చందమామపై భారీ బిలాన్ని గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్

by Y. Venkata Narasimha Reddy |
చందమామపై భారీ బిలాన్ని గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్
X

దిశ, వెబ్ డెస్క్ : చంద్రుడి దక్షిణ ధ్రువంపై సంచరిస్తున్న చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ తన అన్వేషణలు కొనసాగిస్తునే ఉంది. తాజాగా ప్రజ్ఞాన్ రోవర్ కు అమర్చిన ఆప్టికల్ కెమెరాలు చంద్రుడిపై భారీ బిలానికి సంబంధించిన ఫొటోలను తీసి పంపించినట్లుగా అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రజ్ఞాన్ రోవర్ ఫోటోల ఆధారంగా చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ సమీపంలో 160 కిలోమీటర్ల వెడల్పులో భారీ బిలం (పెద్ద గొయ్యి) ఉన్నట్లు సైన్స్ డైరెక్ట్ జర్నల్ పబ్లిష్ చేసింది. ఈ బిలం ఆచూకీ బయటపడటంతో చంద్రుడి భౌగోళిక చరిత్ర..దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాల పరిశోధనలకు అవకాశం ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇటీవల చంద్రయాన్-3 ప్రయోగంలోనూ రోవర్ నీటి జాడలను గుర్తించింది. చంద్రుడి ఉపరితలంపై నిత్యం చీకట్లోనే ఉండే ప్రాంతంలో మంచు రూపంలో భారీ నీటి నిల్వలు ఉన్నట్లు అంతరిక్ష పరిశోధకులు గతంలో గుర్తించారు. అయితే, అసలు వాతావరణమే లేని చంద్రుడి ఉపరితలంపై నీరు ఎలా ఏర్పడిందనే విషయానికి సంబంధించి సైంటిస్టులలో స్పష్టత కొరవడింది. తాజా పరిశోధనలో చంద్రుడిపై నీరు ఏర్పడడానికి కారణం భూమిపై ఉన్న శక్తిమంతమైన ఎలక్ట్రాన్లేనని యూనివర్సిటీ ఆఫ్ హవాయి శ్రాసవేత్తల పరిశోధనలో తేలింది. పరిశోధనలో భాగంగా మన దేశం గతంలో చేపట్టిన చంద్రయాన్-1 మిషన్ లో సేకరించిన వివరాల అధ్యయనంతో ఈ అభిప్రాయానికి వచ్చారు. భూమిపై ఉన్న శక్తిమంతమైన ఎలక్ట్రాన్లు చంద్రుడి ఉపరితలంపై ఉన్న రాళ్లు, మినరల్స్ ను కరిగించి నీటి పుట్టుకకు కారణమై ఉంటాయని గుర్తించారు. చంద్రుడిపై నీటి జాడలు ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనలలో వెల్లడైన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed