Sheikh Hasina: చిన్మోయ్ కృష్ణ దాస్‌ను వెంటనే రిలీజ్ చేయాలి.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

by vinod kumar |
Sheikh Hasina: చిన్మోయ్ కృష్ణ దాస్‌ను వెంటనే రిలీజ్ చేయాలి.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ (Chittagang)లో లాయర్ హత్య, హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్‌ (Krishna das)ను అరెస్టు చేయడాన్ని మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తీవ్రంగా ఖండించారు. కృష్ణ దాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో అనేక మంది ప్రతిపక్ష నాయకులు, విద్యార్థులపై దాడులు, అరెస్టులు జరుగుతున్నాయని అటువంటి అరాచక కార్యకలాపాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సనాతన్ ధర్మ సంఘానికి చెందిన ఒక అగ్ర నాయకుడిని అన్యాయంగా అరెస్టు చేశారు. అతన్ని వెంటనే విడుదల చేయాలి. చిట్టగాంగ్‌లో దేవాలయాలను తగులబెట్టారు. గతంలో అహ్మదీయ సమాజానికి చెందిన మసీదులు, పుణ్యక్షేత్రాలు, చర్చిలు, మఠాలు, ఇళ్లపై దాడులు జరిగాయి. అన్ని వర్గాల ప్రజల మతస్వేచ్ఛను కాపాడాలి. వారి ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలి’ అని పేర్కొన్నారు.

మహ్మద్ యూనస్ (Mohammad younas) నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా అధికారాన్ని చేజిక్కించుకుందని, మానవ హక్కులను పరిరక్షించడంలో విఫలమైందని ఆరోపించారు. లాయర్‌ను హత్య చేసిన వారికి కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ‘రాజ్యాంగ విరుద్ధంగా అధికారాన్ని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఉగ్రవాదులను శిక్షించడంలో విఫలమైతే, అది మానవ హక్కులను ఉల్లంఘించినందుకు కూడా శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది’ అని తెలిపారు. హింస, అభద్రతకు వ్యతిరేకంగా పౌరులు ఏకం కావాలని కోరారు.

Advertisement

Next Story