బతుకులు

by Aamani |
విశ్రాంతులకు పెన్షనే జీవిగంజి..దుర్భరంగా రిటైర్డ్ కార్మికుల బతుకులు
X

దిశ,బెల్లంపల్లి: తన జీవిత కాలాన్ని సింగరేణి పురోభివృద్ధికి ధారబోసిన రిటైర్డ్ కార్మికుల జీవితాలు కొన ఊపిరి కి చేరాయి. తమ శ్రమశక్తితో చేయూతనిచ్చి సింగరేణిలో సిరులు కురిపించారు. వారి జీవితాలు మాత్రం కొన ఊపిరితో కొడిగట్టి పోతున్నాయని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు వాపోతున్నారు. అరకొరగా వస్తున్న పెన్షన్ లో చరమాంక దశలో తమ జీవితాలకు భరోసా లేకుండా పోతున్నాయని వాపోతున్నారు. కనీసం పూట నింపని పెన్షన్ తో రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలు కడు దయనీయంగా మారాయి. ఎదుగుదల లేని బతుకుల్లో పెన్షన్ వారి జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నది. ఒకప్పుడు గౌరవంగా మెరుగైన జీవితాన్ని గడిపిన రిటైర్డ్ కార్మికులు ఉద్యోగ విరమణతో గత జీవిత వైభవాన్ని కోల్పోయారు.

చాలీచాలని బెనిఫిట్స్ ఉద్యోగ విరమణతో ఏ కోశానా సాంత్వన ఇవ్వలేకపోయాయి. రిటైర్డ్ కార్మికులక శేషజీవితానానికి జీవిగంజిగా పెన్షనే దిక్కయింది.కానీ అమలు నుంచి మొదలుకుని పెన్షన్ పురోగతి లేకుండా పోయింది. రిటైర్డ్ కార్మికుల జీవితాలకు ఏ మాత్రం తీసిపోని దుస్థితికి పెన్షన్ కూడా చేరింది. రిటైర్డ్ కార్మికుల జీవితాలు వారి సంక్షేమం కోసం చేపట్టిన పెన్షన్ పథకం దైన్యస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది.పెన్షన్ పెరుగుదల కోసం రిటైర్డ్ ఉద్యోగుల మెరుగైన జీవితం కోసం పట్టించుకునే ప్రభుత్వాలు, జాతీయ సంఘాలు లేవంటే అతిశయోక్తి కాదు.

కొడిగట్టిన రిటైర్డ్ బతుకులు..

సింగరేణిలో రిటైర్డ్ అయిన వేలాదిమంది కార్మికుల బతుకులు నానాటికి తీసుకట్టు గా మారిపోతున్నాయి. ఒంట్లో శక్తినంతా సింగరేణికి అర్పించి దిగిపోయిన కార్మికులు మరో పనికి చేయడానికి పనికి రాకుండా శక్తిని కోల్పోయారు. పెన్షన్ మీదనే ఆధారపడి జీవించే పరిస్థితిలో రిటైర్మెంట్ కార్మికులు ఉండటం గమనార్హం. పెన్షన్ రూ. 500 నుంచి 20 వేలకు పై చిలుక మాత్రమే వివిధ కేటగిరీల రిటైర్డ్ కార్మికుల, ఉద్యోగులకు వస్తుంది. ఇది ఎంతమాత్రం కుటుంబ పోషణకు సరిపోవు. నిత్యావసర ధరలకు పొంతన లేకుండా పెన్షన్ తో ఎలా బతికేదని రిటైర్డ్ కార్మికులు రంజిపడుతున్నారు. 11వ వేతన కాలం నాటికి పెన్షన్ పురోగతికి అతిగతి లేకుండా పోయింది. జాతీయ సంఘాలు, ప్రభుత్వాల్లో పెన్షన్ పెంచాలనే సోయే లేకుండా పోయింది. దీంతో రిటైర్డ్ కార్మికుల బ్రతుకులు ఆగమ్య గోచరంగా మారాయి.

దినదినం రిటైర్డ్ కార్మికుల జీవితాలు కరుగుతున్న కొవ్వొత్తుల వలే నీరుగారిపోతున్నాయి. ఈ పరిస్థితి రేపటి రాబోవు కార్మికులకు తప్పదనే విషయాన్ని రిటైర్డ్ కార్మికుల జీవితాలు గుర్తు చేస్తున్నాయి. సర్వీసులో ఉన్న కార్మికులు భవిష్యత్తు జీవితాలు, రిటైర్మెంట్ కార్మికుల పెన్షన్ పెరుగుదలతో ముడిపడి ఉన్నాయి. రిటైర్మెంట్ కార్మికుల తరఫున సంఘటిత కార్మికులు మరోసారి ఉద్యమ శంఖారావాన్ని పూరించాలి. రిటైర్డ్ కార్మికుల జీవించే హక్కు ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో పెన్షన్ పురోగతి కోసం సర్వీస్ కార్మికులే ఉద్యమ బాట పట్టాలి. విశ్రాంతి కార్మికులు సైతం తమకు పెన్షన్ సరిపోవడం లేదని సింగరేణిలో ఆందోళన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఉత్పత్తి సంబంధాల నుండి దూరమైన రిటైర్డ్ కార్మికుల ఆందోళన, ఆవేదన ప్రభుత్వాలకు, జాతీయ సంఘాలకు వినిపించడం లేదు.

అంపశయ్యపై పెన్షన్ స్కీమ్..

సింగరేణిలో దిగిపోయిన వేలాది మంది రిటైర్డ్ కార్మికులకు ఇస్తున్న పెన్షన్ పథకం అంపశయ్యపై ఉందన్న ప్రచారం జరుగుతోంది ది. ఎలాంటి పెరుగుదల కు తావు లేకుండా అమలవుతున్న పెన్షన్ కొనసాగింపు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెన్షన్ రద్దు చేయాలని దురాలోచనతో టే పెరుగుదలను విస్మరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.. ఈ లెక్కన రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ అమలు కు గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. బడ్జెట్ సపోర్టు లేకుండా పోయింది. అంతేకాకుండా సింగరేణి పురోగతి, బొగ్గు ఉత్పత్తితో వీడిన పరిస్థితి రిటైర్డ్ కార్మికుల పై చిన్నచూపు, పెన్షన్ పై ప్రభావం కనిపిస్తుంది. భవిష్యత్ కార్మిక తరాలకు పెన్షన్ స్కీం అందుతుందో లేదో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా జాతీయ కార్మిక సంఘాలు మేల్కొనాలి. పెన్షన్ స్కీo ను పదిలపరుచుకుంటూనే దాని పెరుగుదలపై పోరాడాలి. రిటైర్డ్ కార్మికులకు అండగా నిలవాల్సిన అవసరం సింగరేణి కార్మికలోకంపై ఎంతైనా ఉంది.

Next Story

Most Viewed